మాజీ మంత్రి, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కన్ను మూస్తే ....మెగాస్టార్ చిరంజీవి చిన్న సంతాప సందేశం కూడా పంపలేదు. స్వయంగా కిర్లంపూడి వెళ్లి ముద్రగడ పార్దివ దేహానికినివాళులు అర్పించలేకపోయినా... చిరు, కనీసం సంతాప సందేశమైన పంపుతారని, మీడియాతో మాట్లాడుతారని.... ఏదో ఒక మార్గంలో ఆ కుటుంబాన్ని పరామర్శిస్తారని కాపు సామాజిక వర్గం భావించింది. చిరంజీవి ఫ్యాన్స్ కూడా చిరు నుంచి ఏదో ఒక మెసేజ్ ఆశించారు. కానీ అనూహ్యంగా ముద్రగడ మరణం పై చిరంజీవి మౌనం వహించారు. కాపు సామాజిక నేతగా చెరిగిపోని ముద్ర వేసిన పద్మనాభం చనిపోతే చిరంజీవి ఎందుకు మౌనంగా ఉన్నారు...? నాగబాబు కూడా ఎందుకు రియాక్ట్ కాలేదు? ఆ రెండు కుటుంబాల మధ్య బయట ప్రపంచానికి తెలియని అగాధం ఏదైనా ఉందా? అనే చర్చ కాపు సామాజిక వర్గంలో బాగా జరుగుతుంది. పవన్ కళ్యాణ్ ని ముద్రగడ వ్యతిరేకించడం వల్ల చిరంజీవి ఆయనకు దూరమయ్యారా? లేక వీళ్లిద్దరి మధ్య ఏమైనా గొడవ వచ్చిందా? ఇలా రకరకాలుగా కాపులు మాట్లాడుకుంటున్నారు. కానీ దీని వెనక చాలా పెద్ద కథే ఉంది.
2009 వరకు ముద్రగడ, చిరంజీవి మధ్య చాలా సఖ్యత ఉండేది. ఒకటి రెండు సందర్భాల్లో ఇద్దరూ కలసినప్పుడు కాపుల హక్కుల పై చర్చించుకున్నారు కూడా. అయితే ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చిరంజీవి అందరికన్నా ముందు ముద్రగడను పిఆర్పి లో చేరాలని ఆహ్వానించారు. ఆయనకు పార్టీ ఉపాధ్యక్షుడు పదవి కూడా ఆఫర్ చేశారు. కానీ మొండితనానికి మారుపేరైన ముద్రగడ చిరంజీవి ఆఫర్ ని తిరస్కరించారు. చేగొండి హరిరామ జోగయ్య తోపాటు కాపుల్లో హేమాహేమీలంతా పిఆర్పీ లో చేరడం వలన, తాను కూడా పిఆర్పి లో చేరితే తన ఉనికికే దెబ్బ తగిలితే ప్రమాదం లేకపోలేదని ముద్రగడ భావించినట్లు ఉన్నారు.
పైగా మొదటి నుంచి సినిమా వాళ్లపై ముద్రగడకు సదాభిప్రాయం లేదు. అంతేకాదు ఎవరో సినిమా హీరో వచ్చి కాపులకు బ్రాండ్ అంబాసిడర్ అవుతాను అంటే ముద్రగడ అంగీకరించ లేకపోయారు. మెగాస్టార్ పిఆర్పీని సమర్థంగా నడపలేరని ముద్రగడ మొదటి నుంచి బలంగా చెప్తుండేవారు. అందుకే చిరంజీవి ఇచ్చిన ఆఫర్ ని నిర్మూమాటంగా తిరస్కరించారు. అంతేకాదు 2009 లోకాంగ్రెస్ తరపున పిఠాపురం నుంచి పోటీ చేసి... అప్పటి పిఆర్పీ నేత వంగా గీత చేతిలో ఓడిపోయారు. అయినప్పటికీ ఇద్దరి మధ్య పెద్ద వైరం అంటూ ఏమీ లేదు.2016లో కాపుల రిజర్వేషన్ కోసం ముద్రగడ పద్మనాభం ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. అప్పటికి చిరంజీవి కాంగ్రెస్ లో ఉన్నారు. ముద్రగడకు మద్దతుగా అప్పుడు పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తో కలిసి చిరు హైదరాబాద్ నుంచి కిర్లంపూడి బయలుదేరి వెళ్లారు. పెద్దాయనకు సంఘీభావం తెలపడానికి వెళ్లిన రఘువీరా ను ,చిరంజీవిని ఇద్దరినీ రాజమండ్రి ఎయిర్పోర్ట్ లో పోలీసులు అడ్డుకున్నారు. కిర్లంపూడి వెళ్ళనివ్వలేదు.
