Dail view: కాంగ్రెస్‌లో కుమ్ములాట వచ్చే ఎన్నికల్లో కష్టమేనా ?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు, వర్గ పోరు రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తున్నాయి. ప్రభుత్వం ఏర్పడి పాలన సాగిస్తున్నప్పటికీ, జిల్లాల స్థాయి నుండి రాజధాని వరకు పార్టీ నాయకుల మధ్య ఆధిపత్య పోరు రచ్చకెక్కుతోంది.

Post Published By: dialnews
Updated : 20 August 2026, 10:04 AM IST

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు, వర్గ పోరు రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తున్నాయి. ప్రభుత్వం ఏర్పడి పాలన సాగిస్తున్నప్పటికీ, జిల్లాల స్థాయి నుండి రాజధాని వరకు పార్టీ నాయకుల మధ్య ఆధిపత్య పోరు రచ్చకెక్కుతోంది. పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గం, అలాగే పార్టీలోని ఇతర సీనియర్ నేతలు, ఎమ్మెల్యేల మధ్య సమన్వయ లోపం బహిరంగ విమర్శలకు దారితీస్తోంది.స్థానిక రాజకీయం, పార్టీ పదవులు, ప్రభుత్వ నామినేటెడ్ పదవులు, రాబోయే ఎన్నికల టికెట్ల రేసు తదితర అంశాలే ఈ విభేదాలకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. ఇది కేవలం కొన్ని ప్రాంతాల్లోనేనా అంటే.. కాదు. రాష్ట్రంలోని దాదాపు అన్ని ఉమ్మడి జిల్లాల్లోనూ నేతల నడుమ పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి.

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో బిసి సంక్షేమ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. జిల్లా అభివృద్ది కార్యక్రమాలకు వివేక్‌కు ఆహ్వానం అందకపోవడం, వివేక్‌ తనయుడు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ కార్యక్రమాల్లో మంచిర్యాల నియోజకవర్గంలో గొడవలు జరగడం వంటివి రచ్చకెక్కాయి.ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తిలో ఎమ్మెల్యే మేఘారెడ్డి, సీనియర్ నేత చిన్నారెడ్డిల మధ్య ఆధిపత్య పోరు తీవ్రస్థాయికి చేరింది. మేఘారెడ్డి డబ్బులిచ్చి ఎమ్మెల్యే టికెట్ కొనుక్కున్నారంటూ తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. అలాగే మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి వ్యవహారం కూడా పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఇక కరీంనగర్ జిల్లాలో మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ మధ్య విభేదాలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. దీంతో పాటు మంత్రి వివేక్ వర్గానికి ఇతరులకు నడుమ ఏకంగా ఘర్షణలు కొనసాగుతున్నాయి.

మరోపక్క నల్గొండలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జానారెడ్డి వర్గాల మధ్య పరస్పర విమర్శలు గుప్పుమంటున్నాయి. భువనగిరిలో ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి, కేవై రాజగోపాల్ రెడ్డిల మధ్య, అలాగే తుంగతుర్తి ఎమ్మెల్యే మందుముల శామ్యూల్ ప్రోటోకాల్ వివాదం చుట్టూ రగడ తీవ్రమైంది.ఇవి చాలవన్నట్టు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాట్రాక్ట్ వ్యాఖ్యలపై నేరుగా విమర్శలు గుప్పించడం, తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. అలాగే మరో నేత పోచారం శ్రీనివాస్ రెడ్డి, కేసీఆర్ పట్ల నర్మగర్భ వ్యాఖ్యలు చేయడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇక హైదరాబాద్, ఇతర జిల్లాల్లోని ఎమ్మెల్యేల తీరు కూడా అధిష్టానానికి తలనొప్పిగా మారింది.

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దాసం నాగెందర్ రీసెంట్‌గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో.. కేసీఆర్, కేటీఆర్‌లను ఆకాశానికెత్తడం, పోచారం శ్రీనివాస్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి వంటి నేతలు కేసీఆర్ బాటలోనే ఉన్నారనే సంకేతాలు ఇవ్వడం చర్చనీయాంశమైంది. వరంగల్‌లో కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సురేష్ నాయక్ లాంటి నేతల మధ్య ఆధిపత్య పోరు చిన్నపాటి యుద్ధంలా సాగుతోంది.ఈ అంతర్గత తిరుగుబాట్లు, నేతల వివాదాస్పద వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి నాయకత్వానికి సవాల్‌గా మారాయి. రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయం సాధించాలంటే, పాలనతో పాటు పార్టీలోని అసమ్మతిని నియంత్రించడం అత్యంత కీలకం. పార్టీ వీక్ అయితే ప్రతిపక్షాలకు లాభించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అధిష్టానం తక్షణమే కల్పించుకుని అంతర్గత పోరుకు చెక్ పెట్టకపోతే, కాంగ్రెస్ ప్రతిష్ఠ దెబ్బతినడంతో పాటు ఏకంగా అధికారమే చేజారిపోయే ప్రమాదం ఉంది.

Published : 
  • 20 August 2026, 10:04 AM IST