ఏలూరు రాజకీయాల్లో ఒక శకం ముగిసింది. దశాబ్దాల పాటు ఆ నియోజకవర్గాన్ని తన కనుసన్నల్లో నడిపించిన మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని హఠాన్మరణం ఏపీ రాజకీయాల్లో తీవ్ర దిగ్భ్రాంతిని మిగిల్చింది. కాంగ్రెస్ నాయకుడిగా ప్రస్థానాన్ని ప్రారంభించి.. వైస్సార్సీపీలో కీలక నేతగా ఎదిగి.. మొన్నటి మొన్న టీడీపీ కండువా కప్పుకున్న ఆళ్ల నాని పొలిటికల్ జర్నీ ఎంతో ఆసక్తికరం. ఆళ్ల నానికి ఏలూరు నియోజకవర్గంతో విడదీయరాని బంధం ఉంది. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఆయన తొలిసారి ఏలూరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు.
తన ప్రజాదరణతో 2009 ఎన్నికల్లోనూ మరోసారి అదే కాంగ్రెస్ పార్టీ నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించి ఏలూరులో తిరుగులేని నేతగా నిరూపించుకున్నారు. అయితే 2013లో రాష్ట్ర రాజకీయాలు మలుపు తిరిగాయి. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు ఆళ్ల నాని అడుగులు వేశారు. కాంగ్రెస్కు రాజీనామా చేసి వైసీపీలో చేరిన ఆయనకు.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ ఎన్నికల్లో ఏలూరు నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు.
అయినప్పటికీ జగన్ ఆయనపై నమ్మకాన్ని కోల్పోలేదు. 2017లో ఆళ్ల నానికి ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించి పెద్దల సభకు పంపారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ 2019 ఎన్నికల బరిలో నిలిచిన ఆళ్ల నాని.. ఏలూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. దాంతో వైఎస్ జగన్ తన తొలి కేబినెట్లోనే ఆళ్ల నానికి అత్యంత కీలకమైన డిప్యూటీ సీఎం పదవితో పాటు ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, వైద్య విద్యా శాఖల మంత్రిగా బాధ్యతలు అప్పగించారు.
ముఖ్యంగా 2019 నుండి 2021 వరకు కరోనా కష్టకాలంలో ఆరోగ్య శాఖ మంత్రిగా రాష్ట్రవ్యాప్తంగా ఆయన పోషించిన పాత్ర ఎనలేనిది. ఆ తర్వాత 2022 ఏప్రిల్లో జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఆయన డిప్యూటీ సీఎం, మంత్రి పదవుల నుంచి తప్పుకున్నారు. ఇక ఇటీవలి కాలంలో ఆయన రాజకీయ జీవితంలో తీవ్ర హెచ్చుతగ్గులు చోటుచేసుకున్నాయి. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఏలూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆళ్ల నాని.. కూటమి ప్రభంజనంలో టీడీపీ అభ్యర్థి బాడేటి రాధాకృష్ణయ్య చేతిలో ఓటమి పాలయ్యారు.
ఈ ఓటమి తర్వాత, 2024 ఆగస్టు 9న సంచలన నిర్ణయం తీసుకుంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అంతేకాదు, తాను రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటానని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. కానీ రాజకీయ సమీకరణాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ 2025 ఫిబ్రవరి 13న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆళ్ల నాని అధికారికంగా తెలుగుదేశం పార్టీలో చేరారు. పసుపు కండువా కప్పుకుని టీడీపీలో యాక్టివ్ అవుతున్న తరుణంలోనే.. ఈ గుండెపోటు రూపంలో మరణం ఆయనను కబళించింది. ఏలూరు రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన ఆళ్ల నాని భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.