ఇంగ్లాండ్ తో మూడో టీ ట్వంటీ… తుది జట్టులోకి యార్కర్ల స్పెషలిస్ట్..!

ఐర్లాండ్ సిరీస్ ఓటమి తర్వాత ఇంగ్లాండ్ పర్యటనలోనూ టీం ఇండియాకు గడ్డు కాలం నడుస్తోంది. మొదటి మ్యాచ్ వర్షం పాలవగా, రెండో టీ20లో ఘోర పరాజయం ఎదురైంది. ఈ నేపథ్యంలో సిరీస్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే నాటింగ్‌హామ్ వేదికగా జరగబోయే మూడో టీ20

Post Published By: dialnews
Updated : 7 July 2026, 7:20 PM IST

ఐర్లాండ్ సిరీస్ ఓటమి తర్వాత ఇంగ్లాండ్ పర్యటనలోనూ టీం ఇండియాకు గడ్డు కాలం నడుస్తోంది. మొదటి మ్యాచ్ వర్షం పాలవగా, రెండో టీ20లో ఘోర పరాజయం ఎదురైంది. ఈ నేపథ్యంలో సిరీస్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే నాటింగ్‌హామ్ వేదికగా జరగబోయే మూడో టీ20లో భారత్ కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో తుది జట్టులో మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండో మ్యాచ్‌లో టీం ఇండియా ఓటమికి ప్రధాన కారణం బౌలింగ్ వైఫల్యమనే చెప్పాలి. ముఖ్యంగా లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ తన 4 ఓవర్ల కోటాలో ఏకంగా 60 పరుగులు సమర్పించుకున్నాడు. మ్యాచ్ మలుపు తిప్పిన 17వ ఓవర్లో రవి బిష్ణోయ్ ఏకంగా 29 పరుగులు ఇచ్చుకోవడంతో, అప్పటివరకు భారత్ చేతిలో ఉన్న మ్యాచ్ ఒక్కసారిగా ఇంగ్లాండ్ వైపు చేజారింది.

ఈ ఘోర ప్రదర్శన నేపథ్యంలో మూడో టీ20లో అతనిపై వేటు పడటం ఖాయంగా కనిపిస్తోంది. రవి బిష్ణోయ్ స్థానంలో యార్కర్ల కింగ్‌గా పేరొందిన యువ బౌలర్ ప్రిన్స్ యాదవ్‌ను తుది జట్టులోకి తీసుకోవాలని మేనేజ్మెంట్ భావిస్తోంది.మిగిలిన జట్టులో మార్పులు చోటు చేసుకునే అవకాశాలు లేనట్టే. దీంతో సంజూ శాంసన్ మరోసారి బెంచ్ కే పరిమితం కానున్నాడు. గత మ్యాచ్ తో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన వైభవ్ సూర్యవంశీ 14 పరుగులే చేసినా మరో అవకాశం ఇవ్వనున్నారు. యువ క్రికెటర్ కావడంతో పాటు భారీ అంచనాలున్న నేపథ్యంలో వెంటనే తప్పిస్తే విమర్శలు ఎదుర్కొనే అవకాశముంది. దీంతో సంజూ శాంసన్ కు మళ్లీ నిరాశే మిగలనుంది. అటు బ్యాటింగ్ లో అభిషేక్ శర్మ , శ్రేయాస్ అయ్యర్ రాణిస్తుండగా.. తిలక్ వర్మ ఇంకా దూకుడుగా ఆడాల్సిన అవసరం కనిపిస్తోంది.

దూబే ఫినిషర్ రోల్ కు పూర్తిస్థాయిలో న్యాయం చేయలేకపోతుండడం కూడా కలవరపెడుతోంది. బౌలింగ్ లో అక్షర్ పటేల్ , వరుణ్ చక్రవర్తిలపైనే ఆశలున్నాయి. పేస్ విభాగంలో అర్షదీప్ , హర్షిత్ రాణాకు తోటు ప్రిన్స్ యాదవ్ కూడా చెలరేగి భారత్ బోణీ కొట్టే అవకాశముంది.ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ శ్రేయాస్ కెప్టెన్సీకి కూడా అగ్ని పరీక్ష కానుంది. ఇటీవల ఐర్లాండ్ పర్యటనలో వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిపోయి పూర్తిగా వైట్‌వాష్ అయిన భారత జట్టు, ఇప్పుడు బలమైన ఇంగ్లాండ్ పర్యటనలోనూ అదే తడబాటును కొనసాగిస్తోంది. అయ్యర్ నాయకత్వంలో ఆడిన నాలుగు మ్యాచ్‌లలో ఒకటి వర్షం వల్ల రద్దు కాగా, మిగిలిన మూడింటిలోనూ దారుణ పరాజయాలు ఎదురయ్యాయి. దీంతో సారథిగా తొలి విజయం కోసం ఎదురుచూస్తున్న శ్రేయాస్ ట్రెంట్ బ్రిడ్జిలో జట్టును ఎలా నడిపిస్తాడో చూడాలి.

Published : 
  • 7 July 2026, 7:20 PM IST