2014లో జనసేన పార్టీ పెట్టిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ ముద్రగడకు బిగ్ ఆఫర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కాపులకు ఎప్పటికీ ప్రతినిధి కాలేడని.... కాపుల ప్రయోజనాల ను పవన్ కళ్యాణ్ చేతిలో పెట్టలేనని.... ముద్రగడ తెగేసి చెప్పారు.2024 ఎన్నికలకు ముందు కూడా జనసేన ముద్రగడకు పెద్ద ఆఫర్ ఇచ్చింది. ప్రభుత్వంలోకి వస్తే గవర్నర్ను చేస్తానని ఆశ పెట్టింది.ఈ ప్రలోభాలకు ముద్రగడ లొంగలేదు. పైగా పవన్ కళ్యాణ్ ని విమర్శించడం మొదలుపెట్టారు. చంద్రబాబుతో చేతులు కలిపి పవన్ కళ్యాణ్ కాపుల ద్రోహిగా మారాడని పద్మనాభం విమర్శించారు. ముద్రగడ కుమార్తె క్రాంతి తండ్రికి వ్యతిరేకంగా జనసేనతో చేయి కలిపింది. తన కుమార్తెను తన నుంచి విడదీసి జనసేన తన కుటుంబంలో చిచ్చు పెట్టిందని అభిప్రాయంలో ఉండేవారు ముద్రగడ.
ఓ సందర్భంలో పవన్ కళ్యాణ్ ముద్రగడ కుటుంబ వ్యవహారాన్ని ప్రస్తావించగా ఆగ్రహంతో రగిలిపోయారు పద్మనాభం. చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ గురించి ఎత్తిపొడుస్తూ.... మీ కుటుంబ వ్యవహారాల్లో మేము ఎప్పుడైనా జోక్యం చేసుకుందామా? మేం కల్పించుకున్నామా? అంటూ పవన్ కళ్యాణ్ నీ నిలదీశారు. ముద్రగడ పద్మనాభం పవన్ పైకి విసిరిన రాయి నేరుగా చిరంజీవికి తగిలింది. తన కుమార్తె గురించి ముద్రగడ పద్మనాభం ఓపెన్ ప్రెస్ మీట్ లో అలా మాట్లాడటం చిరంజీవి జీర్ణించుకోలేకపోయారు. అక్కడితో మౌనంగానే ముద్రగడకు పూర్తిగా దూరమైపోయారు. మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన పి ఆర్ పి, జనసేన రెండు పార్టీలకు తాను దూరంగా ఉండటం, పవన్ కళ్యాణ్ చిరంజీవి ఇద్దరు కాపులను వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ముద్రగడ పలుమార్లు విమర్శించడం... చిరంజీవికి కోపం తెప్పించింది. అన్నిటికీ మించి శ్రీజ గురించి ముద్రగడ బహిరంగంగా మాట్లాడటం, చిరుని చాలా బాధించింది. ఇవన్నీ మనసులో పెట్టుకొని ముద్రగడ కన్నుమూసినప్పుడు సంతాపంగా చిన్న మెసేజ్ కూడా పెట్టలేదు. ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు చిరంజీవి. తెలుగు రాష్ట్రాల్లో ఏం జరిగినా ....ప్రతి దానికి రియాక్ట్ అయ్యే చిరంజీవి ముద్రగడ మరణం పై మౌనంగా ఉండి పోవడం వెనక అసలు కారణం ఇది.