ఐసీసీ టోర్నీల్లో భారత్ దూకుడు… పాక్ పై తిరుగులేని రికార్డు…!

పాకిస్థాన్ తో మ్యాచ్ అంటే టీమిండియానే ఫేవరెట్.. ముఖ్యంగా ఐసీసీ టోర్నీల్లో ఆ జట్టుపై భారత్ ది తిరుగులేని ఆధిపత్యం.. గత రికార్డులే దీనికి ఉదాహరణ.

Post Published By: dialnews
Updated : 15 February 2026, 7:00 PM IST

పాకిస్థాన్ తో మ్యాచ్ అంటే టీమిండియానే ఫేవరెట్.. ముఖ్యంగా ఐసీసీ టోర్నీల్లో ఆ జట్టుపై భారత్ ది తిరుగులేని ఆధిపత్యం.. గత రికార్డులే దీనికి ఉదాహరణ. ఇప్పటి వరకూ ఐసీసీ టోర్నీల్లో 8 సార్లు తలపడితే భారత్ ఏడు మ్యాచ్ లలో గెలిచింది. ఇప్పుడు కొలంబో వేదికగా జరిగే మ్యాచ్ కు ముందు అభిమానులు గత రికార్డులు గుర్తు చేసుకుంటున్నారు. 2007 టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో గ్రూప్ ద‌శ‌లో భార‌త్, పాక్‌లు త‌ల‌ప‌డ్డాయి. ఈ మ్యాచ్‌లో ఇరు జ‌ట్లు స్కోర్లు స‌మం కావ‌డంతో బౌల్ అవుట్‌ను నిర్వ‌హించారు. ఇందులో భార‌త్ 3-0 తేడాతో విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భార‌త్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల నష్టానికి 141 ప‌రుగులు చేసింది. ల‌క్ష్య ఛేద‌న‌లో పాక్ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు కోల్పోయి స‌రిగ్గా 141 ప‌రుగులే చేసింది. స్కోర్లు స‌మం కావ‌డంతో బౌల్ అవుట్ నిర్వ‌హించారు. వీరేంద్ర సెహ్వాగ్‌, హ‌ర్భ‌జ‌న్ సింగ్‌, రాబిన్ ఉత‌ప్ప‌లు స్టంప్‌ల‌ను ప‌డ‌గొట్ట‌గా, పాక్ త్ర‌యం యాసిర్ అరాఫ‌త్, ఉమ‌ల్ గుల్‌, షాహిద్ అఫ్రిదిలు స్టంప్‌ల‌ను మిస్ చేశారు.

2007లో జ‌రిగిన తొలి టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైన‌ల్ మ్యాచ్‌లో పాక్ పై భార‌త్ 5 ప‌రుగుల తేడాతో గెలుపొంది తొలిసారి టీ20 ప్ర‌పంచ‌క‌ప్ విజేత‌గా నిలిచింది. ఈ మ్యాచ్‌లో భార‌త్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 157 ప‌రుగులు సాధించింది. అనంత‌రం పాక్ 19.3 ఓవ‌ర్ల‌లో 152 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. భార‌త్ త‌రుపున గౌత‌మ్ గంభీర్ 75 ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో చివ‌రి ఓవ‌ర్‌ను అత్యంత ఉత్కంఠ మ‌ధ్య జోగింద‌ర్ శ‌ర్మ వేసి మిస్బా ను ఔట్ చేసి భార‌త్ కు ప్ర‌పంచ‌క‌ప్‌ను అందించాడు. తర్వాత టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2012 సూప‌ర్ 8 రౌండ్‌లో భార‌త్‌, పాక్‌లు ఢీ కొన్నాయి. కొలంబోని ఆర్ ప్రేమ‌దాస స్టేడియంలో జ‌రిగిన ఈ మ్యాచ్‌లో భార‌త్ 8 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్‌లో పాక్ క‌నీసం పోటీ కూడా ఇవ్వ‌లేక‌పోయింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 19.4 ఓవ‌ర్ల‌లో 128 ప‌రుగుల‌కు ఆలౌటైంది.అనంత‌రం విరాట్ కోహ్లీ రాణించ‌డంతో 129 ప‌రుగుల ల‌క్ష్యాన్ని భార‌త్ 17 ఓవ‌ర్ల‌లోనే ఛేదించింది.

అలాగే 2022 టీ20 ప్ర‌పంచ‌క‌ప్ సూప‌ర్ 12 రౌండ్‌లో భార‌త్, పాక్‌లు త‌ల‌ప‌డ్డాయి. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ ఆతిథ్యం ఇచ్చిన ఈ మ్యాచ్‌లో భార‌త్ 4 వికెట్ల తేడాతో చిర‌స్మ‌ర‌ణీయ విజయాన్ని సొంతం చేసుకుంది. పాక్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 159 ప‌రుగులు చేసింది.. అనంత‌రం 1భార‌త్ 31 ప‌రుగుల‌కే నాలుగు వికెట్లు కోల్పోయిన‌ప్ప‌టికి ఆ త‌రువాత అద్భుతంగా పుంజుకుని గెలిచింది. విరాట్ కోహ్లీ 53 బంతుల్లో 82 ప‌రుగుల అజేయ ఇన్నింగ్స్‌తో రాణించాడు. ఇక 2024 టీ20 ప్ర‌పంచ‌క‌ప్ గ్రూప్ స్టేజీలో భార‌త్ ఆరు పరుగుల తేడాతో పాక్‌ను ఓడించింది. భార‌త్ 119 ప‌రుగుల‌కే ఆలౌటవగా... రిష‌బ్ పంత్ 31 బంతుల్లో 42 ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. ఆ త‌రువాత జ‌స్‌ప్రీత్ బుమ్రా మూడు వికెట్ల‌తో చెల‌రేగ‌డంతో ల‌క్ష్య ఛేద‌న‌లో పాక్ ఏడు వికెట్లు కోల్పోయి 113 ప‌రుగులే పరిమిత‌మైంది. హార్దిక్ పాండ్యా రెండు వికెట్ల‌తో రాణించాడు.

Published : 
  • 15 February 2026, 7:00 PM IST