ఐపీఎల్ 2026 సీజన్లో ఆటగాళ్ల వ్యక్తిగత ప్రవర్తనపై బీసీసీఐ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్, అర్ష్‌దీప్ సింగ్ వంటి స్టార్ ప్లేయర్లు తమ గర్ల్‌ఫ్రెండ్స్‌తో కలిసి బహిరంగంగా తిరగడం, టీమ్ బస్సుల్లో ప్రయాణించడం, టీమ్ హోటళ్లలో వారితో కలిసి ఉండటంపై బోర్డు సీరియస్ అయింది. ఈ 'గర్ల్‌ఫ్రెండ్ కల్చర్' వల్ల భవిష్యత్తులో లీగ్ ప్రతిష్టకు భంగం కలిగే అవకాశం ఉందని భావిస్తున్న బీసీసీఐ.. దీనిని అరికట్టేందుకు కఠిన నిబంధనలను రూపొందిస్తోంది.విశ్వసనీయ సమాచారం ప్రకారం.. కొంతమంది ఆటగాళ్ల భాగస్వాములు సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్లు కావడమే బోర్డు ఆందోళనకు ప్రధాన కారణం.
గతంలో వీరిలో కొందరు బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా ఆటగాళ్లకు, వారి భాగస్వాములకు మధ్య తలెత్తే వివాదాలు పోలీస్ స్టేషన్ల వరకు వెళ్లడం వల్ల బోర్డు ప్రతిష్ట దెబ్బతింటోందని అధికారులు భావిస్తున్నారు.నిజానికి బీసీసీఐ నిబంధనల ప్రకారం.. కేవలం ఆటగాళ్ల భార్యలు, కుటుంబ సభ్యులకు మాత్రమే నిర్ణీత మార్గదర్శకాల ప్రకారం అనుమతి ఉంటుంది. అయితే 'అఫీషియల్ గర్ల్‌ఫ్రెండ్స్' పేరుతో యాంటీ కరప్షన్ యూనిట్ అధికారులు వీరికి ఎలా అనుమతి ఇస్తున్నారనే అంశంపై విచారణ చేపట్టాలని బోర్డు నిర్ణయించింది.
కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు ఆటగాళ్ల దగ్గర ఉండటం వల్ల జట్టుకు సంబంధించిన కీలక సమాచారం లీక్ అయ్యే ప్రమాదం ఉందని.. అది క్రీడల సమగ్రతను దెబ్బతీస్తుందని బోర్డు భయపడుతోంది.త్వరలో జరగనున్న బీసీసీఐ సమావేశంలో ఈ 'గర్ల్‌ఫ్రెండ్ కల్చర్'పై స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేయనున్నారు. ఈ నిబంధనలు కేవలం ఐపీఎల్‌కే కాకుండా భారత జాతీయ జట్టు విదేశీ పర్యటనలకు కూడా వర్తిస్తాయని సమాచారం. ఐపీఎల్ జట్లు ప్రైవేట్ యాజమాన్యంలో ఉన్నప్పటికీ.. నిబంధనలు మాత్రం అందరికీ సమానంగా ఉండేలా కేంద్ర నిబంధనను తీసుకురావాలని బీసీసీఐ యోచిస్తోంది. దీనివల్ల ఆటగాళ్లు తమ ఆటపైనే పూర్తి దృష్టి పెట్టే అవకాశం ఉంటుందని బోర్డు భావిస్తోంది.