చెరపకురా చెడేవు.. అన్న సామెత పాకిస్తాన్‌కు అచ్చంగా అతికినట్టు సరిపోతుంది. భారత్ నుంచి కశ్మీర్‌ను విడగొట్టడానికి దశాబ్దాలుగా కుట్రలు చేస్తూ వచ్చిందా దేశం. అందుకు మిలటరీని, నిఘా సంస్థలను ఉసిగొల్పింది. అవి కాస్తా సొంతంగా ఉగ్రవాదమనే భూతాన్ని సృష్టించాయి. దాన్ని ఉసి గొలిపి.. జిహాద్ పేరిట విధ్వంసాన్ని పాక్ సృష్టించింది. కానీ, చేసిన పాపం ఊరికేపోదు కదా.. ఇప్పుడు పీవోకే రూపంలో తాను తవ్వుకున్న గోతిలోనే తానే పడుతోంది. సింపుల్‌గా చెప్పాలంటే భారత్‌ను విడగొట్టాలని పగటి కలలు కన్న పాకిస్తానే తానే ముక్కలుగా మారేందుకు సిద్ధమైంది. ఎందుకంటే, ఇస్లామాబాద్ ఎదుర్కొంటున్న సమస్య పీవోకే ఒక్కటే కాదు.. అంతకుమించిన కథ చాలానే ఉంది.
బలూచిస్తాన్.. ప్రస్తుతం పాక్ ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్ ఇది. 1948లో బలూచ్ ఖాన్‌ను మోసం చేసి, బలవంతంగా ఆక్రమించుకున్న ఈ భూభాగం.. ఇటీవలే స్వాతంత్ర్యం ప్రకటించుకుంది. ఇటీవల 10 నగరాల్లో ఏకకాలంలో దాడులు జరపడం పాక్ రక్షణ వ్యవస్థను కుప్పకూల్చింది. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ స్వయంగా పార్లమెంట్లో నిలబడి, "దేశం ముక్కలవుతోంది.. రెండు రాష్ట్రాలు చేజారిపోతున్నాయని వాపోవడమే అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది. బలూచ్‌లో పాకిస్తాన్‌కు ఎదురవుతున్న మరో విచిత్రమైన, అత్యంత ప్రమాదకరమైన సవాలు.. అక్కడ ఇద్దరు భిన్నమైన సిద్ధాంతాల శత్రువులు ఒకేసారి దాడి చేయడం. ఒకవైపు తమ స్వతంత్ర దేశం కోసం పోరాడుతున్న జాతీయవాద గ్రూపు BLA అయితే.. మరోవైపు పాక్‌లో కఠిన ఇస్లామిక్ షరియా చట్టాన్ని అమలు చేయాలనే లక్ష్యంతో ఉన్న ఉగ్రవాద సంస్థ తెహ్రీక్-ఎ-తాహ్రీక్ పాకిస్తాన్. ఇటీవల జియారత్ జిల్లాలో TTP ఉగ్రవాదులు పోలీస్ పోస్టును ముట్టడించి, పోలీసులను అపహరించి సామూహికంగా ఉరితీయడం సంచలనం సృష్టించింది.
ఖైబర్ పఖ్తుంఖ్వా.. ఇది పాక్ ఎదుర్కొంటున్న రెండో సవాల్. TTP ఉగ్రవాదులు వజీరిస్తాన్, బన్ను, బాజౌర్ జిల్లాల్లో సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. నిత్యం పేలుళ్లు, సైనిక పోస్టులపై దాడులతో ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతం రక్తాసిక్తమవుతోంది. కేవలం 2025లోనే పాకిస్తాన్లో వేర్పాటు వాదుల దాడుల వల్ల 1,139 మంది మరణించారని గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ స్పష్టం చేసింది. ఇది 2013 తర్వాత అత్యధికం. ఒకప్పుడు కేవలం గెరిల్లా దాడులకే పరిమితమైన TTP, ఇప్పుడు సరికొత్త సాంకేతికతను అందిపుచ్చుకుంది. కమర్షియల్ క్వాడ్కాప్టర్లు, డ్రోన్లను ఉపయోగించి పాక్ ఆర్మీ, పోలీస్ స్టేషన్లపై ఆకాశం నుండి బాంబుల వర్షం కురిపిస్తోంది. నిఘా వ్యవస్థలను నిర్వీర్యం చేస్తోంది. ఈ విధమైన బహుముఖ యుద్ధాన్ని తట్టుకునే శక్తి పాక్ దళాలకు లేదు. భద్రతా కారణాల రీత్యా అమెరికా తన పెషావర్ రాయబార కార్యాలయాన్ని మూసివేయడం చూస్తుంటే.. ఈ ప్రాంతంపై పాక్ ప్రభుత్వం ఎంతగా నియంత్రణ కోల్పోయిందో అర్థమవుతోంది.
