Top story: ముంబైకు హార్దిక్ పాండ్యా గుడ్‌బై..? రోహిత్ శర్మ ‘బ్లెస్సింగ్స్’ ఉంటేనే కొత్త కెప్టెన్.. ముంబై క్యాంప్ లో అసలేం జరుగుతోంది..?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన జట్టు ఏది అంటే ఎవరైనా ముంబై ఇండియన్స్ పేరే చెప్తారు. కానీ, గత రెండు సీజన్లుగా ఈ ఐదుసార్లు ఛాంపియన్ జట్టులో జరుగుతున్న పరిణామాలు అంతర్గత యుద్దాన్ని తలపిస్తున్నాయి.

Post Published By: dialnews
Updated : 29 May 2026, 9:15 PM IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన జట్టు ఏది అంటే ఎవరైనా ముంబై ఇండియన్స్ పేరే చెప్తారు. కానీ, గత రెండు సీజన్లుగా ఈ ఐదుసార్లు ఛాంపియన్ జట్టులో జరుగుతున్న పరిణామాలు అంతర్గత యుద్దాన్ని తలపిస్తున్నాయి. తాజాగా ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీలో ఊహించని భారీ సంక్షోభం తెరపైకి వచ్చింది. జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ టీమ్‌ను పూర్తిగా వీడాలని నిర్ణయించుకున్నట్లు క్రికెట్ వర్గాల్లో సంచలన వార్త హల్‌చల్ చేస్తోంది. అసలు హార్దిక్ ఎందుకు తప్పుకుంటున్నాడు..? ముంబై నెక్స్ట్ కెప్టెన్‌ను డిసైడ్ చేయడంలో ‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మ పాత్ర ఏంటి..? రోహిత్ శర్మ ఆశీస్సులు లేకపోతే ముంబైకి కొత్త కెప్టెన్ దొరకడం ఇంపాజిబుల్ అని ఎందుకు అంటున్నారు..?

ఐపీఎల్ ముగిసిన వెంటనే ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్ మరియు కెప్టెన్ హార్దిక్ పాండ్యా మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. గత రెండు సీజన్లుగా జట్టును నడిపిస్తున్న హార్దిక్.. కేవలం కెప్టెన్సీ నుంచి తప్పుకోవడమే కాదు, ఫ్రాంచైజీని పూర్తిగా వదిలేసి వేరే జట్టుకు బదిలీ కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. యాజమాన్యంతో వచ్చిన తీవ్రమైన విభేదాల వల్లే హార్దిక్ ఈ లీగల్ విండోలో జట్టు మారేందుకు గట్టిగా ట్రై చేస్తున్నారని ఇన్‌సైడ్ టాక్.

ఐదుసార్లు కప్పు గెలిచిన ముంబై జట్టులో ఇంత పెద్ద సంక్షోభం రావడం క్రికెట్ ఫ్యాన్స్‌ను సైతం షాక్‌కు గురిచేస్తోంది. నిజానికి ముంబై ఇండియన్స్ ఈ సీజన్‌లో అత్యంత పేలవమైన ప్రదర్శన చేసింది. ఆడిన 14 మ్యాచ్‌ల్లో కేవలం 4 మ్యాచ్‌లు మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానాల్లో నిలిచింది. రోహిత్ శర్మను కాదని గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ పాండ్యాను భారీ ట్రేడింగ్‌తో తీసుకొచ్చి కెప్టెన్సీ ఇచ్చినప్పటి నుంచే ముంబైలో గొడవలు మొదలయ్యాయి. అటు ఫ్యాన్స్ సపోర్ట్ లేక, ఇటు టీమ్ లోని సీనియర్ ప్లేయర్స్ సహకారం అందక హార్దిక్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నారు.

తాజా వైఫల్యాల నేపథ్యంలో హార్దిక్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించాలని మేనేజ్‌మెంట్ భావిస్తుండగా, అంతకంటే ముందే హార్దిక్ స్వయంగా జట్టు నుండి ఎగ్జిట్ అవ్వాలని డిసైడ్ అయ్యారు. హార్దిక్ పాండ్యా గనుక జట్టును వీడితే.. ముంబై ఇండియన్స్ తదుపరి కెప్టెన్ ఎవరనే దానిపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. అయితే, ఈసారి ముంబై యాజమాన్యం గతంలో చేసిన తప్పును పునరావృతం చేయకూడదని గట్టిగా నిర్ణయించుకుంది. గతంలో రోహిత్‌ను అడగకుండా హార్దిక్‌కు కెప్టెన్సీ ఇవ్వడం వల్లే టీమ్ రెండు ముక్కలైంది.

అందుకే ఈసారి ముంబై ఇండియన్స్‌కు తదుపరి కెప్టెన్ అయ్యే ఆటగాడికి ‘హిట్ మాన్’ రోహిత్ శర్మ ఆశీస్సులు తప్పనిసరిగా ఉండాలని మేనేజ్‌మెంట్ భావిస్తోంది. అంటే, జట్టు కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేయడంలో, ప్లేయర్స్ అందరినీ ఏకం చేయడంలో రోహిత్ శర్మదే తుది నిర్ణయం కానుంది. రోహిత్ ఎవరిని చూపిస్తే వారికే కెప్టెన్సీ పగ్గాలు దక్కడం ఖాయం. మరి హార్దిక్ వెళ్ళిపోతే రోహిత్ శర్మ మళ్లీ ముంబై ఇండియన్స్ బాధ్యతలు చేపడతాడా? అంటే ‘లేదు’ అనే సమాధానమే వినిపిస్తోంది.

రోహిత్ శర్మ మళ్లీ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే అవకాశం లేదని, కానీ భవిష్యత్తు కెప్టెన్‌కు ఒక మెంటార్‌లా, ఒక మార్గదర్శకుడిగా ఉండి జట్టును వెనుక నుండి నడిపిస్తారని స్పష్టమైంది. ప్రస్తుతం రోహిత్ శర్మ ఆశీస్సులతో కెప్టెన్ రేసులో సూర్యకుమార్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా బుమ్రాకు కెప్టెన్సీ ఇచ్చేలా రోహిత్ మొగ్గు చూపే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదేమైనా, రాబోయే రెండు వారాల్లో హార్దిక్ పాండ్యా భవిష్యత్తు మరియు ముంబై ఇండియన్స్ కొత్త కెప్టెన్సీ పగ్గాలపై ఒక అధికారిక ప్రకటన లేదా పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రోహిత్ శర్మ తీసుకునే నిర్ణయంపైనే ముంబై ఇండియన్స్ భవిష్యత్తు ఆధారపడి ఉంది.

 

Published : 
  • 29 May 2026, 9:15 PM IST