ప్రతీకా రావల్, వైష్ణవి శర్మకు చోటు, ఆసీస్ తో టెస్టుకు భారత జట్టు ఇదే

మహిళా క్రికెట్‌కు సంబంధించి కీలకమైన రాబోయే టోర్నీలను దృష్టిలో ఉంచుకుని, బీసీసీఐ రెండు జట్లను ఒకేసారి ప్రకటించింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 25, 2026 | 02:02 PMLast Updated on: Jan 25, 2026 | 2:02 PM

Pratika Rawal And Vaishnavi Sharma Have Been Included This Is The Indian Team For The Test Against Australia

మహిళా క్రికెట్‌కు సంబంధించి కీలకమైన రాబోయే టోర్నీలను దృష్టిలో ఉంచుకుని, బీసీసీఐ రెండు జట్లను ఒకేసారి ప్రకటించింది. ఆస్ట్రేలియాతో జరిగే ఏకైక టెస్ట్ మ్యాచ్‌కు సీనియర్ భారత మహిళల జట్టును ఖరారు చేయగా, థాయ్‌లాండ్‌లో జరగనున్న ఏసీసీ రైజింగ్ స్టార్స్ మహిళల ఆసియా కప్‌కు భారత ‘ఏ’ జట్టును ఎంపిక చేసింది. మార్చి 6 నుంచి 9 వరకు పెర్త్ స్టేడియంలో జరగనున్న ఆస్ట్రేలియాతో టెస్ట్ మ్యాచ్‌కు హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్‌గా కొనసాగనుంది. వైస్ కెప్టెన్‌గా స్మృతి మందాన బాధ్యతలు నిర్వహించనుంది.

ఈ జట్టులో అనుభవంతో పాటు యువ ప్రతిభకు కూడా చోటు కల్పించారు. అమన్‌జోత్ కౌర్, ప్రతికా రావల్ తొలిసారి టెస్ట్ జట్టుకు ఎంపికయ్యారు. అలాగే యువ స్పిన్నర్ వైష్ణవి శర్మకు కూడా అరంగేట్ర అవకాశం దక్కింది. అయితే గాయంతో బాధపడుతున్న శ్రేయాంక పాటిల్ ఈ సిరీస్‌కు దూరమయ్యింది. షఫాలి వర్మ, జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్ లాంటి కీలక ఆటగాళ్లతో భారత్ ఆస్ట్రేలియా గడ్డపై గట్టి పోటీ ఇవ్వాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. రేణుకా సింగ్ ఠాకూర్, స్నేహా రాణా లాంటి బౌలర్లు జట్టుకు బలంగా నిలవనున్నారు.

మరోవైపు థాయ్‌లాండ్‌లో జరగనున్న ఏసీసీ రైజింగ్ స్టార్స్ మహిళల ఆసియా కప్‌కు భారత ‘ఏ’ జట్టుకు రాధా యాదవ్ నాయకత్వం వహించనుంది. యువ ఆటగాళ్లకు అంతర్జాతీయ అనుభవం కల్పించాలనే ఉద్దేశంతో ఈ జట్టును రూపొందించారు. వృందా దినేష్, అనుష్క శర్మ లాంటి యువ ప్రతిభావంతులు జట్టులో చోటు దక్కించుకున్నారు. మిన్ను మణి, ప్రేమా రావత్, హుమైరా కాజీ వంటి ఆటగాళ్లు కూడా ఈ టోర్నీలో తమ ప్రతిభను చూపించేందుకు సిద్ధమవుతున్నారు.దీయా యాదవ్, మమత ఎంపికలు మాత్రం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి ఫిట్‌నెస్ క్లియరెన్స్‌పై ఆధారపడి ఉంటాయని బీసీసీఐ స్పష్టం చేసింది. ఈ టోర్నీ ద్వారా భవిష్యత్ భారత జట్టుకు అవసరమైన ఆటగాళ్లను తయారు చేయడమే లక్ష్యంగా సెలెక్టర్లు అడుగులు వేస్తున్నారు. సీనియర్ జట్టు ఆస్ట్రేలియాలో సవాల్‌కు సిద్ధమవుతుండగా, భారత్ ఏ జట్టు ఆసియా కప్‌లో మెరుగైన ప్రదర్శనతో తమ సత్తా చాటాలని బీసీసీఐ ఆశిస్తోంది.