ఏ ఆటగాడికైనా గాయాలు సహజం.. క్రికెట్ లో అయితే వారి కెరీర్ లో సర్వసాధారణంగా ఉంటాయి. అయితే వాటి నుంచి కోలుకుని ఫిట్ నెస్ సాధించడమే ఎలాంటి ప్లేయర్ కైనా అతిపెద్ద పరీక్ష. భారత క్రికెట్ లో ఎన్నో సౌకర్యాలు ఉన్నా ఆటగాళ్లు వరుస గాయాల బారిన పడి పూర్తిస్థాయిలో కోలుకోకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కొంతకాలంగా టీమిండియాలో గాయాల ట్రెండ్ నడుస్తోంది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 13 మంది ఆటగాళ్లు గాయాల బారిన పడ్డారు. వారంతా ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ లో కోలుకుంటున్నారు. నిజానికి గాయపడిన తర్వాత చికిత్స, అనంతరం రికవరీ ప్రక్రియ సీవోఈలో కీలకం. ఇప్పుడు ఇదే విషయంలో సందేహాలు, గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. గాయం నుంచి కోలుకుని ఫిట్ నెస్ సాధించారంటూ కొందరు ప్లేయర్స్ ను జట్టులోకి ఎంపిక చేస్తుండగా, వాళ్లు సిరీస్ మధ్యలోనే మళ్లీ గాయాల బారిన పడుతున్నారు.
పాత గాయాలు తిరగబెడుతుండడంతో అసలు పూర్తిగా కోలుకోకుండానే, ఫిట్ నెస్ స్థాయి చూడకుండానే జట్టులోకి ఎంపిక చేస్తున్నారా అంటూ అనమానాలు తలెత్తుతున్నాయి. ఈ విషయంలో సెలక్టర్లను తప్పుపట్టలేం. కానీ సీవోఈలోని మెడికల్ టీమ్ నిర్ణయమే సెలక్షన్ కమిటీ పరిగణలోకి తీసుకుంటుంది. బుమ్రా, హర్షిత్ రాణా, నితీశ్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ వంటి ప్లేయర్స్ విషయంలో సీవోఈ నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్న అనుమానాలు వస్తున్నాయి.ఇంజ్యూరీ మేనేజ్ మెంట్ విషయంలో సీవోఈ తీరు సరిగ్గా లేదన్నది స్పష్టమవుతోంది. అందుకే ఆటగాళ్ల గాయాలు మళ్లీ మళ్లీ తిరగబెడుతూనే ఉన్నాయి. క్రికెట్ లో ఇంజ్యూరీ మేనేజ్ మెంట్ అనేది చాలా కీలకం. ఆటగాళ్ల ఫిట్నెస్ను కాపాడటానికి, వారి కెరీర్ను పొడిగించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. సరైన నిర్వహణ లేకపోతే ఆటగాళ్లు ఎక్కువకాలం ఆటకు దూరమయ్యే ప్రమాదం ఉంది. గాయాల తీవ్రతను ముందే గుర్తించి తగిన విశ్రాంతి ఇవ్వడం ఇందులో ప్రధానంగా చెప్పొచ్చు.
అలాగే సర్జరీ తర్వాత కోలుకునేందుకు తగినంత సమయం, ఫిట్ నెస్ ను తిరిగి సాధించే విషయంలోనూ సీవోఈ కీలకంగా వ్యవహరిస్తుంది. కానీ గాయాల బారిన పడ్డ ఆటగాళ్ల జాబితాను చూస్తే వారు తమ పాత్ర సరిగ్గా పోషించడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ సీవోఈ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. తాజాగా సాయి సుదర్శన్ గాయంతో లంక సిరీస్ కు దూరమడంతో బీసీసీఐ సెక్రటరీ దేవజీత్ సైకియా బెంగళూరు సీవోఈకి వెళ్లబోతున్నారు. అక్కడ సీవోఈ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్, ఇతర సిబ్బంది పనితీరుపై సమీక్ష నిర్వహించనున్నారు. ఇకపై అప్రమత్తంగా లేకుంటే మాత్రం మరింత మంది కీలక ఆటగాళ్లు భారత జట్టుకు దూరమయ్యే ప్రమాదం ఉందని పలువురు హెచ్చరిస్తున్నారు.