Top story: పుణె పోర్షే కారు ప్రమాదం… కేసు నిందితులకు బెయిల్‌… 2 ప్రాణాలు తీసి సిగ్గులేకుండా సంబరాలా ?

పుణెలో జరిగిన పోర్షే కారు యాక్సిడెంట్ మీకు గుర్తుండే ఉంటుంది. ఆ రోజు పోర్షే కారు టైర్ల కింద నలిగిపోయింది ఇద్దరు యువతీయువకుల ప్రాణాలు మాత్రమే కాదు.. న్యాయ వ్యవస్థపై సామాన్యుడికి మిగిలి ఉన్న కాస్తోకూస్తో నమ్మకం కూడా.

Post Published By: dialnews
Updated : 29 May 2026, 10:11 AM IST

పుణెలో జరిగిన పోర్షే కారు యాక్సిడెంట్ మీకు గుర్తుండే ఉంటుంది. ఆ రోజు పోర్షే కారు టైర్ల కింద నలిగిపోయింది ఇద్దరు యువతీయువకుల ప్రాణాలు మాత్రమే కాదు.. న్యాయ వ్యవస్థపై సామాన్యుడికి మిగిలి ఉన్న కాస్తోకూస్తో నమ్మకం కూడా. నిందితుడికి కరెన్సీ దండలు వేసి, డ్యాన్సులతో ఘన స్వాగతం పలకడం చూస్తుంటే ఇది సంబరంలా లేదు.. చట్టాన్ని, కోర్టులను చూసి ఒక ధనిక కుటుంబం వేస్తున్న అహంకారపు అట్టహాసంలా ఉంది.మే 19, 2024న తెల్లవారుజామున పుణెలోని కల్యాణీ నగర్ ప్రాంతంలో ఓ పోర్షే కారు కంట్రోల్‌ లేకుండా వచ్చి ఢీ కొట్టండంతో ఇద్దరు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు అక్కడికక్కడే చనిపోయారు. ఈ కారు నడిపింది 17 ఏళ్ల మైనర్‌. కేవలం తన తండ్రి బాగా బలిసినోడు అనే ఒకే ఒక్క కారణంతో ఒళ్లు తెలియకుండా తాగి అ పిల్లాడు చేసిన పని.. రెండు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు ఆ మైనర్‌ను అరెస్ట్‌ చేశారు. కానీ జువైనల్ జస్టిస్ బోర్డు కేవలం 15 గంటల్లోనే అతనికి బెయిల్ మంజూరు చేసింది. రోడ్డు భద్రతపై "300 పదాల వ్యాసం రాయాలి" అనే సింపుల్‌ కండీషన్‌తో అబ్బాయికి బెయిల్‌ ఇవ్వడం అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రజాగ్రహం వెల్లువెత్తడంతో పోలీసులు జువైనల్ బోర్డును ఆశ్రయించి మే 22న అతని బెయిల్ రద్దు చేయించి అబ్జర్వేషన్ హోమ్‌కు తరలించారు.

ఈ కేసులో మైనర్‌ను కాపాడేందుకు అతని కుటుంబం, ఆసుపత్రి సిబ్బందితో కలిసి ఆడిన నాటకం బయటపడటంతో పోలీసులు మొత్తం 12 మందికి పైగా అరెస్ట్ చేశారు. డ్రైవింగ్ లైసెన్స్ లేని మైనర్ కొడుకుకు కారు ఇవ్వడం, అతను పబ్‌లో మద్యం తాగేందుకు అనుమతించినందుకు మైనర్ తండ్రి విశాల్ అగర్వాల్‌ను అరెస్ట్ చేశారు. నేరం తనమీద వేసుకోవాలని, కారు తానే నడిపానని చెప్పాలని తమ కారు డ్రైవర్‌ను బెదిరించి, నిర్బంధించినందుకు మైనర్ తాత సురేంద్ర అగర్వాల్‌ను అరెస్ట్ అయ్యారు. మైనర్ కొడుకు మద్యం తాగలేదని నిరూపించేందుకు, సస్సూన్ ఆసుపత్రిలో కొడుకు బ్లడ్ శాంపిల్స్ స్థానంలో తన రక్తాన్ని మార్చినందుకు మైనర్ తల్లి శివానీ అగర్వాల్‌ను అరెస్ట్ చేశారు. 3 లక్షలు లంచం తీసుకుని రక్తపు నమూనాలను మార్చిన సస్సూన్ ఆసుపత్రి ఫోరెన్సిక్ విభాగాధిపతి డా. అజయ్ తావరే, మెడికల్ ఆఫీసర్ డా. శ్రీహరి హల్నోర్, ఒక అటెండర్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా మైనర్లకు మద్యం సరఫరా చేసినందుకు కోజీ, బ్లాక్ పబ్‌లకు చెందిన యజమానులు, మేనేజర్లు నలుగురిని కూడా అరెస్ట్ చేశారు. ఇలా ఆ ఒక్క పిల్లాడు బలుపెక్కి చేసిన పనికి ఇంత మంది ఊచలు లెక్కబెట్టాల్సి వచ్చింది.

చట్టంలోని లొసుగులు వాడుకుని, ప్రాణాలు తీసిన కేసులోంచి బయటపడటం ఒక ఎత్తైతే.. కనీస పశ్చాత్తాపం, మానవత్వం లేకుండా అతడిని ఒక యుద్ధం గెలిచిన విజేతలా ఇంటికి ఆహ్వానించడం మరో ఎత్తు. ఇది అత్యంత హేయమైన చర్య. ఈ డ్యాన్సులు, కరెన్సీ దండల సంబరాలు చూస్తుంటే.. "మా దగ్గర డబ్బుంది, మేం ఎంతమంది ప్రాణాలైనా తీయగలం, న్యాయాన్ని కొనేయగలం" అని సమాజాన్ని చూసి ఈ ఫ్యామిళీ పకపకా నవ్వుతున్నట్టుగా ఉంది. కన్న బిడ్డలను కోల్పోయి, జీవితకాలం తీరని శోకంలో విలపిస్తున్న ఆ బాధిత కుటుంబాలు ఈ వీడియో చూస్తే వారి గుండెలు ఎంతలా రగిలిపోతాయో ఊహించగలమా. ఇలాంటి దుర్మార్గాలు సామాన్యుడి మదిలో ఎన్నో పదునైన ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి. చట్టాలు, న్యాయాలు కేవలం నిరుపేదలకేనా ? కోటీశ్వరులు ఎన్ని ప్రాణాలు తీసినా సరే, డబ్బుతో ఆ రక్తం మరకలను కడిగేసుకోవచ్చా ? నేరం చేసిన వాడికి కరెన్సీ దండలు వేసి సన్మానించే ఈ సమాజం ఎటు పోతోంది ? రెండు ప్రాణాలు తీసినా చట్టం మా వెంట్రుక కూడా పీకలేకపోయిందన్న ధిక్కారం ఆ సంబరాల్లో కనిపిస్తోంది. ఈ వేడుకలు.. అంగబలం, అర్థబలం ముందు మన వ్యవస్థలు ఎంత నిస్సహాయంగా ఉన్నాయో చెప్పకనే చెబుతున్నాయి.

 

Published : 
  • 29 May 2026, 10:11 AM IST