ఆసీస్ ను వీడని గాయాలు, మార్ష్ ఔట్.. స్మిత్ కు పిలుపు…!

టీ20 వరల్డ్‌కప్ కోసం జట్టును ప్రకటించినప్పటి నుంచీ ఆస్ట్రేలియాను గాయాలు వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా ఐర్లాండ్ తో మ్యాచ్ కు ముందు ఆస్ట్రేలియా జట్టుకు అనూహ్య ఎదురుదెబ్బ తగిలింది.

Post Published By: dialnews
Updated : 12 February 2026, 12:10 PM IST

టీ20 వరల్డ్‌కప్ కోసం జట్టును ప్రకటించినప్పటి నుంచీ ఆస్ట్రేలియాను గాయాలు వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా ఐర్లాండ్ తో మ్యాచ్ కు ముందు ఆస్ట్రేలియా జట్టుకు అనూహ్య ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ మిచెల్ మార్ష్ గాయపడటంతో, అతడి స్థానంలో సీనియర్ ప్లేయర్ అయిన స్టీవ్ స్మిత్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా జట్టులోకి చేర్చింది. ఫిబ్రవరి 11న ఐర్లాండ్‌తో జరిగే మ్యాచ్‌కు ముందు ఈ మార్పు చోటు చేసుకుంది. ఇటీవల జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో మార్ష్ గాయపడినట్లు సమాచారం. సైడార్మ్ త్రో డౌన్స్ సమయంలో గ్రోయిన్ ప్రాంతంలో తీవ్ర గాయమవడంతో వెంటనే నెట్స్ నుంచి బయటకు వెళ్లి చికిత్స పొందాడు.

క్రికెట్ ఆస్ట్రేలియా విడుదల చేసిన ప్రకటన ప్రకారం, మార్ష్‌కు అంతర్గత రక్తస్రావం జరిగినట్లు స్కాన్లలో తేలింది. ఈ గాయం కారణంగా అతడికి కొంతకాలం విశ్రాంతి, రిహ్యాబిలిటేషన్ అవసరమని వైద్యులు సూచించారు. దాంతో ఐర్లాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌కు మిచెల్ మార్ష్ దూరమయ్యాడు. స్టీవ్ స్మిత్ ప్లేయింగ్ 11లో లేకపోయినా అతని పేరు మాత్రం స్క్వాడ్ లిస్ట్‌లో చేర్చారు.ఇటీవల బిగ్ బాష్ లీగ్ లో స్మిత్ అదరగొట్టాడు. అందుకే జట్టుకు బ్యాకప్‌గా స్టీవ్ స్మిత్‌ను ఎంపిక చేసింది. త్వరలోనే అతడు శ్రీలంకలో జట్టుతో చేరనున్నాడు.

కీలక సమయాల్లో అనుభవం ఉన్న ఆటగాడిగా స్మిత్ ఎంపిక ఆస్ట్రేలియాకు ఊరటనిస్తోంది. ఇప్పటికే పాట్ కమిన్స్, జోష్ హాజిల్‌వుడ్ వంటి ప్రధాన బౌలర్లు టోర్నీకి దూరమైన నేపథ్యంలో, మార్ష్ గాయం మరింత ఆందోళన కలిగిస్తోంది. దీంతో జట్టు నాయకత్వ బాధ్యతలు తాత్కాలికంగా ట్రావిస్ హెడ్‌కు అప్పగించింది. ఇదిలా ఉంటే 2011 మార్చి తర్వాత ఆస్ట్రేలియా తమ బిగ్ 3 ఫాస్ట్ బౌలర్లు లేకుండా ప్రపంచ కప్ ఆడుతుండటం ఇదే మొదటిసారి.దీంతో మిచెల్ మార్ష్ సారథ్యంలోని ఆస్ట్రేలియా జట్టు పేస్ బౌలింగ్ విభాగంలో బలహీనపడింది. ప్రస్తుతం రైట్‌ ఆర్మ్ స్వింగ్ బౌలర్ జేవియర్ బార్ట్‌లెట్, సిడ్నీ సిక్సర్స్ లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ బెన్ డ్వార్షుష్ మాత్రమే పూర్తిగా ఫిట్‌గా ఉన్న ప్రధాన పేసర్లు.

Published : 
  • 12 February 2026, 12:10 PM IST