Top story: అమెరికా-రష్యాతో జైశంకర్ డీలింగ్స్.. మాస్కోలో జరిగిన టాప్ సీక్రెట్ ఇదే..!

ప్రపంచం రెండు వర్గాలుగా చీలిపోయి అగ్నిగుండంలా మారుతున్న వేళ.. అటు వాషింగ్టన్‌ను, ఇటు మాస్కోను ఏకకాలంలో డీల్ చేయగల ఏకైక గ్లోబల్ పవర్ భారత్ మాత్రమేనా? మాస్కో వేదికగా ఇప్పుడు సరిగ్గా అదే దృశ్యం ఆవిష్కృతమైంది.

Post Published By: dialnews
Updated : 27 August 2026, 4:00 PM IST

ప్రపంచం రెండు వర్గాలుగా చీలిపోయి అగ్నిగుండంలా మారుతున్న వేళ.. అటు వాషింగ్టన్‌ను, ఇటు మాస్కోను ఏకకాలంలో డీల్ చేయగల ఏకైక గ్లోబల్ పవర్ భారత్ మాత్రమేనా? మాస్కో వేదికగా ఇప్పుడు సరిగ్గా అదే దృశ్యం ఆవిష్కృతమైంది. ఒకవైపు భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ క్రెమ్లిన్‌లో వ్లాదిమిర్ పుతిన్, సెర్గీ లావ్రోవ్‌లతో దౌత్య, వాణిజ్య బంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటున్నారు. సరిగ్గా అదే సమయంలో, ఎవరికీ తెలియకుండా అమెరికా సీఐఏ డైరెక్టర్ జాన్ రాట్‌క్లిఫ్ మిలిటరీ విమానంలో మాస్కోలో ల్యాండయ్యారు. ఇది కేవలం కాకతాళీయమా? లేక గ్లోబల్ పవర్ ప్లేలో భారత్ పోషిస్తున్న అదృశ్య వారధి పాత్రకు నిదర్శనమా? జైశంకర్ మాస్కో మిషన్ వెనుక అసలు వ్యూహం ఏమిటి?

అమెరికా వైమానిక దళానికి చెందిన భారీ వ్యూహాత్మక రవాణా విమానం C-17A గ్లోబ్‌మాస్టర్.. నేరుగా రష్యా రాజధాని మాస్కోలోని నుకోవో అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండైన విజువల్ ఇది. యుద్ధం మొదలైన తర్వాత అమెరికా సైనిక విమానాలు రష్యా ఎయిర్‌స్పేస్‌లోకి ప్రవేశించడం దాదాపు అసాధ్యమైన విషయం. అలాంటిది వాషింగ్టన్ సైనిక విమానం నేరుగా రష్యా రాజధానిలోనే దిగడంతో ప్రపంచవ్యాప్తంగా రక్షణ వర్గాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. విమానం ల్యాండ్ అయిన కొద్దిసేపటికే ఈ రహస్య ఆపరేషన్ వెనుక ఉన్న అసలు కారణం బయటకు వచ్చింది. సీఐఏ డైరెక్టర్ జాన్ రాట్‌క్లిఫ్ స్వయంగా మాస్కోకు చేరుకున్నట్లు ఒక సీనియర్ అమెరికన్ అధికారి ధ్రువీకరించారు. CBS కథనం ప్రకారం.. మాస్కోలో అత్యంత రహస్యంగా కొన్ని వ్యూహాత్మక సమావేశాలు నిర్వహించేందుకే రాట్‌క్లిఫ్ ఈ C-17 విమానంలో ప్రయాణించారు. ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత రష్యాలో అడుగుపెట్టడం ఇదే ఫస్ట్‌టైం కావడంతో, ఈ పర్యటన వెనుక ఏదోవ్యూహం దాగి ఉందన్న సంకేతాలు స్పష్టమయ్యాయి.

