భూగోళంపై ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం గురించి మనమందరం వినే ఉంటాం. కానీ మనకు అత్యంత సమీపంలోనే 'మూడవ ధ్రువం' ఒకటి ఉందనే విషయం మీకు తెలుసా? అవును.. శాస్త్రవేత్తలు మన హిందూకుష్ హిమాలయాలనే భూమి యొక్క మూడవ ధ్రువం అని పిలుస్తారు. ఎందుకంటే, ఆర్కిటిక్, అంటార్కిటికా తర్వాత ప్రపంచంలోనే అత్యధికంగా మంచు, ఐస్ పేరుకుపోయిన ప్రాంతం ఇదే. కానీ, ఇప్పుడు ఈ మూడవ ధ్రువం వద్ద ఒక భయంకరమైన టైమ్ బాంబ్ టిక్ టిక్ మంటూ కొట్టుకుంటోంది.
అది ఎప్పుడు పేలుతుందో, ఎలాంటి వినాశనాన్ని తెస్తుందో ఎవరికీ తెలియదు. ఇటీవల మన పొరుగు దేశమైన నేపాల్‌లో సంభవించిన పెను విపత్తులో వెయ్యి మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోర ప్రమాదం కేవలం అకాల వర్షాల వల్ల వచ్చింది కాదు.. గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పుల వల్ల హిమాలయాలు మానవాళికి పంపుతున్న ఒక అత్యంత ప్రమాదకరమైన హెచ్చరిక.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన వ్యవస్థ కారణంగా నేపాల్‌లో ఊహించని రీతిలో ఫ్లాష్ ఫ్లడ్స్ మరియు కొండచరియలు విరిగిపడ్డాయి. నేపాల్‌లోని మొత్తం 77 జిల్లాలకు గానూ 35 జిల్లాలు ఈ వరదల్లో చిక్కుకుని సర్వనాశనమయ్యాయి. ముఖ్యంగా ఖాట్మండులోని బాగమతి నది గత 30 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా 14.8 మీటర్ల గరిష్ట స్థాయికి చేరుకుని ప్రవహించింది. జగత్ ప్రసిద్ధ పశుపతినాథ్ ఆలయ ప్రాంగణాన్ని సైతం వరద నీరు ముంచెత్తింది. పరిస్థితి ఎంత ఘోరంగా తయారైందంటే.. నేపాల్ ఆర్మీ హెలికాప్టర్లు 47 సార్లు రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహించి, ఇళ్ల కప్పులపై ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతున్న 612 మందిని కాపాడాల్సి వచ్చింది.
ఈ బురద శిథిలాల మధ్య రిపోర్టర్లకు దొరికిన ఒక స్కూల్ పుస్తకం యావత్ ప్రపంచాన్ని కదిలించింది. ఆ పుస్తకంపై "రోషన్ మిజార్, క్లాస్ 7, రోల్ నెంబర్ 31, శ్రీ బాగేశ్వరి సెకండరీ స్కూల్" అని రాసి ఉంది. ఆ పుస్తకంలో ఒక ప్లాస్టిక్ స్కేల్ మార్కర్‌గా పెట్టి ఉంది.. బహుశా టీచర్ క్లాస్ ముగించిన చివరి పాఠం అది కావచ్చు. బ్యాగులో రెండు పెన్నులు, లంచ్ బాక్స్ అలాగే ఉన్నాయి. కానీ ఆ బాబు ప్రాణాలతో ఉన్నాడో లేదో ఎవరికీ తెలియదు. ఈ ఒక్క బాలుడి కథే కాదు, నేపాల్‌లోని వేలాది కుటుంబాలు ఈ రోజు రోడ్డున పడ్డాయి.
శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం, నేపాల్ విపత్తుకు వెనుక ఉన్న అసలు సూత్రధారి హిమాలయాల్లో వేగంగా కరిగిపోతున్న గ్లేసియర్లే. మన దేశం చుట్టుపక్కల ఉన్న హిందూకుష్ హిమాలయ ప్రాంతం మొత్తం ఏడు ప్రధాన జోన్లుగా విస్తరించి ఉంది. 1. హిందూకుష్ ప్రాంతం, 2. కారకోరం శ్రేణులు, 3. పశ్చిమ హిమాలయాలు, 4. టిబెట్ లోపలి పర్వతాలు, 5. సెంట్రల్ హిమాలయాలు, 6. తూర్పు హిమాలయాలు మరియు 7. తూర్పు టిబెట్ పర్వతాలు.
