తప్పంతా ప్లేయర్స్‌దే అంట… వరల్డ్‌కప్ బాయ్‌కాట్‌పై బంగ్లాదేశ్ యూటర్న్…!

ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ 2026 విషయంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం మరోసారి యూటర్న్ తీసుకోవడం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Post Published By: dialnews
Updated : 12 February 2026, 8:55 PM IST

ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ 2026 విషయంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం మరోసారి యూటర్న్ తీసుకోవడం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ముందుగా ఈ బాయ్‌కాట్ నిర్ణయం క్రికెట్ బోర్డు, ప్లేయర్లదే అని చెప్పిన క్రీడల సలహాదారు ఆసిఫ్ నజ్రుల్, ఇప్పుడు మాట మార్చారు. ఇటీవల మీడియాతో మాట్లాడిన నజ్రుల్, టీ20 వరల్డ్‌కప్‌లో భారత్‌లో ఆడకూడదనే నిర్ణయం బీసీబీ, ప్లేయర్లు తీసుకున్నారని తెలిపారు. అయితే ఈ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు రావడంతో మళ్లీ స్పష్టత ఇచ్చారు.జనవరి ప్రారంభంలోనే భద్రతా కారణాల దృష్ట్యా టీమ్‌ను భారత్‌కు పంపకూడదని ప్రభుత్వం నిర్ణయించిందని నజ్రుల్ తెలిపారు. ఈ విషయాన్ని గతంలో కూడా పలుమార్లు చెప్పానని అన్నారు. ముందుగా చేసిన వ్యాఖ్యల వల్ల ప్రభుత్వం బాధ్యతను క్రికెట్ బోర్డుపైకి నెట్టేస్తుందా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

తాజా వివరణలో నజ్రుల్ మాట్లాడుతూ ప్రభుత్వ నిర్ణయాన్ని బీసీబీ, ప్లేయర్లు ఎలాంటి వ్యతిరేకత లేకుండా అంగీకరించారు. ఆర్థిక నష్టాలు, మ్యాచ్‌ల మిస్సింగ్, శిక్షల ప్రమాదం ఉన్నా వారు దేశ ప్రయోజనాల కోసం నిలబడ్డారని ప్రశంసించారు.బంగ్లాదేశ్‌తో మొదలైన టీ20 వరల్డ్‌కప్ వివాదం చాలా దూరమే వెళ్లింది. బంగ్లాదేశ్‌కు సపోర్ట్‌ను ఇస్తూ పాకిస్తాన్ భారత్‌తో జరిగే మ్యాచ్‌ని బాయ్‌కాట్ చేస్తామంటూ చెప్పుకొచ్చింది. తొలుత ఆ దేశ ప్రధాని కూడా దీనికి అంగీకరించాడు. అయితే ఆ తర్వాత ఐసీసీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పడం, శ్రీలంక క్రికెట్ బోర్డు కూడా పాక్‌కు లేఖలు రాయడంతో పరిస్థితి తారుమారయింది. చివరికి తలొగ్గిన పాక్ ఫిబ్రవరి 15న భారత్‌తో కీలక మ్యాచ్‌లో తలపడనుంది.

ఇదిలా ఉంటే ఐసీసీ - పాకిస్తాన్ క్రికెట్ బోర్డు - బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు మధ్య జరిగిన సమావేశంలో కొన్ని కీలక డిమాండ్లు తెరపైకి వచ్చాయి. ముఖ్యంగా భారత్ - పాక్ ద్వైపాక్షికి సిరీస్‌లు.. భారత్ - పాక్ - బంగ్లాదేశ్ మధ్య ట్రై సిరీస్‌లు నిర్వహించాలని డిమాండ్ చేశారు. అయితే ఈ నిర్ణయాలన్నీ బోర్డుల మీదే ఆధారపడి ఉంటుందని, బీసీసీఐ ఒప్పుకుంటేనే జరగుతాయని ఐసీసీ తేల్చి చెప్పింది.

Published : 
  • 12 February 2026, 8:55 PM IST