ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా లక్షలాది మంది ఫ్యాన్స్ కోలాహలానికి వేదికగా నిలిచే అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఇప్పుడు భారత జట్టుకు ఓ అంతుచిక్కని సవాలుగా మారింది. అత్యాధునిక సౌకర్యాలు, ప్రపంచస్థాయి ప్రమాణాలు ఉన్నప్పటికీ.. అత్యంత కీలకమైన ఐసీసీ టోర్నీలలో ఈ మైదానం భారత్ కు కలిసి రావడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. సొంతగడ్డపై, లక్ష మందికి పైగా అభిమానుల మద్ధతు మధ్య ఆడుతున్నా, నిర్ణయాత్మక పోరాటాల్లో టీమిండియా ఈ స్టేడియంలో తడబడుతుండటం గమనార్హం. కేవలం ఆటగాళ్ల వైఫల్యమే కాకుండా ఇక్కడి పిచ్ స్వభావం, వాతావరణం కూడా జట్టును ఇబ్బంది పెడుతున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
భారత క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ మరుపురాని విషాదంగా మిగిలిపోయిన 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఈ మైదానంలోనే జరిగింది. ఆ టోర్నీలో వరుసగా 10 మ్యాచ్‌లు గెలిచి అజేయంగా నిలిచిన రోహిత్ సేన.. ఫైనల్లో మాత్రం ఆస్ట్రేలియా చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసింది. సుమారు 1.30 లక్షల మంది నీలిరంగు జెర్సీలతో భారత్‌కు మద్దతు తెలుపుతున్నా, ఆస్ట్రేలియా విజయం సాధించినప్పుడు స్టేడియంలో నెలకొన్న నిశ్శబ్దం భారత ఆటగాళ్లను తీవ్రంగా కలచివేసింది. పిచ్ మందకొడిగా ఉండటం, బ్యాటర్లు పరుగుల కోసం ఇబ్బంది పడటం అప్పుడు ప్రపంచ కప్‌ను భారత్‌కు దూరం చేశాయి.నరేంద్ర మోదీ స్టేడియంలోని పిచ్ స్వభావం అంచనా వేయడం టీమిండియాకు కష్టతరంగా మారుతోంది. ఇక్కడ ఎరుపు, నలుపు మట్టితో కూడిన పిచ్‌లు ఉన్నాయి. బౌన్స్ నిలకడగా లేకపోవడం, బంతి మందకొడిగా బ్యాటు మీదకు రావడం వల్ల బ్యాటర్లు షాట్లు ఆడటంలో ఇబ్బంది పడుతున్నారు.
ముఖ్యంగా స్పిన్నర్లకు అనుకూలించే సమయంలో బ్యాటింగ్ చేయడం క్లిష్టంగా మారుతోంది. ఆస్ట్రేలియా వంటి జట్లు ఈ పిచ్ పరిస్థితులను ముందే అంచనా వేసి వ్యూహాత్మకంగా పైచేయి సాధించగలుగుతున్నాయి. కేవలం వన్డేలే కాకుండా, ఇక్కడ జరిగిన కీలక టీ20 సిరీస్‌లలో కూడా భారత్ పలుమార్లు పరాజయాలను మూటగట్టుకుంది.మరోవైపు టాస్ కూడా ఇక్కడ ఫలితాన్ని శాసిస్తోంది. ఐపీఎల్ వంటి భారీ టోర్నీల ఫైనల్స్ ఇక్కడ జరిగినప్పుడు కూడా టాస్ గెలిచిన జట్లకే విజయావకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. సాయంత్రం వేళల్లో కురిసే మంచు ప్రభావం ఆటను పూర్తిగా మార్చేస్తోంది. రెండోసారి బౌలింగ్ చేసే జట్టుకు బంతిపై పట్టు చిక్కకపోవడం ప్రత్యర్థి జట్లకు వరంగా మారుతోంది. 2026 టీ20 ప్రపంచకప్ సూపర్-8 దశలో దక్షిణాఫ్రికా చేతిలో ఎదురైన ఘోర పరాజయం కూడా ఇక్కడి పరిస్థితులను భారత్ సరిగ్గా అంచనా వేయలేకపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.