హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ వేదికగా ఇటీవల జరిగిన 'అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్' ఆత్మీయ సమావేశం ఎంతో కోలాహలంగా సాగింది. ఈ ప్రత్యేక కార్యక్రమానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్వయంగా హాజరై, రెండు తెలుగు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన వందలాది మంది అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాలు, అనవసర వివాదాలు, ట్రోలింగ్‌పై స్పందిస్తూ తన అభిమానులకు పలు కీలక సూచనలు ఇచ్చారు.సోషల్ మీడియా వేదికగా సాగే నెగెటివ్ కామెంట్లు, దుష్ప్రచారాలను ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టించుకోవద్దని అల్లు అర్జున్ తన అభిమానులను కోరారు.
సమాజంలో లేదా సోషల్ మీడియాలో మీకు ఎవరైనా నచ్చకపోతే, సింపుల్‌గా వాళ్లను వదిలేయాలని, అంతేకానీ పదే పదే వాళ్లను ట్రోల్ చేయడం, వాళ్లపై ద్వేషాన్ని పెంచుకోవడం వంటివి ఏమాత్రం మంచిది కాదని ఆయన స్పష్టం చేశారు. ఒకరిపై నెగెటివిటీ చూపించడం వల్ల మనకే నష్టం తప్ప ఎలాంటి ఉపయోగం ఉండదని ఆయన చెప్పారు. అభిమానులు తమ విలువైన సమయాన్ని, కష్టపడి సంపాదించిన డబ్బును నెగెటివిటీ కోసం వృథా చేసుకోవద్దని అల్లు అర్జున్ హితవు పలికారు.
"మీ శ్రమ, మీ సమయం చాలా విలువైనవి. మీ ప్రతి రోజు ఎనర్జీని మీ వ్యక్తిగత ఎదుగుదల కోసం, మీ కుటుంబ శ్రేయస్సు కోసం మాత్రమే ఉపయోగించండి. సోషల్ మీడియాలో అనవసరమైన గొడవలకు సమయాన్ని కేటాయించకండి" అని పిలుపునిచ్చారు.పాజిటివ్ ఆలోచనలతో ముందుకెళ్లడమే అసలైన విజమని, అభిమానులు సమాజంలో తమకంటూ ఒక మంచి స్థానాన్ని సంపాదించుకోవడమే తనకు నిజమైన సంతోషాన్నిస్తుందని ఆయన పేర్కొన్నారు.