భారత్ స్పిన్నర్, తెలుగమ్మాయి శ్రీచరణి రికార్డు సృష్టించింది. మహిళల టీ20 ర్యాంకింగ్స్ లో ప్రపంచ నెంబర్ 1 బౌలర్‌గా నిలిచింది. తాజా అంతర్జాతీయ టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో ఇంగ్లాండ్ స్పిన్నర్ లిన్సే స్మిత్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి ఎగబాకింది. ప్రస్తుత టీ20 ప్రపంచకప్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన శ్రీచరణి 10 వికెట్లు పడగొట్టింది. గత ఏడాది జూన్ 28న ఇంగ్లండ్‌తో మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లోకి అడుగుపెట్టింది.కడప జిల్లాకు చెందిన నల్లపురెడ్డి శ్రీచరణి అంతర్జాతీయ మహిళా క్రికెట్లో అంచెలంచెలుగా ఎదిగి, అత్యుత్తమ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్‌గా నిలిచింది.
చిన్నతనంలో బ్యాడ్మింటన్, ఖోఖో ఆడిన శ్రీచరణి, తన మేనమామ ప్రోత్సాహంతో క్రికెట్ వైపు అడుగులు వేసింది. దేశవాళీ టోర్నీలలో ఆంధ్రప్రదేశ్ తరఫున సత్తా చాటి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించింది. శ్రీ చరణి కెరీర్ లో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఒక మైలురాయిగా నిలిచింది. డబ్ల్యూపీఎల్ లో ప్రపంచ స్థాయి అగ్రశ్రేణి మహిళా క్రికెటర్లతో కలిసి ఆడటం, అంతర్జాతీయ కోచ్‌ల పర్యవేక్షణలో శిక్షణ పొందడం వల్ల ఆమె తన ఆలోచనా విధానాన్ని, నైపుణ్యాలను మరింత పదును పెట్టుకుంది. ఒత్తిడి సమయాల్లో కూడా ప్రశాంతంగా ఉంటూ జట్టుకు బ్రేక్ త్రూలు ఎలా అందించాలో ఆమె అక్కడ నేర్చుకుంది. ఆ అనుభవమే ఇప్పుడు దేశం తరఫున ఆడేటప్పుడు ఎంతగానో ఉపయోగపడుతోంది. నవంబర్ 2025లో జరిగిన మహిళల వన్డే ప్రపంచ కప్‌లో భారత జట్టు విజయంలో ఆమె తన స్పిన్ మాయాజాలంతో కీలకపాత్ర పోషించింది.
దేశీయ క్రికెట్ లో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చిన శ్రీ చరణి.. బ్యాటర్లను ఒత్తిడిలోకి నెట్టడంలో ప్రత్యేక శైలిని అలవర్చుకుంది. లైన్ అండ్ లెంగ్త్ తప్పకుండా బౌలింగ్ చేయడం, పిచ్ నుంచి వచ్చే టర్న్‌ను సరిగ్గా ఉపయోగించుకోవడంలో ఆమె రాటుదేలింది. అంతర్జాతీయ వేదికపై అడుగుపెట్టిన మొదటి మ్యాచ్‌లోనే తన అద్భుతమైన స్పెల్‌తో తనేంటో నిరూపించుకుంది. కేవలం 21 సంవత్సరాల వయసులోనే శ్రీ చరణి ఒక సాధారణ ప్రామిసింగ్ ప్లేయర్ నుంచి భారత జట్టు నమ్మదగిన స్పిన్నర్ గా మారిపోయింది. జట్టు స్కోరును కాపాడుకోవాలన్నా లేదా భాగస్వామ్యాలను విడదీయాలన్నా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ శ్రీ చరణి వైపే చూస్తోంది. ఇప్పుడు తన ప్రదర్శనలతోనే నెంబర్ వన్ బౌలర్ గా ఎదగడంతో తెలుగు రాష్ట్రా ల అభిమానులు ఆమెకు విషెస్ చెబుతున్నారు.