THE KARGIL STORY: మంచుకొండల్లో రగిలిన జ్వాల.. పాకిస్థాన్‌కు ఉచ్చ పోయించిన ‘ఆపరేషన్‌ విజయ్‌’..!

భారత సైన్యం అలుపెరుగని పోరాట పటిమకు, నెత్తుటి ధారలతో లిఖించిన వీర చరిత్రకు సజీవ సాక్ష్యం 'కార్గిల్ యుద్ధం'. ఈ యుద్ధం కేవలం ఒక సరిహద్దు ఘర్షణ కాదు.

Post Published By: dialnews
Updated : 27 July 2026, 1:43 PM IST

భారత సైన్యం అలుపెరుగని పోరాట పటిమకు, నెత్తుటి ధారలతో లిఖించిన వీర చరిత్రకు సజీవ సాక్ష్యం 'కార్గిల్ యుద్ధం'. ఈ యుద్ధం కేవలం ఒక సరిహద్దు ఘర్షణ కాదు.. దొంగ దెబ్బ తీయాలని చూసిన పాకిస్థాన్‌కు.. భారత సైన్యం తన బలాన్ని, తెగువను రుచి చూపించిన చారిత్రక ఘట్టం. భౌగోళిక పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా, శత్రువు ఎంతటి కుయుక్తులు పన్నినా.. తనవు వణకకుండా, ఇంచు కూడా వెనక్కి తగ్గకుండా.. భారత భూమి దమ్మేంటో, మన సైన్యం పవర్ ఏంటో ప్రపంచానికి చాటిచెప్పిన అపూర్వ విజయం కార్గిల్‌ యుద్ధం.1999 ఫిబ్రవరిలో భారత్‌-పాకిస్థాన్‌ మధ్య శాంతి నెలకొల్పే దిశగా అప్పటి భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి 'లాహోర్ బస్సు యాత్ర' చేపట్టారు. దీని ద్వారా ఉద్రిక్తతలు తగ్గుతాయని అంతా భావించారు.

కానీ, పాకిస్థాన్ సైన్యాధిపతి జనరల్ పర్వేజ్ ముషార్రఫ్.. భారత్‌పై రహస్య కుట్రకు తెరలేపాడు. సాధారణంగా చలికాలంలో నియంత్రణ రేఖ.. LoC వెంబడి ఉష్ణోగ్రతలు మైనస్ 40 డిగ్రీలకు పడిపోతాయి. ఆ సమయంలో ఇరు దేశాల సైన్యాలు తమ పర్వత శిఖరాల పోస్టులను ఖాళీ చేసి వెనక్కి రావడం ఒక అవగాహన ఒప్పందం. సరిగ్గా దీన్ని ఆసరాగా చేసుకున్న పాక్ సైనికులు, ఉగ్రవాదుల ముసుగులో కశ్మీర్‌లోని కార్గిల్, ద్రాస్, బటాలిక్ సెక్టార్లలోకి చొరబడి పర్వత శిఖరాలపై ఉన్న 130కి పైగా భారత బంకర్లను ఆక్రమించారు. శ్రీనగర్-లేహ్ హైవే NH-1Aను తమ ఆధీనంలోకి తీసుకుని, లడఖ్‌ను దేశం నుంచి వేరు చేసి, సియాచిన్ గ్లేసియర్ నుండి భారత బలగాలను వెనక్కి రప్పించడమే పాక్ వ్యూహం.

మే నెల ప్రారంభంలో స్థానిక గొర్రెల కాపరి సమాచారంతో ఈ చొరబాటు వెలుగులోకి వచ్చింది. పెట్రోలింగ్ వెళ్లిన కెప్టెన్ సౌరభ్ కాలియా బృందాన్ని పాక్ మూకలు బంధించి, దారుణంగా చిత్రహింసలు పెట్టి చంపేశాయి. అప్పటికి గానీ పాక్ ఆక్రమణ తీవ్రత భారత్‌కు అర్థం కాలేదు. అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి, ఆర్మీ చీఫ్ జనరల్ వేద్ ప్రకాశ్ మాలిక్ నేతృత్వంలో.. కెప్టెన్‌ విక్రమ్‌ బాత్రా సారథ్యంలో భారత్ ప్రతిదాడికి దిగింది. మే నుంచి జూలై వరకు దాదాపు 60 రోజులకు పైగా ఈ యుద్ధం జరిగింది. మే నెలలో దాదాపు 2 లక్షల మంది భారత సైనికులను ఆ ప్రాంతానికి తరలించి 'ఆపరేషన్ విజయ్'ను భారత్ ప్రారంభించింది.