ఇక మూడో ముప్పు.. పాక్ ఆక్రమిత కశ్మీర్. జమ్మూ కశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ నేతృత్వంలో లక్షలాది మంది ప్రజలు ఇస్లామాబాద్ పాలకులపై తిరగబడ్డారు. విపరీతమైన ధరలు, పిండి, విద్యుత్ కొరతపై మొదలైన ఈ ఉద్యమం.. ఇప్పుడు హక్కులు, విముక్తి పోరాటంగా మారింది. భారత్‌లో విలీనమైన జమ్మూ కశ్మీర్ అభివృద్ధిని చూస్తున్న PoK ప్రజలు.. తమను పాకిస్తాన్ కేవలం ఒక వలస ప్రాంతంగా వాడుకుంటోందని గ్రహించారు. PoKలో ప్రజా నిరసనలను అణచివేయడానికి ఆర్మీ చీఫ్ మునీర్ ఏకంగా 8వేల మంది అదనపు పారామిలిటరీ బలగాలను పంపాడు. ఇంటర్నెట్ బంద్ చేశారు, కాల్పులు జరిపారు, నాయకులను యాంటీ టెర్రరిజం చట్టాల కింద జైల్లో పెట్టారు. అయినా జనం వెనక్కి తగ్గడం లేదు. ఈ తిరుగుబాటు ఇస్లామాబాద్‌కు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఇది మాత్రమే కాదు, సింధ్ ప్రావిన్స్ సైతం స్వేచ్ఛ కోసం పోరాడుతోంది. సింధుదేశ్‌గా అవతరించేందుకు రక్తం చిందిస్తోంది.
ఇక నాలుగో సవాల్.. తాలిబన్లు. 2021లో ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్లు అధికారంలోకి వచ్చినప్పుడు కాబూల్‌లో టీ తాగుతూ సంబరాలు చేసుకుంది పాక్ ఆర్మీ. భారత్‌కు వ్యతిరేకంగా ఆఫ్ఘన్ భూభాగాన్ని వాడుకోవచ్చని కలలు కన్నారు. కానీ ఐదేళ్లు తిరిగేసరికి ఆ కలే ఇప్పుడు పీడకలగా మారింది. పాక్‌ను ముంచుతున్న TTPకి ఆఫ్ఘన్ తాలిబాన్లు ఆశ్రయం ఇస్తున్నారు. దీనితో ఆగ్రహించిన పాక్ ఆర్మీ సరిహద్దులు దాటి ఆఫ్ఘాన్‌పై వైమానిక దాడులు చేసింది. దీనికి ప్రతిచర్యగా, తాలిబాన్ దళాలు పాక్ సరిహద్దు పోస్టులపై భారీగా ఫిరంగులు, డ్రోన్లతో విరుచుకుపడ్డాయి. నాడు మిత్రులుగా ఉన్నవారే నేడు కరడుగట్టిన శత్రువులుగా మారి డ్యూరాండ్ లైన్‌ను రణరంగం చేశారు. పాక్ ఈ నాలుగు అంతర్గత సంక్షోభాల్లో కూరుకుపోవడం వెనుక.. దశాబ్దాలుగా ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన దాని పాపమే కారణం. "ఈ ప్రాంతంలో త్వరలో ఒక కొత్త దేశం పుట్టబోతోంది.. దాని పేరు ఊహించండి" అంటూ ఆఫ్ఘన్ మాజీ నిఘా చీఫ్ అమ్రుల్లా సలేహ్ సైతం సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. సో.. ఆ కొత్త దేశం బలూచిస్తాన్ కావచ్చు, లేక పాక్ ఆక్రమిత కశ్మీర్ కూడా కావచ్చు. ఈ పరిణామాలన్నీ పాక్ కథ క్లైమాక్స్‌కు చేరిందనే చెబుతున్నాయి.