భారత క్రికెట్‌కు చేసిన అపార సేవలకుగాను మాజీ భారత క్రికెటర్ రాహుల్ ద్రావిడ్‌కు ప్రత్యేక గౌరవం లభించనుంది. బీసీసీఐ నిర్వహించే వార్షిక నామన్ అవార్డ్స్ కార్యక్రమంలో ఆయనకు కల్నల్ సీకే నాయుడు లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ అందించనున్నారు. నేషనల్ మీడియా కథనం ప్రకారం, ఈ అవార్డును మార్చి 15న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో ద్రావిడ్‌కు ప్రదానం చేయనున్నారు.రాహుల్ ద్రావిడ్ భారత క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ టెస్ట్ బ్యాటర్లలో ఒకరిగా గుర్తింపు పొందారు. ఆయన భారత క్రికెట్లో ప్రసిద్ధి చెందిన ‘బిగ్ ఫోర్’ బ్యాటింగ్ లైనప్‌లో ఒకరు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్ కూడా ఉన్నారు. ఇక ఈ నామన్ అవార్డ్స్ కార్యక్రమంలో భారత మహిళా క్రికెట్ దిగ్గజం మిథాలీ రాజ్‌కు కూడా లైఫ్‌టైమ్ గౌరవం ఇవ్వనున్నారు.
దాదాపు 16 సంవత్సరాల అంతర్జాతీయ కెరీర్లో ద్రావిడ్ భారత్ తరఫున మొత్తం 509 మ్యాచ్‌లు ఆడారు. టెస్ట్ క్రికెట్లో 164 మ్యాచ్‌లు ఆడి 13,288 పరుగులు చేశారు. ఆయన సగటు 52.31 కాగా, అందులో 36 శతకాలు ఉన్నాయి. వన్డే క్రికెట్లో కూడా ద్రావిడ్ అద్భుత ప్రదర్శన చేశారు. 344 వన్డే మ్యాచ్‌లలో 10,889 పరుగులు సాధించారు. ఇందులో 12 శతకాలు, 83 అర్ధశతకాలు ఉన్నాయి.టీ20 అంతర్జాతీయాల్లో మాత్రం ద్రావిడ్ ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడారు. 2011లో ఇంగ్లండ్‌పై మాంచెస్టర్‌లో జరిగిన మ్యాచ్‌లో ఆయన టీమిండియా తరఫున ఆడారు.
2012లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత ద్రావిడ్ కొంతకాలం కామెంటేటర్‌గా పనిచేశాడు. అనంతరం కోచింగ్ రంగంలోకి ప్రవేశించాడు. అండర్ - 19 కోచ్‌గా బాధ్యతలు చేపట్టి 2018లో జరిగిన ఐసీసీ అండర్ 19 వరల్డ్‌కప్‌లో భారత జట్టును విజేతగా నిలిపాడు. అదే సమయంలో ఇండియా ఏ జట్టుకు కూడా మార్గనిర్దేశనం చేశాడు.2021 చివర్లో ఆయన టీమిండియా సీనియర్ జట్టు హెడ్ కోచ్‌గా నియమితులయ్యాడు. ఆయన కోచింగ్ సమయంలో భారత్ 2023లో జరిగిన వన్డే వరల్డ్‌కప్ 2023 ఫైనల్‌కు చేరింది. అనంతరం 2024లో జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ విజేతగా నిలిచి ఐసీసీ ట్రోఫీని సొంతం చేసుకుంది.ఇటీవల టీమిండియా ప్రస్తుత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా భారత జట్టు సాధించిన మూడో టీ20 వరల్డ్ కప్ విజయాన్ని రాహుల్ ద్రావిడ్‌కు అంకితం చేశాడు.