టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో భారత్ చారిత్రాత్మక విజయం సాధించింది. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం న్యూజిలాండ్‌ను 96 పరుగుల తేడాతో ఓడించి కప్పును ముద్దాడింది. ముచ్చటగా మూడోసారి టీ20 వరల్డ్ కప్‌ను కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత్ అయిదు వికెట్ల నష్టానికి 255 పరుగులు చేయగా, న్యూజిలాండ్ 19 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌట్ అయ్యింది. వరుస హాఫ్ సెంచరీలతో రాణించిన ఓపెనర్ సంజు శాంసన్ 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' అవార్డును గెలుచుకున్నాడు.
మ్యాచ్ ముగిసిన అనంతరం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ భావోద్వేగానికి లోనయ్యాడు. పిచ్ పై మట్టిన తీసి నుదుట అద్దుకున్నాడు. కప్ ను తీసుకుని కొద్దిసేపు పిచ్ పైనే మౌనంగా కూర్చుండిపోయాడు. పోస్ట్ మ్యాచ్ ప్రెజేంటేషన్ సందర్భంగా విలేకరులతో మాట్లాడాడు. తన తదుపరి లక్ష్యం ఏమిటో వెల్లడించాడు. 2028లో లాస్ ఏంజిల్స్ లో జరగనున్న ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌లో పసిడి పతకం సాధించడమే తన నెక్స్ట్ గోల్ గా తేల్చేశాడు. ఇది దేశానికి గర్వకారణమౌతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.
ఒలింపిక్స్ లో ఈ సారి క్రికెట్ కూడా చేర్చారు. క్రికెట్ తో పాటు స్క్వాష్, ఫ్లాగ్ ఫుట్‌బాల్, బేస్‌బాల్సా ,సాఫ్ట్‌బాల్, లాక్రోస్ ఉన్నాయి. లాస్ ఏంజిల్స్ లో జరిగే ఒలిపింక్స్ తో ఈ అయిదు గేమ్ లు కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. ఒలింపిక్స్‌లో క్రికెట్ కు సంబంధించిన అర్హత ప్రమాణాలు ఏమిటనేది ఇంకా ఫైనల్ కాలేదు. ఇంకా రెండు సంవత్సరాల సమయం ఉన్నందున ఈ లోపే అర్హత ప్రమాణాలు ఖరారవుతాయి. దాదాపు 100 దేశాలు టీ20 అంతర్జాతీయ క్రికెట్‌ను ఆడడం వలన, అర్హత ప్రక్రియ తీవ్ర పోటీతో కూడుకుని ఉండబోతోంది.
ఆతిథ్య దేశంగా అమెరికా ఈ టోర్నమెంట్‌లోకి ప్రత్యక్ష ప్రవేశం పొందే అవకాశం ఉంది. కాగా టీ20 ప్రపంచకప్ తర్వాత సూర్యకుమార్ రిటైర్మెంట్ ఇస్తాడని జోరుగా వార్తలు వచ్చాయి. అయితే మ్యాచ్ తర్వాత భారత కెప్టెన్ దీనిపై క్లారిటీ ఇచ్చేశాడు.
ప్రస్తుతం అంతా సవ్యంగా సాగుతున్నప్పుడు రిటైర్మెంట్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఏముంది అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చాడు.
దీని ద్వారా తాను ఇప్పుడప్పుడే క్రికెట్‌కు స్వస్తి పలికే ఉద్దేశం లేదని తేల్చేశాడు. ఇక ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వేదికగా జరిగే 2028 ప్రపంచకప్‌లో కూడా ఆడాలని సూర్య లక్ష్యంగా పెట్టుకున్నాడు. దీని ప్రకారం స్కై కనీసం మరో రెండేళ్లు అంతర్జాతీయ క్రికెట్ ఆడటం ఖాయంగా కనిపిస్తోంది.