ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కీలక నిర్ణయం తీసుకుంది. గత సీజన్‌లో ఓపెనింగ్ జోడీ విషయంలో ఆ జట్టు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. ఏకంగా ఆరు జోడీలను ప్రయత్నించింది. అయినా సత్ఫలితాలు అందుకోలేకపోయింది. ప్లే ఆఫ్స్ చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో ఈసారి అలాంటి తప్పు జరగకుండా ఓపెనింగ్ స్థానాలను ఖరారు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఆ జట్టు స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌ను ఓపెనర్‌గా ఫిక్స్ చేసింది.
ఈ విషయాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ , హెడ్ కోచ్ హేమంగ్ బదాని వెల్లడించారు.గతేడాది జట్టు కూర్పు కారణంగా కేఎల్ రాహుల్ మిడిల్ ఆర్డర్‌లో ఆడాడనీ, అప్పుడు ఇద్దరు విదేశీ ఆటగాళ్లు టాప్ ఆర్డర్‌లో ఆడారనీ అక్షర్ పటేల్ చెప్పాడు విదేశీ ప్లేయర్లను మిడిల్ ఆర్డర్‌లో ఆడిస్తే.. ప్రత్యర్థులు స్పిన్‌తో ఇబ్బంది పెడతారని భావించామన్నాడు. అందుకే కేఎల్ రాహుల్‌ను మిడిల్ ఆర్డర్‌లో ఆడించామనీ, రాహుల్ ఏ స్థానంలో అయినా ఆడగలడన్నాడు. ఓపెనర్‌గా వచ్చి కూడా చాలా రన్స్ చేశాడనీ గుర్తు చేశాడు.
టీ20 క్రికెట్‌లో జట్టుకు మంచి ఆరంభం లభిస్తే, ఆ తర్వాత వచ్చే బ్యాటర్ల పని ఈజీ అవుతుందన్నాడు. అందుకే ఈసారి కేఎల్ రాహుల్‌ను ఓపెనర్‌గా ఆడించాలని అనుకుంటున్నామని ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు అక్షర్ పటేల్ వ్యాఖ్యానించాడు.ఐపీఎల్ 2025కు ముందు జరిగిన మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ కేఎల్ రాహుల్‌ను దక్కించుకుంది. అతడు ఐపీఎల్ 2025లో 150కి పైగా స్ట్రైక్ రేట్‌తో 539 పరుగులు చేశాడు. ఐపీఎల్ 2022 తర్వాత ఇదే అతడి అత్యుత్తమ ప్రదర్శన కావడం గమనార్హం. ఐపీఎల్ 2026లో కేఎల్ రాహుల్‌తో కలిసి.. పతుమ్ నిస్సంక, అభిషేక్ పోరెల్, పృథ్వీ షాలలో ఒకరు ఓపెనర్‌గా వచ్చే అవకాశం ఉంది.