ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఇప్పుడు కృష్ణా జిల్లా చుట్టూనే తిరుగుతోంది. ఎన్నికల ఫలితాల తర్వాత సైలెంట్ అయిపోయిన నేతలు.. ఇప్పుడు మళ్లీ గేర్ మారుస్తున్నారు. ముఖ్యంగా గన్నవరం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ ఊహించని రేంజ్లో స్పీడ్ పెంచారు. కేసులు, అరెస్టులు ఎన్ని ఎదురైనా.. దేనికీ భయపడేదే లేదంటూ నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. కానీ, ఇదే సమయంలో కృష్ణా జిల్లాలోనే మరో ఫైర్ బ్రాండ్ లీడర్, వంశీకి అత్యంత ఆప్తుడైన కొడాలి నాని మాత్రం గుడివాడలో గతంలోలా యాక్టివ్‌గా కనిపించడం లేదు. కేసులు, ప్రభుత్వ వేధింపులకు భయపడే కొడాలి నాని సైలెంట్ అయ్యారా..? అనే అనుమానాలు ఇప్పుడు గుడివాడ నియోజకవర్గంలో గట్టిగా వినిపిస్తున్నాయి. అసలు కృష్ణా జిల్లా రాజకీయాల్లో ఏం జరుగుతోంది..? వంశీ మార్క్ పాలిటిక్స్ ఏంటి..? నాని వ్యూహం ఏంటి..?
గన్నవరం పాలిటిక్స్ అంటేనే ఎప్పుడూ హాట్ కేక్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వల్లభనేని వంశీపై వరుసగా కేసులు నమోదయ్యాయి. గన్నవరం టీడీపీ ఆఫీస్ దాడి కేసు, కిడ్నాప్ ఆరోపణలు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు.. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వంశీని చుట్టుముట్టాయి. విజయవాడ పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి రిమాండ్‌కు కూడా పంపారు. నెలల తరబడి జైల్లో ఉన్నప్పటికీ.. బెయిల్‌పై బయటకు వచ్చిన వంశీ, ఇప్పుడు ఏమాత్రం తగ్గడం లేదు. రీసెంట్గా గన్నవరంలో ఓటర్ల వెరిఫికేషన్, ఎస్ఐఆర్ ప్రక్రియలో భారీగా అవకతవకలు జరుగుతున్నాయంటూ.. ఏకంగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి కూటమి సర్కార్‌కు షాకిచ్చారు వంశీ.
నియోజకవర్గంలో తన క్యాడర్‌కు అండగా ఉంటూ, నాలుగు మండలాల్లోని ప్రతి గ్రామాన్ని టచ్ చేస్తూ పొలిటికల్ అట్మాస్పియర్‌ను ఒక్కసారిగా హీటెక్కించారు. సాధారణంగా కేసులు, కోర్టుల చుట్టూ తిరిగే నేతలు కాస్త వెనక్కి తగ్గుతారు. కానీ వల్లభనేని వంశీ ఇందుకు భిన్నంగా వెళ్తున్నారు. "కేసులు వస్తుంటాయి.. పోతుంటాయి.. కానీ నా జనం కోసం నేను నిలబడతా" అనే సిగ్నల్ ఇస్తున్నారు. రీసెంట్గా కేంద్ర ఎన్నికల సంఘానికి ఇచ్చిన ఫిర్యాదులో.. ఓటర్ల నోటీసుల్లో సరైన వివరాలు లేవని, అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని నిలదీశారు. అంతటితో ఆగకుండా, గన్నవరం ఎయిర్పోర్ట్ కాంట్రాక్టు వ్యవహారాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందంటూ ఏకంగా సీఎం చంద్రబాబు నాయుడుకే సంచలన లేఖ రాసి అందరినీ ఆశ్చర్యపరిచారు వంశీ.
చట్టపరమైన సమస్యలు వెంటాడుతున్నా.. కోర్టు మెట్లు ఎక్కుతున్నా.. గ్రౌండ్ లెవల్లో ఆయన చూపిస్తున్న అగ్రెసివ్ పాలిటిక్స్ చూసి గన్నవరం కూటమి నేతలు సైతం అప్రమత్తమవుతున్నారు. మరోవైపు, కొడాలి నాని పరిస్థితి గుడివాడలో భిన్నంగా కనిపిస్తోంది. ఒకప్పుడు చంద్రబాబు, లోకేష్ పేర్లు చెబితేనే రెచ్చిపోయే కొడాలి నాని.. ఇప్పుడు గుడివాడ నియోజకవర్గంలో పెద్దగా తిరగడం లేదనే టాక్ బలంగా నడుస్తోంది. కూటమి ప్రభుత్వం ఆయనపై కూడా పాత కేసులను తిరగదోడుతోంది. 2021 నాటి ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసులో నానిని ప్రాసిక్యూట్ చేయడానికి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
వాలంటీర్లను బలవంతంగా రాజీనామా చేయించారనే కేసులు, లిక్కర్ గొడౌన్ల వివాదాలు, బెట్టింగ్ ముఠాలతో అనుచరుల లింకులు.. ఇలా నాని చుట్టూ బలమైన చక్రవ్యూహం సిద్ధమైంది. అయితే ఇటీవల డీఎస్సీ నిరసనల సమయంలో ఆయన గుడివాడలో భారీ ర్యాలీ చేయడానికి ప్రయత్నించగా.. పోలీసులు ఆయనను సొంత నివాసంలోనే హౌస్ అరెస్ట్ చేశారు. ఆ తర్వాత నుండి ఆయన క్యాడర్‌కు అందుబాటులో ఉండటం లేదని, కేసుల భయంతోనే ఆయన నియోజకవర్గంలో యాక్టివ్‌గా తిరగడం లేదనే గుసగుసలు సొంత పార్టీలోనే వినిపిస్తున్నాయి. వల్లభనేని వంశీ, కొడాలి నాని ఇద్దరూ రాజకీయాల్లో ప్రాణస్నేహితులు.
ఒకరు గన్నవరంలో, మరొకరు గుడివాడలో చక్రం తిప్పినవారే. కానీ ప్రస్తుత ప్రభుత్వ యాక్షన్ ప్లాన్ చూసి ఇద్దరూ రెండు వేర్వేరు వ్యూహాలను అమలు చేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వంశీ 'ఎటాకింగ్ ఈజ్ బెస్ట్ డిఫెన్స్' అనే సిద్ధాంతాన్ని నమ్మి.. ముందడుగు వేస్తూ పబ్లిక్‌లోకి వెళ్తుంటే.. కొడాలి నాని మాత్రం 'తగిన సమయం వచ్చే వరకు వెనక్కి తగ్గడం' మంచిదనే వ్యూహంలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే లీడర్ గ్రౌండ్లో లేకపోవడంతో గుడివాడ వైఎస్సార్సీపీ క్యాడర్ తీవ్ర నైరాశ్యంలో మునిగిపోతుందనే వాదనలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనా, గన్నవరంలో వల్లభనేని వంశీ చూపిస్తున్న స్పీడ్ ఇప్పుడు కృష్ణా జిల్లా రాజకీయాల్లో కొత్త కాక రేపుతోంది. కేసులు, అరెస్టుల భయం లేకుండా దూసుకుపోతున్న వంశీని చూసి అయినా.. కొడాలి నాని మళ్లీ గుడివాడలో రీ-ఎంట్రీ ఇస్తారా? లేదా ఇలాగే సైలెంట్‌గా ఉంటూ వ్యూహాత్మక మౌనం పాటిస్తారా? అనేది చూడాలి.