ఎత్తైన శిఖరాలపై ఉన్న శత్రువులను పదాతి దళం నేరుగా ఢీకొనడం కష్టం కావడంతో, మే 26న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రంగంలోకి దిగింది. మిరాజ్-2000 యుద్ధ విమానాలు శత్రు స్థావరాలపై కచ్చితత్వంతో బాంబుల వర్షం కురిపించి, వారి సప్లై చైన్‌ను దెబ్బతీశాయి. పర్వతాల వెనక దాగిన బంకర్లను నాశనం చేయడానికి బోఫోర్స్ ఆర్టిలరీ గన్స్ అద్భుతంగా పనిచేశాయి. జూన్ నెలలో 'టోలోలింగ్' శిఖరాన్ని చేజిక్కించుకోవడం యుద్ధంలో కీలక మలుపు. ఆ తర్వాత పాయింట్ 5140, పాయింట్ 4875, మరియు జూలై 4న అత్యంత కీలకమైన 'టైగర్ హిల్'ను భారత పదాతి దళాలు ప్రాణాలకు తెగించి పోరాడి వశం చేసుకున్నాయి. యుద్ధ సమయంలో కమ్యూనికేషన్ ట్యాపింగ్ నుంచి తప్పించుకోవడానికి ప్రతి మిషన్‌కు ఒక కోడ్ వర్డ్ ఉండేది. అప్పట్లో పెప్సీ కమర్షియల్‌ యాడ్‌లో బాగా పాపులర్ అయిన "యే దిల్ మాంగే మోర్" అనే డైలాగ్‌ను కెప్టెన్ విక్రమ్ బాత్రా తన కోడ్‌గా ఎంచుకున్నారు. అత్యంత క్లిష్టమైన 'పాయింట్ 5140'ను జయించిన తర్వాత విక్రమ్‌ బాత్రా రేడియోలో ఈ సందేశాన్ని పంపారు. దీని అర్థం "ఒక్క శిఖరాన్ని జయించినంత మాత్రాన నేను ఆగిపోను, నా దేశం కోసం నేను ఇంకా సాధించాల్సింది చాలా ఉంది" అని. ఆ మాట భారత సైన్యానికి స్ఫూర్తి మంత్రంగా మారిపోయింది.

కార్గిల్‌ యుద్ధం ఎందుకు స్పెషల్‌ అంటే.. ఇది అత్యంత ఎత్తైన ప్రాంతంలో జరిగిన అరుదైన యుద్ధం. సముద్ర మట్టానికి 16,000 నుంచి 18,000 అడుగుల ఎత్తులో, మైనస్ ఉష్ణోగ్రతల్లో, నిటారుగా ఉన్న కొండలపై పోరాడటం ఆధునిక యుద్ధ చరిత్రలో అరుదైన విషయం. శత్రువులు సురక్షితమైన బంకర్లలో పైనుంచి కాల్పులు జరుపుతుండగా, భారత సైనికులు ప్రాణాలకు తెగించి కింది నుంచి పైకి ఎక్కుతూ వారిని మట్టుబెట్టారు. పాకిస్థాన్ దొంగచాటుగా చొరబడి మొదట ఇది తమ పని కాదని బుకాయించింది. కార్గిల్ చొరబాటు ముజాహిదీన్ల పని అని పాకిస్థాన్ బుకాయించింది. కానీ, చనిపోయిన వారి వద్ద దొరికిన పాక్ ఆర్మీ ఐడీ కార్డులు, పే బుక్స్, డైరీలు అసలు నిజాన్ని బయటపెట్టాయి. ముఖ్యంగా పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ముషార్రఫ్, జనరల్ అజీజ్ ఖాన్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణను భారత్ రికార్డ్ చేసి ప్రపంచానికి వినిపించడంతో పాకిస్థాన్ కుట్ర పూర్తిగా బట్టబయలైంది.

