ఇది పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన ట్వీట్. పశ్చిమాసియా యుద్ధాన్ని ఆపే ఈ సంప్రదింపులను నిర్వహించే అవకాశం తమకు లభిస్తే.. దానిని ఒక గౌరవంగా భావిస్తాం అన్నాడు. అమెరికా, ఇరాన్‌వైపు నుంచి ఉమ్మడి అంగీకారం లభిస్తే చర్చలకు మధ్యవర్తిగా వ్యవహరించేందుకు సిద్ధంగా ఉన్నామనీ తెలిపాడు. ఈ యుద్ధాన్ని ఆపేందుకు, మధ్యప్రాచ్యంలో శాంతి, సుస్థిరతల పరిరక్షణకు ప్రస్తుతం జరుగుతున్న అన్ని ప్రయత్నాలను పాక్ స్వాగతిస్తుందని చెప్పుకొచ్చాడు. ట్విస్ట్ ఏంటంటే.. ఈ ట్వీట్‌ను ట్రంప్ షేర్ చేయడం. దీనర్థం పాకిస్తాన్ వేదికగా జరిగే చర్చలకు ట్రంప్ సిద్ధంగా ఉన్నాడని. మొదట్లో ఇరాన్ యుద్ధం అసలు తమకు పాయింటే కాదనీ, జస్ట్ అదొక మిలిటరీ కేక్‌వాక్ లాంటిది అంటూ చాలా చులకనగా ప్రకటనలు చేశాడు. తమ సైన్యం చాలా ఈజీగా ఇరాన్ వెళ్లి పనిపూర్తిచేసుకుని వస్తుందని ప్రగల్భాలు పలికాడు. చివరకు ప్రపంచ దేశాల ముందు జోలెపట్టి అడుక్కుంటున్న పాకిస్తాన్ మధ్యవర్తిత్వాన్ని కూడా కాదనలేని స్థాయికి దిగజారిపోయాడు. అయితే, ఈ వ్యవహారంలో అసలు కథ ఇక్కడే ఉంది.
పాక్ ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉంది. అంతర్జాతీయంగా తన ప్రాముఖ్యతను చాటుకోవడానికి ఇలాంటి ప్రకటనలు ఒక మార్గం. సౌదీ అరేబియా, ఇరాన్ వంటి దేశాలతో ఉన్న సంబంధాల ద్వారా తాను ఇస్లామిక్ దేశాల కూటమికి నాయకత్వం వహించగలనని ప్రపంచానికి చూపాలనుకుంటోంది. అమెరికాకు ఒక అవసరమైన భాగస్వామిగా కనిపిస్తే, నిధులు లేదా రుణాల విషయంలో సహాయం అందుతుందనేది వారి ఆశ. మిడిల్ ఈస్ట్‌లో మధ్యవర్తిత్వం ప్రకటన వెనుక పాకిస్తాన్ ప్లాన్ ఇదే. ఇక ట్రంప్ ప్లాన్ విషయానికొస్తే.. ట్రంప్ తన విదేశాంగ విధానంలో లాభనష్టాలనే చూస్తాడు. ప్రస్తుతం అతడి ప్రధాన లక్ష్యం అమెరికాను సుదీర్ఘ యుద్ధాల నుండి బయట పడేయడం. మిడిల్ ఈస్ట్‌లో ఇరాన్‌కు దగ్గరగా ఉండే దేశాల ద్వారా శాంతి చర్చలు జరిపితే, అమెరికా ప్రత్యక్ష జోక్యం తగ్గుతుందనేది అతడి లెక్క. పాకిస్తాన్‌ను ఉపయోగించుకుని ఇరాన్‌ను ఒప్పించగలిగితే, ఆ ఘనత తనకే దక్కుతుందని ట్రంప్ నమ్ముతాడు. కానీ, రియాలిటీలో ఇది సాధ్యమయ్యేదేనా అన్నది అసలు ప్రశ్న.
