ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం ఇప్పుడు ఖర్గ్ ద్వీపానికి షిఫ్ట్ అయింది. ఈ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంటే ఇరాన్ ఆటోమెటిక్‌గా దారికొస్తుందని భావించిన అమెరికా.. ఆ దిశగా అడుగులు వేస్తోంది. కానీ, ఈ ప్రయత్నమే సంక్షోభాన్ని మరింత పెంచేలా కనిపిస్తోంది. ఎందుకంటే, ఖర్గ్ ద్వీపం కేవలం ఒక భూభాగం కాదు, అది ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. ఇరాన్ చేసే మొత్తం చమురు ఎగుమతుల్లో దాదాపు 90 శాతం ఇక్కడి నుంచే జరుగుతాయి. ఒకవేళ ఈ ద్వీపం శత్రువుల వశమైతే లేదా ధ్వంసమైతే, ఇరాన్ ఆర్థికంగా కుప్పకూలడం ఖాయం. అందుకే దీనిని రక్షించుకోవడానికి ఇరాన్ తన సైనిక బలాన్నంతా అక్కడ మోహరిస్తోంది. గత కొన్ని వారాలుగా ఇరాన్ ఇక్కడ అసాధారణమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. సముద్ర తీరం వెంబడి సైనికులను, యుద్ధ ట్యాంకులను అడ్డుకోవడానికి భారీగా మందుపాతరలను అమర్చింది. అమెరికా సైనికులు సముద్రం ద్వారా ద్వీపంలోకి ప్రవేశించే మార్గాలను ఇరాన్ మృత్యుకుహరాలుగా మార్చేసింది. వైమానిక దాడులను తిప్పికొట్టడానికి మోస్ట్ అడ్వాన్స్‌డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌తో పాటు 'మ్యాన్‌ప్యాడ్స్' క్షిపణులను సైనికులకు అందించింది.
ఈ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవడం ద్వారా ఇరాన్‌ను లొంగదీసుకోవచ్చని ట్రంప్ సర్కార్ భావిస్తోంది. తద్వారా చమురు రవాణాకు కీలకమైన హార్ముజ్ జలసంధిపై పట్టు సాధించాలని వారి ప్రణాళిక. అయితే, ఇది ఆత్మహత్యాసదృశ్యమని సైనిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారీ సంఖ్యలో అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని, కేవలం ఈ ద్వీపాన్ని గెలవడం వల్ల మొత్తం సమస్య పరిష్కారం కాదని ట్రంప్ సన్నిహితులే కొందరు అభిప్రాయపడుతున్నారు. ఖర్గ్ విషయంలో వారి అంచనాలే నిజం. ఎందుకంటే, ఈ ద్వీపాన్ని టార్గెట్ చేస్తే పరిణామాలు అమెరికా ఊహకందని రీతిలో ఉంటాయి.. తాజాగా ఇరాన్ ఆ హెచ్చరికలే చేసింది. తమ భూభాగంపై గానీ లేదా ద్వీపాలపై గానీ దాడి జరిగితే, బాబ్ అల్-మండేబ్ జలసంధి వద్ద ఉద్రికత్తతలు పెంచుతామని సైనిక వర్గం హెచ్చరించింది. అసలేు హార్ముజ్ మూసివేతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రపంచ దేశాలను.. ఇరాన్ వార్నింగ్ మరింత టెన్షన్ పెడుతోంది. ఎందుకంటే ఈ సముద్ర మార్గం ప్రపంచం లో అత్యంత ముఖ్యమైన వాణిజ్య మార్గాల్లో ఒకటి. హార్ముజ్ తర్వాత బాబ్ అల్-మండేబ్ జలసంధి సైతం మూసివేస్తే ప్రపంచం అతలాకుతలమవుతుందని నిపుణులు అంటున్నారు.
