ఈ ఏడాది జూన్‌లో శ్రీలంకలో జరగనున్న వన్డే ట్రై-సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత ఏ జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్‌గా హైదరాబాదీ తిలక్ వర్మ ఎంపికయ్యాడు. అతడి డిప్యూటీగా అస్సాం ఆటగాడు రియాన్ పరాగ్ వ్యవహరించనున్నాడు. ఇక ఈ జట్టులో రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కింది. వైభవ్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్-2026లో ఈ చిచ్చర పిడుగు దుమ్ములేపుతున్నాడు. ఇప్పటివరకు 11 ఇన్నింగ్స్‌లలో 236.56 స్ట్రైక్-రేట్‌తో 440 పరుగులు సాధించాడు. ఇందులో ఏకంగా 40 సిక్సర్లే ఉన్నాయి.
ఈ ఏడాది ఆరంభంలో జరిగిన అండర్-19 ప్రపంచకప్‌లో కూడా వైభవ్ అదరగొట్టాడు. ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్లో 175 పరుగులు సాధించి భారత్‌ను ఛాంపియన్‌గా నిలిపాడు. ఈ క్రమంలోనే అతడికి ఇండియా-ఎ జట్టులో చోటు లభించింది.అదేవిధంగా ఐపీఎల్లో రాణిస్తున్న ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్‌సిమ్రన్ సింగ్, అన్షుల్ కంబోజ్, సూర్యాంశ్ షెడ్గే వంటి ఆటగాళ్లు కూడా ఈ జట్టులో ఉన్నారు. ఈ టోర్నమెంట్లో శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ 'ఎ' జట్లతో ఇండియా-ఎ జట్టు తలపడనుంది. ఈ ట్రై-సిరీస్ జూన్ 9 నుంచి ప్రారంభం కానుంది.
ఈ టోర్నీ డబుల్ రౌండ్-రాబిన్ ఫార్మాట్లో జరగనుంది. , జూన్ 21న జరిగే ఫైనల్లో అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు తలపడనున్నాయి. ఆ తర్వాత భారత ఏ జట్టు శ్రీలంక 'ఎ'తో రెండు మల్టీ-డే మ్యాచ్‌లు కూడా ఆడనుంది. ముక్కోణపు పోరు ముగిసిన తర్వాత భారత్-ఎ, శ్రీలంక-ఎ రెండు మల్టీ డే మ్యాచ్‌లు కూడా ఆడతాయి. ఈ మ్యాచ్‌ల కోసం త్వరలో భారత జట్టును ప్రకటిస్తామని బీసీసీఐ వెల్లడించింది.