Top story: గాంధీని చంపడానికి ఆ 55 కోట్లే కారణమా..? చివరి ఉపవాసం వెనుక అసలు నిజాలు! భారత ప్రభుత్వంతో గాంధీజీ యుద్ధం!

1948 జనవరి 13... సరిగ్గా స్వాతంత్ర్యం వచ్చిన కొన్ని నెలలకే, అప్పటికే నీరసించిపోయిన 78 ఏళ్ల ముసలాడు ఒకరు ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నారు. ఆయన మరెవరో కాదు, మహాత్మా గాంధీ. అయితే ఈ దీక్ష భారతదేశాన్ని ఒక కుదుపు కుదిపేసింది.

Post Published By: dialnews
Updated : 17 August 2026, 3:24 PM IST

1948 జనవరి 13... సరిగ్గా స్వాతంత్ర్యం వచ్చిన కొన్ని నెలలకే, అప్పటికే నీరసించిపోయిన 78 ఏళ్ల ముసలాడు ఒకరు ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నారు. ఆయన మరెవరో కాదు, మహాత్మా గాంధీ. అయితే ఈ దీక్ష భారతదేశాన్ని ఒక కుదుపు కుదిపేసింది. మన శత్రుదేశంగా మారిన పాకిస్తాన్‌కు అప్పట్లోనే 55 కోట్ల రూపాయలను భారత్ తక్షణమే విడుదల చేయాలని గాంధీజీ పట్టుబట్టారు. అటు కాశ్మీర్‌లో పాక్ సైన్యం మన జవాన్లను చంపుతుంటే, ఇటు గాంధీజీ మాత్రం పాకిస్తాన్‌కు డబ్బులు ఇవ్వాలని ఎందుకు మొండికేసారు..? నెహ్రూ, సర్దార్ పటేల్ లాంటి దిగ్గజాలు కూడా గాంధీజీ నిర్ణయాన్ని ఎందుకు వ్యతిరేకించారు? చివరకు సొంత దేశ ప్రజలే ఆయనకు వ్యతిరేకంగా "గాంధీ చనిపోవాలి" అని నినాదాలు ఎందుకు చేశారు?

1947 ఆగస్టులో స్వాతంత్ర్యం వచ్చిన ఆనందం ఎంతో కాలం నిలవలేదు. దేశ విభజన కారణంగా చెలరేగిన మతకల్లోలాలు కోట్లాది మంది జీవితాలను బుగ్గిపాలు చేశాయి. పాకిస్తాన్ నుండి సర్వస్వం కోల్పోయి, నగ్నంగా, గాయాలతో ఢిల్లీకి చేరుకున్న హిందువులు, సిక్కుల శరణార్థులతో ఢిల్లీ నగరం నిండిపోయింది. వారి గుండెల్లో ముస్లింలపై తీవ్రమైన పగ, కోపం ఉన్నాయి. ప్రతీకారంగా ఢిల్లీలోని ముస్లింలపై దాడులు జరిగాయి, వారిని ఇళ్లనుంచి వెళ్లగొట్టారు, వందలాది మసీదులను శరణార్థుల శిబిరాలుగా మార్చారు.

ఢిల్లీలో శాంతిని నెలకొల్పడానికి, ముస్లింల హక్కులను కాపాడటానికి గాంధీజీ రంగంలోకి దిగారు. మతం ఏదైనా సరే, ప్రతి ఒక్కరికీ ఈ దేశంలో జీవించే సమాన హక్కు ఉందని ఆయన నమ్మారు. కానీ, హింసను చూసి విసిగిపోయిన గాంధీజీకి, కేవలం మిలిటరీ, పోలీసు బలగాలతో వచ్చే శాంతి తాత్కాలికమే అనిపించింది. ప్రజల హృదయాల్లో మార్పు రావాలని ఆయన కోరుకున్నారు. ఈ మతకల్లోలాల మధ్యే మరో పెద్ద ఆర్థిక, రాజకీయ వివాదం రాజుకుంది. దేశ విభజన ఒప్పందం ప్రకారం బ్రిటీష్ వారు వదిలివెళ్లిన ఉమ్మడి ఆస్తులలో పాకిస్తాన్‌కు భారత్ 75 కోట్ల రూపాయలు ఇవ్వాలి.

