"48 గంటలే డెడ్‌లైన్.. ఇరాన్ లొంగిపోవాల్సిందే". మార్చి 21 రాత్రి ట్రంప్ ఇచ్చిన మాస్ వార్నింగ్ ఇది. "ఇరాన్‌పై దాడులకు ఐదు రోజులు విరామం ఇస్తున్నాం, ఇరు దేశాల మధ్య జరిగిన చర్చలే దీనికి కారణం". మార్చి 24న ఉదయం అదే ట్రంప్ చేసిన ప్రకటన ఇది. కానీ, ఈ గ్యాప్‌లో అసలేం జరిగింది? విధ్వంసం తప్పదన్న నోటితోనే విరామం ప్రకటించడానికి కారణాలేంటి? ట్రంప్ తగ్గాడా? లేక తగ్గాల్సి వచ్చిందా? ఓటమిని అంగీకరించాడా? ఇరాన్ భయపెట్టిందా? ఆ కొద్ది గంటల్లో అసలేం జరిగింది? అసలు ఈ యుద్ధ విరామం నిజమా? లేక దీని వెనుక ట్రంప్ మార్క్ ట్రాప్ ఏదైనా ఉందా?
విధ్వంసం తప్పదనుకున్న ఇరాన్ యుద్ధం అనుకోని మలుపు తిరిగింది. ఐదు రోజుల విరామం ప్రకటనతో ఈ యుద్ధం ముగిసి పోయినట్టు కాదు, కానీ ఆ దిశగానే పయనిస్తోంది. అందుకు ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. ఇందులో మొదటిది అమెరికా మోస్ట్ అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్ ఎఫ్-35పై ఇరాన్ జరిపిన దాడి. రెండోది నాలుగు వేల కిలోమీటర్ల దూరంలోని డియెగో గార్సియాపై ఇరాన్ జరిపిన మిస్సైల్ అటాక్. ఈ రెండే ట్రంప్‌ను నిలువునా వణికించాయి. ఈ రెండు సందర్భాలు కూడా ఇరాన్ సైనిక శక్తిని అమాంతం పెంచేశాయి. ఇరాన్ బహిరంగంగా ప్రకటించిన దానికి, వాస్తవానికి భిన్నంగానే యావత్ ప్రపంచానికి అనిపించింది. అయితే ఇప్పుడు ట్రంప్ ప్రకటనతో వాటికి బలం చేకూరనట్లయ్యింది. ఈ క్రెడిట్ పుతిన్‌దే. ఎందుకంటే, ఇరాన్ బాలిస్టిక్ మిస్సైల్ ప్రోగ్రాంకు రష్యా మద్దతే కీలకం. ముఖ్యంగా అండర్ గ్రౌండ్ క్షిపణి సిటీల వెనుక పుతిన్ వ్యూహాలు ఉన్నాయంటారు. అసలైన మిసైల్ ప్రోగ్రామ్ అండర్ గ్రౌండ్లో జరుగుతుండగా ఇజ్రాయెల్, అమెరికా దాడులకోసం కొన్ని ఫ్యాక్టరీలని వదిలేశారు. వాటిపై దాడి చేసి ఇరాన్ ఇక క్షిపణి ప్రయోగించే శక్తిని కోల్పోయిందని స్టేట్మెంట్ ఇచ్చేసాడు ట్రంప్. ట్రంప్ స్టేట్మెంట్ ఇచ్చిన రెండో రోజే ఇరాన్ ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్‌తో డియెగో గార్సియా దీవులవైపు సంధించి షాక్ ఇచ్చింది.
అమెరికా, బ్రిటన్ దేశాకి బయట ఉన్న అతి పెద్ద సైనిక స్థావరం డియెగో గార్సియా. మూడో ప్రపంచ యుద్ధమంటూ మొదలైతే రష్యా, చైనా కలిసి మొదట దాడి చేసి ధ్వంసం చేసేది దీనినే. ఈ బేస్ నాశనమైతే ఆసియా, హిందూ మహాసముద్రంలో US, బ్రిటన్‌కు పట్టుండదు. గల్ఫ్ ప్రాంతంలో అమెరికా పాత్ర పెద్దగా ఉండదు. ఇంత ప్రాధాన్యత ఉన్న ప్రదేశం కాబట్టే రష్యా ఇరాన్‌తో దీనిపై దాడి చేయించింది. ఒక రకంగా ఇరాన్ చేసిన ఈ దాడి పుతిన్ అమెరికాతో పాటు నాటో దేశాలకి చేసిన హెచ్చరిక. ఇరాన్ మిసైళ్ల పరిధి 2వేల కిలోమీటర్లే అని అమెరికా, ఇజ్రాయెల్ భావించాయి. ఇరాన్ ప్రధాన టార్గెట్ ఇజ్రాయెల్ కాబట్టి 2వేల కిలోమీటర్ల వరకే పరిమితం అవుతుందని నమ్మారు. కానీ, తాజా ప్రయోగంతో ఇరాన్ మిసైల్ పరిధిలోకి మొత్తం పశ్చిమాసియా, మధ్య ఆసియాతో పాటు పాక్, భారత్‌లోని పశ్చిమ భాగం, తూర్పు ఆఫ్రికా, రోమ్, ఏథెన్స్, బుడాపేస్ట్, వార్సా, వియన్నా వచ్చేశాయి. ఉక్రెయిన్ కూడా చాలా క్లోజ్ డిస్టెన్స్లోకి వచ్చేసింది. కాబట్టి ఈ యుద్ధం సుదీర్ఘంగా కొనసాగితే ఏం జరుగుతుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.