అరబిక్‌లో బాబ్ అల్-మండేబ్ అంటే కన్నీటి ద్వారం అని అర్థం. ఈ ఇరుకైన సముద్ర మార్గం ఎర్ర సముద్రాన్ని, గల్ఫ్ ఆఫ్ ఏడెన్‌ను, అరేబియా సముద్రాన్ని కలుపుతుంది. ఇది ఇరాన్ మద్దతు ఉన్న యెమెన్ రెబల్ గ్రూప్ హౌతీల నియంత్రణలో ఉంది, హార్న్ ఆఫ్ ఆఫ్రికా 'జిబౌటి, ఎరిట్రియా మధ్య ఉంది. హార్ముజ్ లాగే అత్యంత ఇరుకైన ప్రదేశం.. కేవలం 29 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. యూరోప్, ఆసియా, మధ్యప్రాచ్యం మధ్య చమురు, గ్యాస్ రవాణా ఈ మార్గం ద్వారానే జరుగుతుంది. యూరోప్, ఆసియా మధ్య సూయజ్ కాలువ గుండా ప్రయాణించే ఏ ఓడ అయినా బాబ్ అల్-మండేబ్ గుండానే వెళ్ళాలి. అందుకే దీనిని ప్రపంచంలోని అత్యంత కీలకమైన చోక్‌పాయింట్‌లలో ఒకటిగా పరిగణిస్తారు. ఈ మార్గానికి అంతరాయం ఏర్పడితే, ఓడలు కేప్ ఆఫ్ గుడ్ హోప్ మీదుగా ఆఫ్రికా ఖండం మొత్తాన్ని చుట్టిరావాల్సి ఉంటుంది. దీనివల్ల డెలివరీ సమయాలు 15-20 రోజులు పెరగడంతో పాటు, రవాణా ఖర్చులు సైతం గణనీయంగా పెరుగుతాయి. ప్రపంచ వాణిజ్యంలో సుమారు 12 శాతం బాబ్ అల్-మండేబ్ గుండా జరుగుతుంది. ప్రపంచంలోని చమురు, ఎల్ఎన్జీలో సుమారు 10 శాతం ఈ సముద్ర మార్గం గుండా రవాణా అవుతుంది. భారత్ నుంచి కూడా యూరోప్, ఉత్తర ఆఫ్రికా, మధ్యప్రాచ్య దేశాలకు వెళ్లే ఎగుమతులు, దిగుమతులు అధికంగా సూయజ్ కెనాల్ మీదుగా సాగుతాయి. కాబట్టి బాబ్ అల్-మండేబ్ జలసంధి మనకూ ముఖ్యమే.
తాజాగా ఐఆర్‌జీసీకి చెందిన అధికారిక వార్తా సంస్థ తస్నీమ్ న్యూస్ ఏజెన్సీ ఒక కథనాన్ని ప్రచురించింది. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు మొదలైనప్పుడే హౌతీలు అలర్ట్ మోడ్‌లో ఉన్నారని తెలిపింది. 2023 అక్టోబర్‌లో గాజాపై ఇజ్రాయెల్ సైనిక చర్య మొదలైన తర్వాత బాబ్ ఎల్-మండేబ్, ఎర్ర సముద్రం మీదుగా వెళ్లే ఇజ్రాయెల్ నౌకలు, ట్యాంకర్లపై హౌతీలు దాడులు చేశారు. ఇజ్రాయెల్ వైపుగా నౌకలు, ట్యాంకర్ల రాకపోకలను చాలావరకూ నిలువరించారు. దానివల్ల అప్పట్లో ఇజ్రాయెల్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ పరిస్థితుల్లో ఇజ్రాయెలీ నౌకలు, ట్యాంకర్లు సుదూరంలోని ఆఫ్రికా దక్షిణ ప్రాంత సముద్రజలాల మీదుగా గమ్యస్థానాలకు వెళ్లాయి. అదే సమయంలో యెమన్ తీరానికి సమీపంలోని అమెరికా నౌకాదళ నౌకలపైనా హౌతీలు దాడులు చేశారు. ఇజ్రాయెల్‌లోని వివిధ ప్రాంతాలపైనా మిస్సైళ్లు, డ్రోన్లతో ఎటాక్స్ చేశారు. ఇప్పుడూ హౌతీలు అదే చేయడానికి సిద్ధంగా ఉన్నారన్నది తస్నీమ్ న్యూస్ కథనం సారాంశం. సో.. హార్ముజ్ సంక్షోభం ముగియకముందే మరో జలసంధిలో సంక్షోభం ముంచుకొచ్చే అవకాశం లేకపోలేదు.