ఈ ఏడు ప్రాంతాల పరిధిలో వేలాది గ్లేసియర్లు ఉన్నాయి. అయితే, గత 50 ఏళ్లుగా ఈ ప్రాంతంలో ప్రతి దశాబ్దానికి సగటున 0.2 డిగ్రీల సెల్సియస్ చొప్పున ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తున్నాయని గణంకాలు చెబుతున్నాయి. దీనికి తోడు 21వ శతాబ్దం ప్రారంభం నుండి ఇక్కడ మంచు కురవడం కూడా గణనీయంగా తగ్గిపోయింది. ఎప్పుడైతే వేడి పెరిగి, మంచు కురవడం తగ్గుతుందో.. పర్వతాలపై ఉండే మంచు గడ్డలు శరవేగంగా కరిగి నీరైపోతాయి. ఈ ఉష్ణోగ్రతల పెరుగుదల వల్ల గ్లేసియర్ల యొక్క 'మాస్ బ్యాలెన్స్' పూర్తిగా దెబ్బతింటోంది.
అసలు మాస్ బ్యాలెన్స్ అంటే ఏమిటి? సాధారణంగా శీతాకాలంలో పర్వతాలపై ఎంత మంచు పేరుకుపోతుందో, ఎండాకాలంలో అంతే మంచు కరిగిపోవాలి. దీనిని బ్యాలెన్స్ అంటారు. కానీ ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ వల్ల పేరుకుపోయే మంచు కంటే, కరిగిపోయే మంచు పరిమాణం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. గ్లేసియర్లు అనేవి వాతావరణ మార్పులను సూచించే అత్యంత విలువైన సహజ సూచికలు. ఎప్పుడైతే ఈ మంచు వేగంగా కరుగుతుందో, పర్వతాల పైన ప్రమాదకరమైన గ్లేసియల్ సరస్సులు ఏర్పడతాయి.
ఇవి పైన కొండలపై నీటిని నిల్వ ఉంచుతాయి, కానీ ఎప్పుడైనా భూకంపం వచ్చినా లేదా కొండచరియలు విరిగిపడినా.. ఈ సరస్సుల గట్లు ఒక్కసారిగా బద్దలవుతాయి. దీనినే 'గ్లేసియల్ లేక్ అవుట్‌బర్స్ట్ ఫ్లడ్' అంటారు. నేపాల్‌లో కురిసిన భారీ వర్షాలకు ఈ గ్లేసియర్లు తోడవడంతోనే అంతటి భారీ వినాశనం జరిగింది. నేపాల్ విపత్తు అనేది కేవలం మన పొరుగు దేశానికి సంబంధించిన సమస్య మాత్రమే కాదు.. ఇది భారతదేశానికి ఒక గట్టి హెచ్చరిక. ఎందుకంటే ఈ 'మూడవ ధ్రువం' లోని ఒక భారీ భాగం భారతదేశ పర్వత ప్రాంతాలతోనే ముడిపడి ఉంది. శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్న విషయం ఏమిటంటే.. హిమాలయ పర్వతాల్లో ఏం జరిగినా, ఆ ప్రభావం కేవలం కొండలకే పరిమితం కాదు.
పర్వతాల్లోని మంచు కరిగితే, నదుల ద్వారా కింద ఉండే మైదాన ప్రాంతాలలో నివసించే దాదాపు 149 కోట్ల మంది ప్రజల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది. భారతదేశంలో ప్రవహించే గంగా, యమునా, బ్రహ్మపుత్ర వంటి జీవనదులన్నీ ఈ హిమాలయ గ్లేసియర్ల ఆధారంగానే ప్రవహిస్తున్నాయి. ఒకవేళ ఇవి పూర్తిగా కరిగిపోతే, మొదట్లో నదులకు ఊహించని వరదలు వస్తాయి, ఆ తర్వాత ఈ నదులన్నీ ఎండిపోయి ఎడారులుగా మారే ప్రమాదం ఉంది. ఇది మన తాగునీరు, వ్యవసాయం, ఆహార భద్రత మరియు జలవిద్యుత్ రంగాలను పూర్తిగా దెబ్బతీస్తుంది. పర్యావరణ శాస్త్రవేత్తల నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.. హిమాలయాల్లో టైమ్ బాంబ్ ఇప్పటికే టిక్ టిక్ మంటూ స్టార్ట్ అయిపోయింది. నేపాల్ మనకు కళ్లెదుట ఒక ఉదాహరణగా నిలిచింది. ఇప్పటికైనా అంతర్జాతీయ సమాజంతో పాటు భారతదేశం కూడా వాతావరణ మార్పులపై కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. పర్వత ప్రాంతాలలో మితిమీరిన నిర్మాణాలను నియంత్రించాలి, కర్బన ఉద్గారాలను తగ్గించాలి. లేదంటే ప్రకృతి తన ప్రతాపాన్ని చూపించడం మొదలుపెడితే తట్టుకోవడం ఎవరి తరం కాదు.