గ్రూప్ 1 మామూలుగా లేదుగా… సెమీస్ ఛాన్స్ ఏ జట్లకు ఉందంటే ?

టీ20 వరల్డ్‌కప్‌ 2026లో మరికొన్ని మ్యాచ్‌లు మిగిలుండగానే సూపర్‌-8 బెర్త్‌లు ఖరారయ్యాయి. గ్రూప్‌-ఏ నుంచి భారత్‌, పాకిస్తాన్‌.. గ్రూప్‌-బి నుంచి శ్రీలంక, జింబాబ్వే.. గ్రూప్‌-సి నుంచి వెస్టిండీస్‌, ఇంగ్లండ్‌.. గ్రూప్‌-డి నుంచి సౌతాఫ్రికా,

Post Published By: dialnews
Updated : 20 February 2026, 11:56 AM IST

టీ20 వరల్డ్‌కప్‌ 2026లో మరికొన్ని మ్యాచ్‌లు మిగిలుండగానే సూపర్‌-8 బెర్త్‌లు ఖరారయ్యాయి. గ్రూప్‌-ఏ నుంచి భారత్‌, పాకిస్తాన్‌.. గ్రూప్‌-బి నుంచి శ్రీలంక, జింబాబ్వే.. గ్రూప్‌-సి నుంచి వెస్టిండీస్‌, ఇంగ్లండ్‌.. గ్రూప్‌-డి నుంచి సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌ ఫైనల్‌-8కి అర్హత సాధించాయి. సూపర్‌-8 దశలో సౌతాఫ్రికా, వెస్టిండీస్‌, భారత్‌, జింబాబ్వే గ్రూప్‌ 1లో ఉండగా.. ఇంగ్లండ్‌, శ్రీలంక, పాకిస్తాన్‌, న్యూజిలాండ్‌ గ్రూప్‌ 2లో ఉన్నాయి. సూపర్‌-8 మ్యాచ్‌లు ఫిబ్రవరి 22 నుంచి ప్రారంభమవుతాయి. గ్రూప్‌ 1 మ్యాచ్‌లన్నీ భారత్‌లో జరుగనుండగా.. గ్రూప్‌ 2 మ్యాచ్‌లన్నీ శ్రీలంకలో జరుగుతాయి. సెమీస్‌, ఫైనల్స్‌ వేదికలు ఇంకా ఖరారు కాలేదు. సూపర్‌-8 సమరాలకు సర్వం సిద్దమైన వేళ ఏయే జట్లు సెమీస్‌కు చేరతాయన్న చర్చ జోరందుకుంది. ఈ టాపిక్‌పై ఎవరి అంచనాలు వారికున్నా, ఒక్క విషయం మాత్రం స్పష్టమవుతుంది. ఫైనల్‌-4కు చేరడం ఏ జట్టుకూ అంత ఈజీగా అయితే కనిపించడం లేదు.

టగ్‌ ఆఫ్‌ వార్‌ ఫైట్లలో అన్నీ జట్లు శక్తివంచన లేకుండా పోరాడటం ఖాయంగా కనిపిస్తుంది. సూపర్‌ 8 దశలో రెండు గ్రూప్‌ల నుంచి మొదటి రెండు స్థానాల్లో నిలిచే జట్లు సెమీస్‌కు చేరతాయి. ఇరు గ్రూప్‌ల్లో ఆ రెండు బెర్త్‌ల కోసం అన్ని జట్ల మధ్య హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తుంది. గ్రూప్‌ 1 విషయానికొస్తే.. ఈ గ్రూప్‌ నుంచి భారత్‌, సౌతాఫ్రికా హాట్‌ ఫేవరెట్లుగా కనిపిస్తున్నప్పటికీ.. వెస్టిండీస్‌, జింబాబ్వేను కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ముఖ్యంగా విండీస్‌ విషయంలో ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా మిగతా జట్లు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. విండీస్‌ ఇటీవల కాలంలో అద్భుత ప్రదర్శనలు చేస్తూ, పూర్వవైభవం దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తుంది. పైగా గ్రూప్‌ దశలో ఈ జట్టు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో భారీ విజయాలు సాధించి జోష్‌లో ఉంది.

ఇలాంటి పరిస్థితుల్లో విండీస్‌తో ఏమరపాటుగా ఉంటే సౌతాఫ్రికా ప్రపంచకప్‌ కల ఈసారి కూడా కలగానే మిగిలిపోతుంది. ఎందుకంటే, ప్రస్తుతం భారత్‌ ఉన్న ఫామ్‌ను బట్టి చూస్తే జింబాబ్వే, వెస్టిండీస్‌, సౌతాఫ్రికా జట్లకు ఓడించడం అంత కష్టం కాకపోవచ్చు. పైగా టీమిండియాకు హోం అడ్వాంటేజ్‌ కూడా ఉంది. కాబట్టి భారత్‌ ఫైనల్‌-4కు చేరడం నల్లేరుపై నడకే అవుతుంది. ఇక మిగిలిన రెండో బెర్త్‌ కోసం ముక్కోణపు పోటీ ఉండే అవకాశం ఉంది. జింబాబ్వే సహా ఏ జట్టును తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. జింబాబ్వే గ్రూప్‌ దశలో మాజీ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాను మట్టికరిపించి, తామేంటో ఈసారి ప్రపంచానికి చూపిస్తామని ఛాలెంజ్‌ చేసింది. మరోపక్క సౌతాఫ్రికా సమతూకమైన, పటిష్టమైన జట్టుతో గత ఎడిషన్‌లో తృటిలో మిస్‌ అయిన టైటిల్‌ కోసం ఆకలితో ఎదురుచూస్తుంది.

Published : 
  • 20 February 2026, 11:56 AM IST