ఈ భీకర పోరాటంలో మాతృభూమి రక్షణ కోసం 527 మంది భారత వీర జవాన్లు తమ ప్రాణాలను అర్పించి వీరమరణం పొందారు. మరో 1,363 మంది సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. ఇక పాకిస్థాన్ నుంచి సుమారు 700 నుంచి 1,000 మందికి పైగా పాకిస్థాన్ సైనికులు హతమయ్యారు. మొదట్లో బుకాయించిన పాకిస్థాన్, ఆ తర్వాత 453 మంది చనిపోయారని అధికారికంగా అంగీకరించింది. అయితే మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఒక సందర్భంలో 4,000 మందికి పైగా పాక్ సైనికులు చనిపోయారని సంచలన వ్యాఖ్యలు చేశాడు. కార్గిల్ యుద్ధం ఎందరో అమరవీరులను దేశానికి పరిచయం చేసింది. క్యాప్టెన్ విక్రమ్ బాత్రాకు పరమ వీర చక్ర అవార్డ్‌ దక్కింది.

"యే దిల్ మాంగే మోర్" అంటూ శిఖరాలను జయించిన ఈయన పాత్రను 'షేర్ షా', 'LOC: Kargil' సినిమాల్లో చూపించారు. లెఫ్టినెంట్ మనోజ్ కుమార్ పాండేకు కూడా పరమ వీర చక్ర అవార్డ్‌ దక్కింది. ఖలుబార్ కొండలను స్వాధీనం చేసుకునే క్రమంలో మనోజ్‌ వీరమరణం పొందారు. ఈయన పాత్రను 'LOC: Kargil'లో అజయ్ దేవగణ్ పోషించారు. మేజర్ పద్మపాణి ఆచార్యకు మహా వీర చక్ర అవార్డ్‌ దక్కింది. టోలోలింగ్ ఆక్రమణలో ప్రాణాలొదిలిన హైదరాబాద్ మేజర్‌ పద్మపాణి ఆచార్య. 'LOC: Kargil'లో నాగార్జున ఈయన పాత్రలో నటించారు. క్యాప్టెన్ అనుజ్ నయ్యర్‌ను కూడా దేశం మహా వీర చక్ర అవార్డ్‌తో గౌరవించింది. పాయింట్ 4875 వద్ద శత్రు బంకర్లను ధ్వంసం చేసే క్రమంలో అనుజ్‌ అమరుడయ్యారు. ఈయన పాత్రను సైఫ్ అలీ ఖాన్ పోషించారు. కార్గిల్ నేపథ్యంలో 'LOC: Kargil', 'లక్ష్య', 'గుంజన్ సక్సేనా' వంటి సినిమాలు వచ్చి.. వారి వీరత్వాన్ని భావితరాలకు తెలియజేశాయి.

దాదాపు రెండు నెలల పోరాటం తర్వాత జూలై 26, 1999 నాటికి పాకిస్థాన్ మూకలను భారత సైన్యం పూర్తిగా తరిమికొట్టి తన భూభాగాన్ని తిరిగి పదిలపరుచుకుంది. అందుకే ఈ రోజును మనం 'కార్గిల్ విజయ్ దివస్'గా జరుపుకుంటాం. భారత సైన్యం అలుపెరుగని పోరాట పటిమకు, నెత్తుటి ధారలతో లిఖించిన వీర చరిత్రకు సజీవ సాక్ష్యం 'కార్గిల్ యుద్ధం'. సరిగా 27 ఏళ్ల క్రితం ఇదే జోరు.. మంచుకొండల సాక్షిగా జరిగిన ఈ యుద్ధం.. భారత జవాన్ల అసాధారణ ధైర్యసాహసాలను, మాతృభూమిపై వారికి ఉన్న అచంచలమైన ప్రేమను ప్రపంచానికి చాటిచెప్పింది. శత్రువు వెన్నుపోటు పొడిచినా, ప్రకృతి ప్రతికూలించినా.. వెనకడుగు వేయకుండా గర్జించిన భారత సైనిక వీరత్వానికి ప్రతీక కార్గిల్‌ యుద్ధం.

 

Published : 
  • 27 July 2026, 1:43 PM IST