ఇంగ్లాండ్ తో తొలి వన్డే, భారత తుది జట్టు ఇదే..!

ఇంగ్లండ్‌ గడ్డపై ఐదు టీ20ల సిరీస్‌లో 0-4తో చిత్తుగా ఓడిన టీమిండియా.. వన్డే సిరీస్‌కు సిద్దమైంది. టీమిండియా సీనియర్ ప్లేయర్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్‌ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్ ఈ సిరీస్‌ ఆడుతుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Post Published By: dialnews
Updated : 14 July 2026, 11:30 AM IST

ఇంగ్లండ్‌ గడ్డపై ఐదు టీ20ల సిరీస్‌లో 0-4తో చిత్తుగా ఓడిన టీమిండియా.. వన్డే సిరీస్‌కు సిద్దమైంది. టీమిండియా సీనియర్ ప్లేయర్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్‌ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్ ఈ సిరీస్‌ ఆడుతుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని భారత జట్టుకు ఎదురైన ఘోర పరాజయానికి ప్రతీకారం తీర్చుకునేందుకు శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని టీమిండియా ఉవ్విళ్ళూరుతోంది.మంగళవారం బర్మింగ్‌హామ్ వేదికగా జరిగే తొలి మ్యాచ్‌తో ఈ మూడు వన్డేల సిరీస్‌కు తెరలేవనుంది. వన్డే ప్రపంచకప్ 2027 సన్నాహకాల్లో ఉన్న ఇరు జట్లు ఈ సిరీస్‌ను గెలవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్, శుభ్‌మన్ గిల్‌ జట్టులో ఉండటం భారత్‌కు కొండంత బలాన్ని ఇస్తుంది.

గాయాలతో చివరి నిమిషంలో హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తీలు దూరం కాగా.. వారి స్థానాల్లో ప్రిన్స్ యాదవ్, రవి బిష్ణోయ్‌లకు అవకాశం దక్కింది. సీనియర్ల రీఎంట్రీతో తుది జట్టు ఎంపికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ ఓపెనర్లుగా బరిలోకి దిగనుండగా.. విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ మిడిలార్డర్‌లో ఆడనున్నారు. అఫ్గానిస్థాన్‌తో వన్డే సిరీస్‌కు దూరంగా ఉన్న విరాట్ కోహ్లీ అందుబాటులోకి రావడంతో ఇషాన్ కిషన్‌ బెంచ్‌కే పరిమితం కానున్నాడు.అక్షర్ పటేల్, శివమ్ దూబే ఆల్‌రౌండర్లుగా బరిలోకి దిగనున్నారు. ఎక్స్‌ట్రా స్పిన్నర్ కావాలనుకుంటే శివమ్ దూబే స్థానంలో రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్‌లో ఒకరికి అవకాశం దక్కుతుంది.

టీ20 సిరీస్‌లో శివమ్ దూబే, సుందర్ తీవ్రంగా నిరాశపర్చారు.స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్ ఆడనుండగా.. జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. ప్రిన్స్ యాదవ్, ప్రసిధ్ కృష్ణలను ఆడించాలనుకుంటే గుర్నూర్ బ్రార్‌తో పాటు అర్ష్‌దీప్ సింగ్ బెంచ్‌కు పరిమితమవుతారు. తొలి వన్డేలోనే విజయం సాధించి సిరీస్‌లో ఆధిక్యంలో నిలవాలని టీమిండియా భావిస్తోంది. కాగా ఇంగ్లాండ్ గడ్డపై ఇప్పటి వరకూ 44 వన్డేలు ఆడిన భారత్ 18 మ్యాచ్ లలో గెలిచి, 23 మ్యాచ్ లలో పరాజయం పాలైంది. ఒక మ్యాచ్ టై కాగా మరో 2 ఫలితం తేలలేదు. చివరి సారిగా ఇక్కడ 2022లో ఆడినప్పుడు 2-1తో వన్డే సిరీస్ కైవసం చేసుకుంది.

Published : 
  • 14 July 2026, 11:30 AM IST