Top story:ఆత్మరక్షణలో పడిపోయిన ట్రంప్.. పంతం నెగ్గించుకున్న ఇరాన్..?

ఇరాన్ కథను వారం రోజుల్లో ముగిస్తాం అని అంచనా వేసుకున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు.. యుద్ధం తీవ్రమవుతున్న సమయంలో ఇరాన్ ప్రదర్శించే దూకుడు ఆత్మరక్షణలో పడేసింది.

Post Published By: dialnews
Updated : 20 March 2026, 12:41 PM IST

ఇరాన్ కథను వారం రోజుల్లో ముగిస్తాం అని అంచనా వేసుకున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు.. యుద్ధం తీవ్రమవుతున్న సమయంలో ఇరాన్ ప్రదర్శించే దూకుడు ఆత్మరక్షణలో పడేసింది. ఖతార్ గ్యాస్ హబ్‌పై దాడి తర్వాత డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న వ్యూహం, ఆయన చేసిన వ్యాఖ్యలు ఆయనను ఆత్మరక్షణలో పడేశాయనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న డైరెక్ట్ వార్ ఇప్పుడు ప్రపంచ ఇంధన వనరుల మీద పడటంతో, ట్రంప్ తన దూకుడు స్వభావాన్ని పక్కన పెట్టి కొంత ఆత్మరక్షణలో పడాల్సి వచ్చిందనేది స్పష్టమవుతోంది.

సాధారణంగా ట్రంప్ ఇజ్రాయెల్‌కు బేషరతు మద్దతు ఇచ్చే నాయకుడిగా పేరుపొందారు. కానీ, ఇరాన్‌ లోని సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్‌ పై ఇజ్రాయెల్ జరిపిన దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆయన ప్రకటించడం గమనార్హం. ఆ దాడి గురించి మాకు ముందుగా తెలియదు, మేము దానికి అనుమతి ఇవ్వలేదు అని చెప్పడం ద్వారా, అంతర్జాతీయ సమాజం ముందు అమెరికాను దోషిగా నిలబెట్టకుండా ఉండేందుకు ఆయన ప్రయత్నించారు. ఇది ఒక రకమైన ఆత్మరక్షణ ధోరణిగా కనిపిస్తోంది.

ఖతార్‌లోని రాస్ లఫాన్ గ్యాస్ హబ్‌ పై ఇరాన్ దాడి చేయడంతో ప్రపంచవ్యాప్తంగా గ్యాస్ ధరలు ఒక్కసారిగా పెరిగే ప్రమాదం ఏర్పడింది. ఒకవేళ గ్యాస్ సరఫరా నిలిచిపోతే అమెరికాతో పాటు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలుతాయి. ఈ ఆర్థిక సంక్షోభం తన పదవీ కాలం ప్రారంభంలోనే రావడం ట్రంప్‌ కు అస్సలు ఇష్టం లేదు. అందుకే, ఇరాన్‌ ను బ్రతిమిలాడుతున్నట్లుగా ఇకపై ఇజ్రాయెల్ దాడులు చేయదు.. మీరు కూడా ఆపండి అనే ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు.

ఖతార్‌ కు ఏమీ తెలియదని ట్రంప్ అనడం వెనుక పెద్ద వ్యూహం ఉండవచ్చు అనే మాట వినపడుతోంది. ఖతార్ అమెరికాకు కీలకమైన మిత్రదేశం మాత్రమే కాదు, అక్కడ అతిపెద్ద అమెరికా సైనిక స్థావరం ఉంది. ఖతార్‌ పై దాడి జరిగితే అది పరోక్షంగా అమెరికాపై దాడి జరిగినట్లే. ఈ విషయంలో ఇరాన్‌ ను కట్టడి చేయలేకపోతే అమెరికా ప్రతిష్ట దెబ్బతింటుందనే భయం ట్రంప్‌లో కనిపిస్తోంది. ట్రంప్ తన సోషల్ మీడియా పోస్ట్‌లో ఇరాన్ గనుక మళ్ళీ దాడి చేస్తే, సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్‌ ను అమెరికా పూర్తిగా పేల్చివేస్తుంది అని హెచ్చరించారు.

సాధారణంగా ఇలాంటి భయపెట్టే వ్యాఖ్యలు ట్రంప్ తన బలహీనతను కప్పిపుచ్చుకోవడానికి లేదా ప్రత్యర్థిని భయపెట్టి చర్చలకు తీసుకురావడానికి వాడుతుంటారు. ఇక్కడ కూడా ఇరాన్ మరింత రెచ్చిపోకుండా ఉండేందుకు ఆయన 'భారీ విధ్వంసం' అనే మాటను వాడటం గమనార్హం. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును నియంత్రించడం ట్రంప్‌ కు ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారింది. ఒకవైపు ఇజ్రాయెల్ దూకుడును ఆపాలి, మరోవైపు ఇరాన్ ప్రతీకారాన్ని అడ్డుకోవాలి. ఈ రెండు విరుద్ధమైన అంశాల మధ్య ట్రంప్ నలిగిపోతున్నారు. శాంతిని నెలకొల్పుతానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన ఆయన, ఇప్పుడు యుద్ధ మేఘాల మధ్య చిక్కుకోవడం ఆయనను ఆత్మరక్షణలోకి నెట్టింది.

మొత్తానికి, ఖతార్ గ్యాస్ హబ్ అంశం ట్రంప్ విదేశీ విధానానికి ఒక అగ్నిపరీక్షగా మారింది. ఇరాన్‌పై కఠినంగా ఉంటూనే, ఇంధన ధరలు పెరగకుండా చూసుకోవడం ఆయనకు సవాలుతో కూడుకున్న పని. ప్రస్తుతానికి ఆయన చేస్తున్న ప్రకటనలు యుద్ధాన్ని ఆపడానికా లేక అమెరికా ప్రయోజనాలను కాపాడుకోవడానికా అనేది రానున్న రోజుల్లో తేలుతుంది. ఇప్పటికే అమెరికాలో తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకుంటూ పాలన సాగిస్తున్న ట్రంప్ కు.. ఇరాన్ దూకుడు చుక్కలు చూపిస్తోంది.

Published : 
  • 20 March 2026, 12:41 PM IST