14 బంతుల్లోనే 50 మళ్లీ బుడ్డోడి విధ్వంసం…!

భారత యువ క్రికెట్‌ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ మరోసారి విధ్వంసకర ఇన్నింగ్స్‌తో మెరిశాడు. ఐపీఎల్‌-2026 టోర్నమెంట్ ఆరంభానికి ముందే తన బ్యాట్‌ పవర్‌ ఏమిటో ఇంకోసారి చాటిచెప్పాడు.

Post Published By: dialnews
Updated : 27 February 2026, 12:50 PM IST

భారత యువ క్రికెట్‌ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ మరోసారి విధ్వంసకర ఇన్నింగ్స్‌తో మెరిశాడు. ఐపీఎల్‌-2026 టోర్నమెంట్ ఆరంభానికి ముందే తన బ్యాట్‌ పవర్‌ ఏమిటో ఇంకోసారి చాటిచెప్పాడు. డీవై పాటిల్‌ టీ20 కప్‌ 2026 టోర్నీలో భాగంగా ఈ బిహారీ బుడ్డోడు ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ టీ20 లీగ్‌లో డీవై పాటిల్‌ బ్లూ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న వైభవ్‌ సూర్యవంశీ. గురువారం నాటి మ్యాచ్‌లో ఇండియన్‌ నావీ జట్టుపై చితక్కొట్టాడు. కేవలం 14 బంతుల్లోనే అర్ద శతకం పూర్తి చేసుకున్న ఈ లెఫ్టాండ్‌ బ్యాటర్‌.. మొత్తంగా 19 బంతుల్లో 63 పరుగులు సాధించాడు. వైభవ్‌ సూర్యవంశీ విధ్వంసంవైభవ్‌ సూర్యవంశీ ఇన్నింగ్స్‌లో ఏడు ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి.

వరుణ్‌ చౌదరి బౌలింగ్‌లో ఒకే ఓవర్లో వైభవ్‌ 20 పరుగులు పిండుకోవడం మరో హైలైట్‌.కాగా వైభవ్‌ సూర్యవంశీ ఫార్మాట్లకు అతీతంగా విధ్వంసకర బ్యాటింగ్‌తో అలరిస్తున్నాడు. భారత్‌ అండర్‌-19 జట్టు తరఫున చివరగా వరల్డ్‌కప్‌ బరిలో దిగిన ఈ వైభవ్.. ఇంగ్లండ్‌తో ఫైనల్లో భారీ శతకం బాది భారత్‌కు టైటిల్‌ అందించాడు. ప్రస్తుతం డీవై పాటిల్‌ టీ20 కప్‌ టోర్నీతో బిజీగా ఉన్న వైభవ్‌.. తదుపరి ఐపీఎల్‌-2026లో రాజస్తాన్‌ రాయల్స్‌ తరఫున బరిలో దిగుతాడు. వైభవ్‌తో పాటు అర్జున్‌ టెండుల్కర్‌ సైతం అద్భుత అజేయ అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు.

కేవలం 29 బంతుల్లోనే 55 పరుగులు సాధించాడు. వైభవ్‌, అర్జున్‌ ధనాధన్‌ దంచికొట్టడంతో డీవై పాటిల్‌ బ్లూ జట్టు ఇండియన్‌ నేవీ జట్టును ఐదు వికెట్ల తేడాతో ఓడించింది. కాగా డీవై పాటిల్‌ బ్లూ జట్టుకు శశాంక్‌ సింగ్‌ కెప్టెన్‌గా ఉండగా.. ఐపీఎల్‌ స్టార్లు యశ్‌ ధుల్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌, జితేశ్‌ శర్మ, మయాంక్‌ యాదవ్‌ కూడా జట్టులో ఉన్నారు.ఇదిలా ఉంటే.. ఫిబ్రవరి 22న నవీ ముంబైలో మొదలైన డీవై పాటిల్‌ టీ20 కప్‌ 2026.. మార్చి 6న ఫైనల్‌తో ముగియనుంది.

Published : 
  • 27 February 2026, 12:50 PM IST