డియెగో గార్సియాతో పాటు అమెరికాలోని కాలిఫోర్నియా మా తదుపరి టార్గెట్ అని ఇరాన్ విదేశాంగ మంత్రి ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు అంటే ICBM దిశగా ఇరాన్ అడుగులు వేస్తున్నట్లుగా భావించాలి. ఒక్కసారి ఇరాన్ చేతికి ICMBలు చిక్కితే అమెరికా, పాశ్చాత్య దేశాలపై సంధించడం పెద్ద విషయం కాదు.. అప్పుడు ఈ యుద్ధం మూడో ప్రపంచ యుద్ధంగా మారుతుంది. ఈ పరిణామాలే అమెరికాను వెనుకడుగేసేలా చేశాయి. పైగా అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా చేసిన ఈ యుద్ధం.. అమెరికా పౌరులకు ఏమాత్రం ఇష్టం లేదు. ఇక్కడ అమెరికా పౌరులకే కాదు.. యావత్ ప్రపంచంలో ఎవ్వరికీ ఈ యుద్ధం ఇష్టం లేదు. యుద్ధంలో ఎవరు గెలిచినా.. నష్టపోయేది ప్రజలే కాబట్టి.. దీన్ని ఎవరూ స్వాగతించలేదు. ఇక్కడ గెలుపు విషయాన్ని పక్కన పెడితే, దీని వల్ల ఎన్నో కుటుంబాలు ప్రభావితం అవుతాయనేది అందరికి తెలుసు కానీ, మూడు దేశాల్లో జరగాల్సిన విధ్వంసం ఇప్పటికే జరిగిపోయిన తర్వాత ట్రంప్ తీసుకున్న నిర్ణయం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక్కడ ఆ యుద్ధానికి దిగిన ఆ మూడు దేశాలు తీవ్రంగా నష్టపోతే.. ప్రపంచ దేశాలపై కూడా ఎక్కువగానే ప్రభావం చూపింది.
మూడు వారాలకు పైగా భారీ విధ్వంసానికి కారణమైన ట్రంప్.. ఇప్పుడు శాంతి మంత్రం జపిస్తున్నాడు. పశ్చిమాసియాలో శాంతి కోసం కృషి చేస్తాం అంటూ ప్రకటించేశాడు. అంటే అందితే జట్టు.. అందకపోతే కాళ్లు పట్టుకోవడమనేది డొనాల్డ్ ట్రంప్ నైజమనేది మరోసారి రుజువైంది. అప్పుడు వెనెజువెలా మాజీ అధ్యక్షుడు మదురోను బంధించి తీసుకొచ్చిన ట్రంప్.. ఇప్పుడు ఇరాన్ విషయంలో ఆయనకు ఆయనే తగ్గారనేది వాస్తవం. ఇక్కడ ట్రంప్ వెనక్కి తగ్గాడనడం కంటే కూడా అమెరికా ఓడిపోయింది అనేదే నిజం. ప్రస్తుతానికి పరువు కాపాడుకోడానికి ఇరాన్ సైనిక స్థావరాలపై దాడులు నిర్వహిస్తుండొచ్చు. కానీ, ఈ యుద్ధంలో చివరివరకూ అమెరికా ఉండదు. నెతన్యాహుకు బాధ్యత అప్పగించి సైడ్ అయిపోవచ్చు. అమెరికాకు ఇదేం కొత్త కాదు.. వియత్నాం, ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్లోఇదే చేసింది. ఇరాన్ విషయంలోనూ అదే చేయబోతోంది. సింపుల్‌గా చెప్పాలంటే, అమెరికా చరిత్రలో ఏ యుద్ధాన్నీ విజయవంతంగా ముగిచలేదు.. భవిష్యత్‌లో ముగించలేదు కూడా.