దేశ రాజకీయాల్లో ఎప్పుడు ఏ కొత్త సమీకరణం తెరపైకి వస్తుందో ఊహించడం చాలా కష్టం. ఒకప్పుడు కేవలం విద్యార్థి ఉద్యమంగా, నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా జంతర్ మంతర్ వద్ద ప్రారంభమైన ఒక పోరాటం.. ఇప్పుడు దేశంలోని ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీకి అతిపెద్ద తలనొప్పిగా మారబోతోందా? రాజకీయ విశ్లేషకులు అవుననే అంటున్నారు. అదే.. ‘కాక్రోచ్ జనతా పార్టీ’ లేదా CJP. ఈ పేరు వినడానికి కాస్త వింతగా ఉన్నప్పటికీ, దీని వెనుక ఉన్న పొలిటికల్ మైలేజ్ మాత్రం మామూలుగా లేదు. ఈ కొత్త ఫోర్స్ వల్ల అధికార బీజేపీ కంటే ప్రతిపక్ష కాంగ్రెస్‌కే ఎక్కువ నష్టం జరగనుందా? అసలు ఈ కాక్రోచ్ జనతా పార్టీ కథేంటి? దీని వెనుక ఉన్న వ్యూహాలు ఏంటి?
కథలోకి వెళ్తే.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో విద్యార్థుల పక్షాన నిలబడిన.. అబిజిత్ దిప్కే అనే యువకుడు ఈ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ని స్థాపించారు. జంతర్ మంతర్ వేదికగా దేశ రాజధానిని కుదిపేసిన విద్యార్థి ఆందోళనలతో ఈ సంస్థ ఒక్కసారిగా పాపులర్ అయిపొయింది. వీరి నిరసనల దెబ్బకు కేంద్ర ప్రభుత్వం సైతం దిగివచ్చి, నాటి హెచ్ఆర్డీ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే పరిస్థితి వచ్చింది. అయితే, ఈ అనూహ్య విజయంతో జోష్ మీదున్న CJP.. కేవలం ఒక ఉద్యమంతోనే ఆగిపోవాలని అనుకోవడం లేదు. దేశవ్యాప్తంగా యువతను ఆకర్షిస్తూ తమ నెట్‌వర్క్‌ను శరవేగంగా విస్తరిస్తోంది.
ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో CJP వ్యవస్థాపకుడు అబిజిత్ దిప్కే కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతానికి తాము ఒక రాజకీయ పార్టీగా మారే ఆలోచన లేదని, తాము ఎన్నికల్లో పోటీ చేయబోమని ఆయన స్పష్టం చేశారు. కానీ, విద్యార్థుల హక్కుల కోసం, పరీక్షల నిర్వహణలో పారదర్శకత కోసం దేశవ్యాప్తంగా తమ పోరాటాన్ని కొనసాగిస్తామని ప్రకటించారు. పూణే, లక్నో, బెంగళూరు, జైపూర్, హైదరాబాద్, అమృత్సర్ వంటి ప్రధాన నగరాలతో పాటు బిహార్‌లోని పాట్నా, దర్భంగా వంటి టైర్-2 నగరాల్లో కూడా భారీ ఎత్తున యువతను సమీకరించేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నారు. "దేశంలోని ప్రతి జిల్లాలోనూ ఒక జంతర్ మంతర్" లాంటి నిరసన వేదికను సృష్టించడమే తమ లక్ష్యమని పిలుపునిచ్చారు.
ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. CJP ఎన్నికల్లో పోటీ చేయకపోయినా.. రాబోయే రోజుల్లో ఇది పొలిటికల్ పార్టీగా మారడం ఖాయమని, 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి ఇది పూర్తిస్థాయి పార్టీ అవుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ CJP ఎన్నికల బరిలోకి దిగితే, దాని వల్ల అధికార బీజేపీ ఓటు బ్యాంకుకు పెద్దగా నష్టం జరగకపోవచ్చు. ఎందుకంటే బీజేపీకి ఒక స్థిరమైన క్యాడర్, సిద్ధాంతం ఉన్నాయి. కానీ, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను, ముఖ్యంగా నిరుద్యోగం, విద్యా వ్యవస్థలో అవినీతి వంటి అంశాలపై పోరాడే యువ ఓటర్లను నమ్ముకున్న కాంగ్రెస్ పార్టీకి ఇది పెద్ద దెబ్బ అవుతుంది. కాంగ్రెస్ ఏ ముద్దాలయితే లేవనెత్తుతుందో.. అదే ముద్దాలను CJP హైజాక్ చేస్తోంది. దీనివల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోయి, అంతిమంగా అధికార పార్టీకే లాభం చేకూరుతుందనేది విశ్లేషకుల అంచనా.
యువతను ఆకట్టుకోవడంలో రాహుల్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఈ మధ్యకాలంలో కొంత సక్సెస్ సాధించింది. కానీ, ఇప్పుడు CJP రూపంలో వచ్చిన ఈ సరికొత్త యూత్ ఫోర్స్.. కాంగ్రెస్‌కు వెళ్లాల్సిన యువ ఓటర్లను తనవైపు తిప్పుకునే ప్రమాదం ఉంది. నిరుద్యోగం, పేపర్ లీకేజీలపై కాంగ్రెస్ కంటే CJP చాలా అగ్రెసివ్‌గా, క్షేత్రస్థాయిలో పోరాడుతుండటంతో యూత్ మొత్తం అటు వైపు మొగ్గు చూపుతోంది. అందుకే కాంగ్రెస్ పార్టీ కూడా ఈ పరిణామాలను చాలా నిశితంగా గమనిస్తోంది. జంతర్ మంతర్ ఉద్యమం కాంగ్రెస్ చేతుల్లోకి వెళ్లకుండా, కేవలం విద్యార్థి సంస్థగానే ముగిసేలా కేంద్ర ప్రభుత్వం కూడా వ్యూహాత్మకంగా వ్యవహరించిందనే టాక్ నడుస్తోంది.
చివరగా చెప్పాలంటే.. కేవలం ఒక పరీక్ష పేపర్ లీకేజీ సమస్యపై మొదలైన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) ప్రస్థానం.. రాబోయే రోజుల్లో భారత రాజకీయ చిత్రపటాన్ని మార్చేసేలా కనిపిస్తోంది. యువత శక్తిని తక్కువగా అంచనా వేయలేమని మరోసారి రుజువైంది. మరి ఈ CJP రాబోయే రోజుల్లో కాంగ్రెస్ స్థానాన్ని భర్తీ చేస్తుందా? లేక కేవలం ఒక ప్రెజర్ గ్రూప్‌గానే మిగిలిపోతుందో చూడాలి.