మిడిల్ ఈస్ట్ యుద్ధ సంక్షోభాన్ని ఆపడం కాదు.. అసలు తనను తాను కాపాడుకోలేని పరిస్థితుల్లో ఉంది పాకిస్తాన్. ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్ వంటి అంతర్జాతీయ సంస్థలు రుణాలు మంజూరు చేయకపోతే దేశ ప్రజలకు ఒక్కపూట కూడా తిండిపెట్టలేదు. అలాంటి దేశం మాటను అంతర్జాతీయ వేదికలపై ఎవరు పట్టించుకుంటారు? పైగా విశ్వసనీయతలో పాకిస్తాన్ ట్రాక్ రికార్డ్ మరింత ఘోరంగా ఉంది. ఇజ్రాయెల్ వంటి దేశాలు పాకిస్తాన్‌ను మధ్యవర్తిగా అస్సలు అంగీకరించవు. రీసెంట్‌గా గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్‌లో పాకిస్తాన్ ప్రపంచంలోనే నంబర్ వన్‌గా నిలిచింది. వేర్పాటు వాదులు, తాలిబన్ల దాడులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న ఆ దేశం మధ్యవర్తిగా వ్యవహరిస్తానని చెబితే ఆ దేశంలోని ప్రజలే నవ్వుకునే పరిస్థితులున్నాయి. మరోవైపు ఇరాన్-సౌదీ అరేబియా సమీకరణాలు ఇస్లామాబాద్‌కు ఇబ్బందికరమే. పాకిస్తాన్ అటు ఇరాన్, ఇటు సౌదీలతో సన్నిహితంగా ఉండటానికి ప్రయత్నిస్తుంది. కానీ కీలకమైన నిర్ణయాల్లో ఈ దేశాలు పాకిస్తాన్ కంటే భారత్, చైనా, రష్యా వైపే చూస్తున్నాయి. పాకిస్తాన్‌ను కేవలం బెగ్గర్‌గా మాత్రమే చూస్తాయి ఆ దేశాలు.
ఇవన్నీ ఒక ఎత్తయితే అసలు సిసలు లెక్క ఇరాన్‌తోనే ఉంది. యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత ఇరాన్‌తో చాలా ఎక్స్‌ట్రాలు చేసింది పాక్. సౌదీ అరేబియాతో తమకు రక్షణ భాగస్వామ్యం ఉందన్న విషయాన్ని గుర్తుచేసి సౌదీపై దాడులు చేస్తే తాము చూస్తూ ఊరుకోమని బెదిరించింది. అక్కడితో ఆగకుండా ఇటీవల రావల్పిండిలో జరిగిన ఒక ఇఫ్తార్ విందులో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ షియా మతపెద్దలతో మాట్లాడుతూ... "మీకు ఇరాన్ అంటే అంత ప్రేమ ఉంటే, అక్కడికే వెళ్లిపోండి" అని వ్యాఖ్యానించాడు. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణం తర్వాత పాకిస్తాన్‌లోని షియా కమ్యూనిటీ పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టింది. ఈ క్రమంలో కరాచీలో అమెరికా కాన్సులేట్‌పై దాడి, హింస చెలరేగాయి. దీంతో ఆసిమ్ మునీర్ నోరు జారాడు.. మధ్యవర్తిగా ఉండాల్సిన దేశం నిష్పక్షపాతంగా ఉండాలి. ఇరాన్ పట్ల వ్యతిరేకతను ప్రదర్శించే వ్యాఖ్యలు చేసినప్పుడు, ఇరాన్ ప్రభుత్వం పాకిస్తాన్‌ను ఎందుకు నమ్ముతుంది? అందుకే, షరీఫ్ ప్రకటనపై ఆ దేశం వెంటనే స్పందించలేదు. ఓవరాల్‌గా పాకిస్తాన్ ప్రయత్నమంతా తన అంతర్జాతీయ హోదాను కాపాడుకోవడం కోసమే. ట్రంప్ మద్దతు అనేది "ఒక అవకాశం ఇచ్చి చూద్దాం" అనే ధోరణి మాత్రమే. అందుకే, పాక్, ట్రంప్ తీరును నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఉన్మాది, ఉగ్రవాది కలిసి శాంతి నెలకొల్పుతారంటూ సెటైర్లు వేస్తున్నారు.