సిరాజ్ ఇక జట్టులో ఎందుకు ? గిల్ కెప్టెన్సీపై భజ్జీ ఫైర్…!

ఐపీఎల్‌-2026 టోర్నీ తొలి మ్యాచ్‌లోనే గుజరాత్‌ టైటాన్స్‌కు చేదు అనుభవం ఎదురైంది. పంజాబ్‌ కింగ్స్‌తో మూడు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో గుజరాత్‌ టైటాన్స్‌ యాజమాన్యంపై టీమిండియా స్పిన్‌ దిగ్గజం హర్భజన్‌ సింగ్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

Post Published By: dialnews
Updated : 2 April 2026, 11:15 AM IST

ఐపీఎల్‌-2026 టోర్నీ తొలి మ్యాచ్‌లోనే గుజరాత్‌ టైటాన్స్‌కు చేదు అనుభవం ఎదురైంది. పంజాబ్‌ కింగ్స్‌తో మూడు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో గుజరాత్‌ టైటాన్స్‌ యాజమాన్యంపై టీమిండియా స్పిన్‌ దిగ్గజం హర్భజన్‌ సింగ్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ముఖ్యంగా పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ సేవలను సరిగ్గా ఉపయోగించుకోలేదంటూ భజ్జీ తప్పుబట్టాడు. పంజాబ్‌తో మ్యాచ్‌లో టాస్‌ ఓడిన గుజరాత్‌ తొలుత బ్యాటింగ్‌కు దిగి.. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్‌ 19.1 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసి గెలుపొందింది.

ఈ మ్యాచ్‌లో భారత కీలక పేసర్లలో ఒకడైన సిరాజ్‌ రెండు ఓవర్లు వేసి పదిహేను పరుగులు ఇచ్చి ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు. కొత్త బంతితో రంగంలోకి దిగిన అతడు.. ఆ తర్వాత మళ్లీ బౌలింగ్‌కు రాలేదు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ హర్భజన్‌ సింగ్‌ టైటాన్స్‌ యాజమాన్య వైఖరిని విమర్శించాడు.ఈ మ్యాచ్‌లో సిరాజ్‌ చేత పూర్తి కోటా ఎందుకు బౌలింగ్ చేయించలేదో తనకు అర్థం కాలేదన్నాడు. అతడితో కేవలం రెండు ఓవర్లే వేయించారనీ, నిజానికి నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేయించాల్సిందన్నాడు.

గాయం కారణంగానా..లేదంటే మరే ఇతర కారణాల వల్ల అతడిని పక్కనపెట్టారో తెలియదన్నాడు. ఏదేమైనా అతడు మరో రెండు ఓవర్లు బౌలింగ్‌ చేసి ఉంటే ఫలితం వేరుగా ఉండేదని భజ్జీ అభిప్రాయపడ్డాడు. కాగా పంజాబ్‌తో మ్యాచ్‌లో గుజరాత్‌ బౌలర్లలో ప్రసిద్‌ కృష్ణ మూడు వికెట్లు తీయగా.. కగిసో రబడ, అశోక్‌ శర్మ, రషీద్‌ ఖాన్‌, వాషింగ్టన్‌ సుందర్‌ తలా ఒక వికెట్‌ పడగొట్టారు. అయితే, పంజాబ్‌ బ్యాటర్‌ కూపర్‌ కన్నోలి మెరుపు ఇన్నింగ్స్‌ తో జట్టును విజయతీరాలకు చేర్చడంతో గుజరాత్‌కు పరాభవం తప్పలేదు.

Published : 
  • 2 April 2026, 11:15 AM IST