ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2027 సీజన్ కు సంబంధించి బీసీసీఐ కీలక మార్పు చేయాలని భావిస్తోంది.వచ్చే సీజన్ నుంచి టోర్నమెంట్‌ను కాస్త ముందుగానే ప్రారంభించాలని యోచిస్తోంది. ఎండలు, తీవ్రమైన వాతావరణ పరిస్థితుల వల్ల ఆటగాళ్లు, అభిమానులు ఇబ్బంది పడటంతో పాటు.. మ్యాచ్ నిర్వహణ కూడా కష్టంగా మారుతోందని బీసీసీఐ భావిస్తోంది. అందుకే కాస్త ముందుగానే సీజన్ ప్రారంభించాలని యోచిస్తున్నట్లు సమాచారం.సాధారణంగా అయితే మార్చి చివరి నుంచి మే చివరి వరకు ఉండే ఐపీఎల్ షెడ్యూల్ ఉంటుంది. ఐపీఎల్ 2026 షెడ్యూల్ సైతం.. మార్చి 28న మొదలై, మే 31 వరకు కొనసాగింది. దానిని ఇకపై మార్చి 10 నుంచి మే 15 మధ్యకు మార్చేందుకు చర్చలు జరుగుతున్నాయని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించారు.
అన్నీ అనుకున్నట్లు సాగితే 2027 ఐపీఎల్ సీజన్.. మార్చి రెండో వారంలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది.దేశంలోని అనేక ప్రాంతాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, రుతుపవనాల రాకకు ముందు కురిసే వర్షాల కారణంగా ఐపీఎల్లో చివరి మ్యాచ్‌లు ప్రభావితం అవుతున్నాయని దేవజిత్ సైకియా పేర్కొన్నారు. మే 15 తర్వాత టోర్నమెంట్ చివరి దశలో వర్షాలు పడే లేదా రుతుపవనాల సీజన్ మొదలయ్యే అవకాశం ఉందనే ఆందోళన ఉందన్నారు. మరోవైపు, తీవ్రమైన వేడి వాతావరణం ఆటగాళ్లకు గానీ, ప్రేక్షకులకు గానీ అనుకూలంగా ఉండదనీ, అందుకే టోర్నీని 2 వారాలు ముందే ప్రారంభించాలని బోర్డు భావిస్తోందని చెప్పారు. దీనిపై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్లో చర్చ జరుగుతోందని వెల్లడించారు. ఇదిలా ఉంటే మ్యాచ్ ల సంఖ్య పెంచుతారన్నా వార్తలపైనా క్లారిటీ ఇచ్చారు.
ప్రస్తుతానికైతే ఐపీఎల్లో మ్యాచ్‌ల సంఖ్య పెంచడం అనేది సాధ్యం కాదన్నారు. 74 మ్యాచ్‌ల ఫార్మాట్‌ను విస్తరించే ప్రణాళికలు ఇప్పుడు లేవనీ, వివిధ దేశాల నుంచి వచ్చే ఆటగాళ్లకు సంబంధించిన అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఎంతో కష్టపడితేనే ఐపీఎల్ కోసం రెండు నెలల విండో దొరుకుతోందనీ గుర్తు చేశారు. అంతకుమించి ఎక్కువ సమయం కేటాయించడం అనేది చాలా కష్టమన్నారు. ఇతర దేశాలు కూడా ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడాల్సి ఉంటుందనీ, ఆటగాళ్లు అందుబాటులో లేకుంటే లీగ్ క్వాలిటీ తగ్గిపోతుందని చెప్పుకొచ్చారు.