అందులో 20 కోట్లు ముందే చెల్లించారు, మిగిలిన 55 కోట్లు భారత్ ఇవ్వాల్సి ఉంది. కానీ, అదే సమయంలో పాకిస్తాన్ సాయంతో గిరిజన ముఠాలు కాశ్మీర్‌పై దండెత్తాయి. దాంతో భారత హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. "మనపై యుద్ధం చేస్తున్న దేశానికి మనం 55 కోట్లు ఇస్తే, ఆ డబ్బుతో వారు తుపాకులు కొని మన సైనికులనే చంపుతారు. కాబట్టి కాశ్మీర్ సమస్య తేలేవరకు ఆ డబ్బు ఆపాలి" అని పటేల్ వాదించారు. ఈ నిర్ణయానికి నెహ్రూ క్యాబినెట్ కూడా మద్దతు ఇచ్చింది. కానీ ఈ విషయం గాంధీజీకి తెలిసినప్పుడు ఆయన తీవ్రంగా కలత చెందారు. "ఒప్పందం ప్రకారం ఇవ్వాల్సిన డబ్బును శత్రుత్వం నెపంతో ఆపడం అంతర్జాతీయంగా భారతదేశ పరువు తీస్తుంది, నైతికంగా ఇది తప్పు" అనేది గాంధీజీ వాదన.

ఢిల్లీలో మత సామరస్యాన్ని పునరుద్ధరించడానికి మరియు పాకిస్తాన్‌కు ఆ 55 కోట్లు విడుదల చేయించడానికి 1948 జనవరి 13న గాంధీజీ బిర్లా హౌస్‌లో ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నారు. అప్పటికే ఆయన శరీరం చాలా బలహీనపడింది. ఈ ప్రకటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది, ప్రభుత్వానికి పెద్ద షాక్ ఇచ్చింది. నెహ్రూ, పటేల్ ఆయన పడక వద్దకు వచ్చి నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో కన్నీళ్లతో గాంధీజీ సర్దార్ పటేల్‌ వంక చూస్తూ.. "నువ్వు నేను ఒకప్పుడు చూసిన ఆ పాత సర్దార్‌వి కావు" అని ఆవేదనతో అన్నారు. మరోవైపు గాంధీజీ తీరుపై హిందూ శరణార్థుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.

బిర్లా హౌస్ బయట నిరసనకారులు "గాంధీ చనిపోవాలి" అంటూ నినాదాలు చేశారు. తన సొంత ప్రజలే తన మరణాన్ని కోరుకుంటున్నా, గాంధీజీ తన అంతరాత్మ ప్రభోదాన్నే నమ్ముకుని దీక్ష కొనసాగించారు. గాంధీజీ ప్రాణాలు ప్రమాదంలో పడటంతో, భారత ప్రభుత్వం లొంగక తప్పలేదు. వెంటనే పాకిస్తాన్‌కు 55 కోట్ల రూపాయలను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే దీక్ష విరమించడానికి గాంధీజీ కేవలం డబ్బు మాత్రమే కాదు, మౌలానా ఆజాద్ సమక్షంలో 7 కఠినమైన షరతులు విధించారు.

ఈ షరతులకు కట్టుబడి ఉంటామని హిందూ, ముస్లిం, సిక్కు నాయకులు సంతకాలు చేయడంతో, జనవరి 18న గాంధీజీ నిమ్మరసం తాగి దీక్ష విరమించారు. ఈ దీక్ష ముగిసిన కేవలం 12 రోజుల్లోనే, అంటే 1948 జనవరి 30న నాథూరామ్ గాడ్సే చేతిలో గాంధీజీ దారుణంగా హత్యకు గురయ్యారు. గాంధీజీ తీసుకున్న ఈ 55 కోట్ల నిర్ణయమే ఆయన ప్రాణాలను బలిగొనడానికి ఒక ముఖ్య కారణం అని చరిత్రకారులు చెబుతారు. శత్రు దేశానికైనా సరే ఇచ్చిన మాట ప్రకారం న్యాయం చేయాలన్నది గాంధీజీ నైతిక వాదనైతే, మనల్ని చంపే శత్రువుకు డబ్బులు ఇవ్వడం దేశద్రోహమే అని గాడ్సే భావించాడు.

Published : 
  • 17 August 2026, 3:24 PM IST