వైభవ్ సూర్య వంశీ మరో పృద్విషా కాకూడదు….!

ఈ ఐపీఎల్ సీజన్లో నీ గోల్ ఏంటి అని ఓ పెద్దాయన....15 ఏళ్ల కుర్రాన్ని అడిగాడు. వరల్డ్ నెంబర్ వన్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా వేసే మొదటి ఓవర్ మొదటి బంతిని... సిక్సర్ కొట్టాలి. ఆ సమాధానం విని అందరూ షాక్ అయిపోయారు

Post Published By: dialnews
Updated : 13 April 2026, 1:40 PM IST

ఈ ఐపీఎల్ సీజన్లో నీ గోల్ ఏంటి అని ఓ పెద్దాయన....15 ఏళ్ల కుర్రాన్ని అడిగాడు. వరల్డ్ నెంబర్ వన్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా వేసే మొదటి ఓవర్ మొదటి బంతిని... సిక్సర్ కొట్టాలి. ఆ సమాధానం విని అందరూ షాక్ అయిపోయారు. ఈ బుడ్డోడికి బాగా బలిసింది అనుకున్నారు. పది రోజులు తిరిగేసరికి ఐపీఎల్ సీజన్లో బూమ్రా వేసిన తొలి బంతిని పిక్స్ కొట్టాడు ఈ కుర్రాడు. అతనే వైభవ్ సూర్య వంశీ.ఇప్పుడు వైభవ్‌ సూర్యవంశీ పేరు మారుమోగిపోతోంది. IPL గత సీజన్‌లోనే దుమ్మురేపి భవిష్యత్‌ ఆశాకిరణం అనిపించుకున్నాడు వైభవ్‌. కాకపోతే కొన్ని విమర్శలు కూడా వినిపించాయి. సుడిగాడు. గాలివాటం తప్ప గొప్ప ఆటగాడు కాదన్నారు. గుడ్డిగా గాల్లో ఊపడం తప్ప.. టెక్నిక్‌ లేదని విమర్శించారు. ఈ సీజన్‌లో విమర్శకుల నోళ్లు మూయిస్తున్నాడు ఈ బుడ్డోడు. దిగ్గజాలు, స్టార్లు అనుకున్న బౌలర్లను కూడా ఉతికారేస్తున్నాడు. పదో తరగతి పరీక్షలు రాయాల్సిన వాడు.. ప్రత్యర్థులకు పరీక్ష పెడుతున్నాడు.

ఎవడైనా కోపంగా కొడతాడు... లేదా బలంగా కొడతాడు. ఈ బుడ్డోడు మాత్రం శ్రద్ధగా కొడతాడు. ఏదో గోడ కడుతున్నట్టు.. గులాబీ మొక్కకు అంటుకడుతున్నట్టు... చాలా జాగ్రత్తగా, పద్ధతిగా కొడుతున్నాడు. ఈడు మగాడ్రా బుజ్జీ అనుకోవాల్సిందే వైభవ్‌ సూర్యవంశీ బ్యాటింగ్‌ చూస్తుంటే. వైభవ్‌ పేరు వింటే క్రికెట్‌ ఫ్యాన్స్‌కి పూనకాలే. పదిహేనేళ్ల వయసులోనే ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. ఎదుట బౌలింగ్‌ చేస్తోంది ఎవడన్నది కాదు.. బాల్‌ను బౌండరీ దాటించామా లేదా అన్నదే ముఖ్యం. స్టేడియం ఎక్కడైనా సరే.. ప్రత్యర్థి టీమ్‌ ఏదైనా సరే.. బౌలర్‌ ఎవరైనా సరే... ఒకటే ఉతుకుడు. సిక్సర్ల వర్షం కురిపిస్తున్నాడు. టీమ్‌ ఇండియా పేస్ సంచలనం. వరల్డ్‌ నెంబర్‌ వన్‌ బౌలర్‌ అయిన జస్‌ప్రీత్‌ బుమ్రా బౌలింగ్‌ చేస్తుంటే.. బ్యాట్స్‌మెన్‌ ఎవరైనా సరే అలర్ట్‌ అవుతాడు. యార్కర్లను ఆచితూచి ఎదుర్కోవాలని ఫిక్స్‌ అవుతాడు. కానీ... వైభవ్‌ అలా కాదు. తాను ఎదుర్కున్న బుమ్రా తొలిబంతినే సిక్సర్‌గా మలిచాడు.

