జెమీమాకు ప్రమోషన్, వరల్డ్ కప్ స్టార్లకు జాక్ పాట్…!

మహిళల క్రికెట్ కు ప్రాధాన్యత పెంచుతూ వెళుతున్న బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలోనూ టాలెంటెడ్ ప్లేయర్స్ కు పెద్దపీట వేసింది

Post Published By: dialnews
Updated : 11 February 2026, 2:55 PM IST

మహిళల క్రికెట్ కు ప్రాధాన్యత పెంచుతూ వెళుతున్న బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలోనూ టాలెంటెడ్ ప్లేయర్స్ కు పెద్దపీట వేసింది. గత ఏడాది వన్డే ప్రపంచకప్ విజయంలో కీలకపాత్ర పోషించిన పలువురు క్రికెటర్లు సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్ లో జాక్ పాట్ కొట్టారు. వరల్డ్ కప్ సెమీస్ లో ఆస్ట్రేలియాపై సెంచరీ బాదిన జెమీమా రోడ్రిగ్స్ కు ప్రమోషన్ లభించింది. తాజా జాబితాలో జెమీమా గ్రేడ్ ఏలో చోటు దక్కించుకుంది.

కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మంధాన , దీప్తి శర్మలతో పాటు ఇప్పుడు జెమీమా కూడా గ్రేడ్ ఏలోకి ఎంటరైంది. అటు వన్డే ప్రపంచకప్ లో సత్తా చాటిన రాధా యాదవ్, అమన్ జోత్ కౌర్ , అరుంధతి రెడ్డి, ప్రతీకా రావల్, క్రాంతి గౌడ్, ఉమా ఛెత్రీ గ్రేడ్ బిలోకి ప్రమోట్ అయ్యారు. అలాగే తెలుగుతేజం శ్రీచరణి, హార్లిన్ డియోల్ , ఇటీవలే అరంగేట్రం చేసిన వైష్ణవి శర్మ, జి కమిలిని కూడా సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో గ్రేడ్ సిలో చోటు దక్కించుకున్నారు.

శ్రేయాంకా పాటిల్ , పూజా వస్త్రాకర్ కు మాత్రం చోటు దక్కలేదు. కాగా మహిళల క్రికెట్ లో గ్రేడ్ ఏకు రూ.50 లక్షలు, గ్రేడ్ బికి రూ.30 లక్షలు, గ్రేడ్ సికి రూ.10 లక్షలు వార్షిక పారితోషకంగా చెల్లిస్తోంది. ఇదిలా ఉంటే మ్యాచ్ ఫీజు విషయంలో మహిళా క్రికెటర్లకు బీసీసీఐ పురుషుల జట్టుతో సమానంగా చెల్లిస్తోంది. వారికి ఐపీఎల్ తరహాలో డబ్ల్యూపీఎల్ కూడా తీసుకొచ్చింది.

Published : 
  • 11 February 2026, 2:55 PM IST