రాట్‌క్లిఫ్ మాస్కో పర్యటనపై అనేక ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇరాన్‌ను ఒంటరి చేయడమే లక్ష్యంగా అమెరికా ఆపరేషన్‌ ఎకనమిక్‌ అవుట్‌కాస్ట్‌‌ను ప్రకటించింది. అంటే టెహ్రాన్‌తో వ్యాపారం సాగించే సంస్థలు, దేశాలను లక్ష్యంగా చేసుకుని ఆంక్షలు విధిస్తుంది. ఇరాన్‌కు రష్యా వ్యూహాత్మక వాణిజ్య భాగస్వామిగా ఉంది. మరోవైపు, నాటో సభ్య దేశంలో రష్యా దాడి చేసే అవకాశం ఉందని అమెరికా నిఘా సంస్థ ఇటీవల హెచ్చరించింది. నాటో దేశంపై మాస్కో సైబర్‌ దాడులు, కోవర్ట్‌ ఆపరేషన్స్ లేదా చిన్నస్థాయి సైనిక దురాక్రమణ చేపట్టే ప్రమాదం ఉన్నట్లు తెలిపింది. దాని గురించి చర్చించేందుకు సీఐఏ చీఫ్‌ రాట్‌క్లిఫ్ వచ్చి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, అమెరికా సైనిక విమానం రాకపై గానీ, జరిగిన రహస్య చర్చలపై గానీ తమ వద్ద ఎటువంటి సమాచారం లేదని క్రెమ్లిన్ ఒకే ఒక్క ప్రకటనతో దాటవేయడం ఇదే తొలిసారి కాదు.. సున్నితమైన, రహస్య చర్చల విషయంలో వివరాలను ధ్రువీకరించకపోవడం మాస్కో ఎప్పటి నుంచో అనుసరిస్తున్న సంప్రదాయ వ్యూహం. ఇలాంటి వ్యూహాత్మక మౌనంతో ఎవరికీ జవాబుదారీగా ఉండాల్సిన అవసరం రాదు. గతంలో సీఐఏ పర్యటనలు కూడా వివాదాలను శాశ్వతంగా పరిష్కరించడం కంటే సంక్షోభాన్ని అదుపులో ఉంచేందుకే ఎక్కువగా ఉపయోగపడ్డాయి.

నిజానికి.. అమెరికా నిఘా చీఫ్ రహస్యంగా మాస్కోలో పర్యటించిన సమయంలోనే.. భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా మాస్కోలో విస్తృత చర్చలు జరిపారు. జైశంకర్ నేరుగా అధ్యక్షుడు పుతిన్, విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌లతో సమావేశమై ద్వైపాక్షిక వాణిజ్యం, ఇంధనం, ఎరువులు, అణు సహకారంపై లోతైన చర్చలు జరిపారు. 2030 నాటికి భారత్-రష్యా వాణిజ్యాన్ని 100 బిలియన్ డాలర్లకు పెంచే లక్ష్యంతో పాటు, రాబోయే SCO, BRICS శిఖరాగ్ర సదస్సుల్లో మోదీ, పుతిన్ భేటీలకు రోడ్‌మ్యాప్‌ను ఖరారు చేశారు. ఈ సమయంలోనే రాట్‌క్లిఫ్ సీక్రెట్‌గా మాస్కో వెళ్లారు. దీంతో ఈ రహస్య చర్చల్లో జైశంకర్ కూడా భాగమయ్యారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సంగతి పక్కనపెడితే.. అమెరికా-రష్యా మధ్య కుదిరే తెరవెనుక ఒప్పందాలు ఉక్రెయిన్ యుద్ధ తీవ్రతను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ఒకవేళ రష్యా ఆర్థికంగా లేదా సైనికంగా వెనక్కి తగ్గినా, లేదా యుద్ధం ముగింపు దశకు వచ్చినా.. అది ప్రపంచ చమురు, గ్యాస్ మార్కెట్లను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. రష్యా నుంచి రాయితీతో కూడిన చమురు దిగుమతులు చేసుకుంటున్న భారత్‌కు, ఈ అంతర్జాతీయ ఆంక్షల సమీకరణలు, ఇంధన స్థిరత్వం అత్యంత కీలకంగా మారనున్నాయి.

 

Published : 
  • 27 August 2026, 4:00 PM IST