ఇరాన్ దెబ్బ తీస్తే అమెరికాకు జరిగే లాభాలేంటి ? ప్రజా ప్రభుత్వం ఏర్పాటు అనేది...వ్యూహం మాత్రమేనా ? యుద్ధం వెనుక రాజకీయ, ఆర్థిక అంశాలు ముడిపడి ఉన్నాయా ? ముస్లిం దేశాలపై ఆధిపత్యం, చమురు నిల్వలపై పట్టు సాధించడమే అసలు లక్ష్యమా ? ఖమేనీ ఉంటే ఇవన్నీ సాధ్యం కావనే అమెరికాకు భయపట్టుకుందా ? అందుకే మొదట ఖమేనీని హతమార్చిందా ?ఇరాన్ అణు కార్యక్రమ పునరుద్ధరణ ప్రయత్నాలను అడ్డుకోవడమే లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్ దళాలు...ఆ దేశంపై మెరుపు దాడులు చేస్తున్నాయి. ఇరాన్ తక్షణమే ఆయుధాలను వీడకపోతే....ఊహించని నష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇరాన్‌తో అమెరికాకు ఎప్పటికైనా ప్రమాదం పొంచి ఉంది.
ఇరాన్ మద్ధతుతోనే హామాస్, హెజ్బోల్లా ఉగ్రవాద సంస్థలు... ఇజ్రాయెల్‌పై దాడులు చేస్తోందని అమెరికా అరోపణ. ఇరాన్ అణ్వాయుధాలను అడ్డుకోవడం...ఇరాన్లో ఉన్న నరహంతక నాయకత్వాన్ని రూపుమాపడమే లక్ష్యంగా అమెరికా దాడులకు తెగబడింది. ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ సభ్యులకు ట్రంప్ అల్టిమేటం జారీ చేశారు. తక్షణమే ఆయుధాలను వీడి లొంగిపోతే పూర్తి రక్షణ కల్పిస్తామని, లేనిపక్షంలో ఊహించని పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. మరోవైపు ఇరాన్ కూడా అమెరికా, ఇజ్రాయెల్‌కు వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్ దెబ్బకు మిమ్మల్ని మీరే అడుక్కోవాల్సి పరిస్థితి వస్తుందని హెచ్చరించింది. ఖమేనీ హత్యను మహా నేరంగా అభివర్ణించిన ఇరాన్... ఇజ్రాయెల్‌ను దుష్టశక్తి పోల్చారు.
ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేస్తోందని ఇజ్రాయెల్ బలంగా నమ్ముతోంది. ఇరాన్ చేతిలో అణు బాంబులు ఉంటే తమ మనుగడకే ప్రమాదమని భావించిన ఇజ్రాయెల్ గతంలోనే ఇరాన్ శాస్త్రవేత్తలను, అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించింది. పలువురిని హతమార్చింది. పశ్చిమాసియాలో అమెరికాకు అత్యంత నమ్మకమైన భాగస్వామి ఇజ్రాయెల్. అయితే అమెరికా జోక్యానికి కేవలం స్నేహం మాత్రమే కారణం కాదు, దీని వెనుక బలమైన భౌగోళిక రాజకీయ కారణాలు ఉన్నాయి. ఇరాన్ తన క్షిపణులతో ప్రపంచానికి చమురు సరఫరా చేసే కీలక మార్గాలను మూసివేస్తే...ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది. దీన్ని అడ్డుకోవడం అమెరికాకు కీలకంగా మారింది. ఇరాన్ విస్తరణ వాదాన్ని అడ్డుకోకపోతే సౌదీ అరేబియా వంటి ఇతర అరబ్ మిత్రదేశాల భద్రత ప్రమాదంలో పడుతుంది. ఇది రష్యా, చైనాల ప్రభావం...ఆ ప్రాంతంలో పెరగడానికి దారితీస్తుంది. ఈ పరిణామాలు అమెరికా ఎప్పటికైనా డేంజరే. అందుకే అమెరికా నేరుగా యుద్దం చేస్తోంది.
ఇరాన్... అణు సామర్థ్యం సాధిస్తే పశ్చిమాసియాలో అణ్వాయుధాల పోటీ మొదలవుతుంది. ఇరాన్ చూసి మరికొన్ని దేశాలు కూడా అణ్వాయుధాలు చేసేందుకు సిద్ధమవుతాయి. దీనికి తోడు అమెరికాకు నమ్మకంగా ఉన్న ఇజ్రాయెల్‌కు ఎప్పటికైనా ప్రమాదకరమే. పైకి ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేస్తామని అమెరికా చెబుతున్నా...అంతర్గతంగా అనేక వ్యూహాలు ఉన్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని చంపేయడం ద్వారా...పాలన మొత్తం అమెరికా చేతుల్లోకి వస్తుంది. అగ్రరాజ్యం చెప్పినట్లు నడుచుకునే వాళ్లే...పాలన పగ్గాలు చేపడుతారు.
ఇరాన్‌లోని చమురు నిల్వలపై...అమెరికా పట్టు సాధించే అవకాశం ఉంటుంది. దీనికి తోడు మధ్యధరా సముద్రంలోని పర్షియన్ గల్ఫ్, హిందూ మహా సముద్రంలోని గల్ఫ్ ఆఫ్ ఒమన్ మధ్య 33 కిలోమీటర్ల వెడల్పుతో హార్ముజ్ జలసంధి ఉంది. పర్షియన్ గల్ఫ్ ప్రాంతం నుంచి బహిరంగ సముద్ర జలాల్లోకి నౌకలు ఎంటర్ కావాలంటే మార్గం మధ్యనున్న హార్ముజ్ జలసంధిని దాటాల్సిందే. అందుకే ఇది ఇరాన్‌కు వ్యూహాత్మక ప్రాంతంగా మారింది. హార్ముజ్ జలసంధికి ఓ వైపున ఇరాన్, మరోవైపున ఒమన్, యూఏఈ దేశాలు ఉన్నాయి. ప్రతిరోజూ ప్రపంచవ్యాప్తంగా జరిగే ముడిచమురు సప్లైలో 20 శాతం హార్ముజ్ జలసంధి మీదుగానే వెళ్తుంటుంది. అమెరికా నౌకలు ఇబ్బందులు లేకుండా రాకపోకలు సాగించాలంటే ఇరాన్ దారిలోకి తెచ్చుకోవచ్చు.