ఊహించిందే జరిగింది. నమ్ముకున్న పార్టీనే వెన్నుపోటు పోడించాడు. నీతి వ్యాక్యాలు వల్లించిన నేతలు...సిగ్గు, ఎగ్గులేకుండా వ్యవహరిస్తున్నారు. అధికారం కోసం ఎంతకైన దిగజారుతున్నారు. మొన్నటి పార్లమెంట్ సమావేశాల్లో ప్రజా సమస్యలపై గొంతెత్తాడు. పతాక శీర్షికల్లో నిలిచాడు. ఇప్పుడేమో బీజేపీలో చేరాలని నిర్ణయించుకోవడంతో...ప్రజల చేత చీ కొట్టించుకుంటున్నాడు.ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ అధ్యక్షుడు కేజ్రీవాల్, ఇతర నేతలు అంచనాలే నిజమయ్యాయి. బీజేపీ నేతలకు టచ్‌లో ఉన్నారని, ఎప్పుడైనా ఆ పార్టీలో చేరవచ్చని ఆరోపించారు. రాఘవ్ చడ్డాను ఒక పావుగా వాడి...పార్టీలో చీలిక తెచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆప్ ఆరోపించింది.
ఏడుగురు ఎంపీలను తీసుకువస్తే.. మంత్రిని చేస్తామని చడ్డాకు కేంద్రమంత్రి అమిత్ షా చెప్పినట్టు తమకు సమాచారం ఉందని వ్యాఖ్యలు చేసింది. అయితే ఈ ఆరోపణలన్నీ నిరాధారమైనవంటూ కాషాయ పార్టీ తోసిపుచ్చింది. తాజా రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా...ముసుగు తీశాడు. ఆప్‌కు రాజీనామా చేసిన ఆయన...ఎట్టకేలకు బీజేపీలో చేరనున్నట్లు ప్రకటించాడు. తనతో పాటు ఏడుగురు ఎంపీలు కాషాయ తీర్థం పుచ్చుకుంటారని ప్రకటించి...ఆమ్ ఆద్మీ పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేశాడు. తనతో పాటు సందీప్ పాఠక్, అశోక్ మిత్తల్, స్వాతి మాలీవాల్, హర్భజన్ సింగ్, రాజిందర్ గుప్తా, విక్రమ్ సాహ్నీ కమలం తీర్థం పుచ్చుకోనున్నట్లు రాఘవ్ చద్దా తెలిపారు.
ఆమ్ ఆద్మీ పార్టీ ఏ లక్ష్యంతో ఏర్పాటైందో...వాటికి దూరమైందని రాఘవ్ చద్దా విమర్శించారు. 15 ఏళ్లపాటు రక్తం, చెమట ధారపోసి ఆప్ ఎదుగుదలకు కృషి చేశానన్నారు. ఆప్ నేతల నేరాల్లో భాగం కావాలని కోరుకోవడం లేదన్న ఆయన...అందుకే వారి మన్ననలు పొందలేకపోయానని స్పష్టం చేశారు. తన రెండే దారులు కనిపించాయని...అందులో ఒకటి రాజకీయాల నుంచి దూరం కావడం. రెండోది తమ అనుభవాన్ని ఉపయోగించి సానుకూల రాజకీయాలు చేయడం. ఈ కారణంతోనే బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు చద్దా ప్రకటించారు. రాఘవ్ చద్దా ఆరోపణలను ఆమ్ ఆద్మీ పార్టీ ఖండించింది. ఆ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్...పార్టీ మారాలని నిర్ణయించుకున్న ఎంపీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎంపీ అశోక్ మిట్టల్ ఆస్తులపై సీబీఐ, ఈడీ దాడులు చేస్తుందన్న భయంతోనే బీజేపీలో చేరుతున్నారని విమర్శించారు. పక్క పార్టీల్లో ఉన్న అవినీతి నేతలంతా...బీజేపీలో చేరగానే నీతి మంతులుగా మారిపోతారని ఆప్ వ్యంగ్యస్త్రాలు సంధించింది.బీజేపీ మాస్టర్ ప్లాన్ వర్కౌట్ అయింది. ఆ పార్టీకి రాజ్యసభలో గుర్తింపు లేకుండా చేయాలని పావులు కదిపింది. రాఘవ్ చద్దా ద్వారా ఆపరేషన్‌ను పూర్తి చేసింది. రాజ్యసభలో ఆప్‌కు పది మంది సభ్యులు ఉన్నారు. ఆప్ రాజ్యసభ సభ్యుల్లో 2/3వ వంతు మంది ఎంపీలు బీజేపీలో విలీనం కానున్నారని ప్రకటించారు. రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా రాజ్యసభలో ఆప్‌నకు చెందిన మూడింట రెండొంతుల మంది సభ్యులు...బీజేపీలో విలీనం కావాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.
అందుకు అనుగుణంగానే ఏడుగురు ఎంపీలు సంతకాలు చేసిన లేఖలను రాజ్యసభ ఛైర్మన్‌కు సమర్పించినట్లు వెల్లడించారు. రాజ్యసభలో ఆప్ పార్టీకి ఉన్న సంఖ్యా బలాన్ని బట్టి చూస్తే, మూడింట రెండొంతుల మంది ఎంపీలు పార్టీని వీడితే, అది ఫిరాయింపుల నిరోధక చట్టం కిందకు రాదు. చట్టబద్ధంగానే వారు బీజేపీలో విలీనం అయ్యే అవకాశం ఉంటుంది. ఇది ఆమ్ ఆద్మీకి భారీ ఎదురుదెబ్బేనని చెప్పక తప్పదు.ఆమ్ ఆద్మీ పార్టీలోని అంతర్గత విభేదాలు, నాయకత్వ లేమి కారణాలుగానే ఈ ఫిరాయింపులు జరుగుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.