ఆస్ట్రేలియా టాప్ బౌలర్ హేజిల్‌వుడ్‌ బౌన్సర్ల ధాటికి బ్యాటర్లకు ధడ పుట్టాల్సిందే. కానీ.. చిన్నోడు వైభవ్ ముందు హేజిల్‌వుడ్‌ కూడా చినబోయాడు. వైభవ్‌ కొట్టిన బౌండరీల ధాటికి హేజిల్‌వుడ్‌ ఆలోచించి బౌలింగ్‌ చేయాల్సి వచ్చింది. ఐపీఎల్‌లో 200కి పైగా వికెట్లు తీసిన స్వింగ్‌ మాస్టర్‌ భువనేశ్వర్‌ కుమార్‌కు కూడా వైభవ్‌ స్ట్రోక్‌ తప్పలేదు. పవర్‌ ప్లేలో పక్కా వికెట్‌ అందించే భువీని కూడా ఉతికారేశాడు ఈ బుడ్డోడు.
దేశవాళీతోపాటు అండర్-19 ఎమర్జింగ్‌ ఆసియా కప్‌లో వైభవ్‌ ఆటతీరు అద్భుతం. చిన్నపిల్లాడే కదా.. అండర్‌ 19 కదా... అని తీసిపారేశారు. పెద్దగా లెక్కలోకి తీసుకోలేదు. ఎప్పుడైతే ఐపీఎల్ 2026 సీజన్‌లో అడుగుపెట్టాడో.. ఇక్కడ చూపించమనండి అతడి సత్తా ఏంటో అని సోషల్ మీడియాలో సవాళ్లు విసిరారు. సవాళ్లకు బ్యాట్‌తో సమాధానం చెప్పాడు. ఆడిన మొదటి మ్యాచ్‌లోనే ఆర్‌సీబీ లాంటి పెద్ద టీమ్‌పై.. కేవలం 26 బంతుల్లో 78 పరుగులు చేసి.. అందరి దృష్టి ఆకర్షించాడు. ఆరంగేట్రం చేసిన 2025 సీజన్‌లో కేవలం 38 బంతుల్లో సెంచరీ చేసి అధరహో అనిపించాడు. ఇందులో 11 సిక్స్‌లు, 7 ఫోర్లు ఉన్నాయంటేనే తెలుసుకోవచ్చు వైభవ్‌ బాదుడు ఎంత బలంగా ఉందో.

గత సీజన్‌లో ఆటతీరుతోనే క్రికెట్‌ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్న వైభవ్ సూర్యవంశీ... ఈ సీజన్‌లో మరింత రాటుదేలాడు. సిరాజ్, రబాడ, ప్రసిద్ధ్‌కృష్ణ, బుమ్రా, బౌల్ట్‌, హేజిల్‌వుడ్‌ లాంటి ప్రపంచ టాప్‌ బౌలర్లను కూడా చెడుగుడు ఆడుకుంటున్నాడు. హేజిల్‌వుడ్‌ బౌలింగ్‌ లో హ్యాట్రిక్‌ ఫోర్‌తోపాటు... ఓ సిక్సర్‌ బాదాడు. కేవలం 4 బంతుల్లో 18 రన్స్‌ రాబట్టాడు వైభవ్‌. ఈ సీజన్‌లో నాలుగు మ్యాచుల్లో 266 స్ట్రైక్‌రేట్‌తో 200 పరుగులు రాబట్టి టాప్‌ స్కోరర్‌గా ఆరెంజ్‌ క్యాప్‌ సొంతం చేసుకున్నాడు.గత సీజన్‌కి.. ఈ సీజన్‌కి వైభవ్‌ గేమ్‌లో చాలా పరిణతి కనిపించింది. గుడ్డిగా బ్యాట్‌ ఊపుతాడని కామెంట్‌ చేసిన వాళ్లతోనే.. వావ్‌ వాట్ ఏ షాట్‌... వాట్‌ ఏ ప్లే.. అనిపిస్తున్నాడు. బాల్ ను క్లియర్‌గా గమనిస్తున్నాడు. సింగిల్స్‌ తీస్తున్నాడు. కవర్‌డ్రైవ్స్‌ ఆడుతున్నాడు. పుల్‌ షాట్స్‌.. స్ట్రైట్‌ డ్రైవ్స్‌తో స్టేడియం చుట్టూ 360 డిగ్రీస్‌లో కొడుతున్నాడు.

అయితే వైభవ్ సూర్య వంశీ దూకుడు, బాదుడు తప్ప క్లాసికల్ క్రికెట్ ఆడలేకపోవడం.... దుడుకు మనస్తత్వం ఇవన్నీ చూస్తే... ఒక చిన్న భయం మొదలైంది. క్రికెటర్ పృద్విషా కూడా ఇలాగే వ్యవహరిస్తూ ఉండేవాడు. క్రమశిక్షణ లేకుండా చిన్న వయసులో వచ్చిన పేరు ప్రతిష్టలను దుర్వినియోగం చేసుకున్నాడు. వైభవ్ సూర్య వంశీ ఆ కాకూడదని.... ఈ దూకుడుని ప్రొఫెషనల్ క్రికెట్లో బ్యాలెన్స్ గా వాడుకోవాలని క్రికెట్ అభిమానులు కోరుతున్నారు. జూన్ ఎందుకు నీకువైభవ్‌ సూర్యవంశీ జాతీయ జట్టులోకి ఎప్పుడెప్పుడు వస్తాడా..? అని క్రికెట్ ప్రేమికులు ఎదురుచూస్తున్నారు. త్వరగా జాతీయ జట్టులోకి తీసుకోవాలని మాజీ క్రికెటర్లు కూడా డిమాండ్‌ చేస్తున్నారు. త్వరలోనే ఐర్లాండ్‌తో జరిగే సిరీస్‌కు తీసుకుంటారనే ప్రచారం కూడా మొదలైంది. మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్ కూడా కేవలం 16 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టి.. సంచలనాలు నమోదు చేశాడు. ఇప్పుడు వైభవ్‌ ఆటను చూస్తున్న అభిమానులు కూడా... వైభవ్‌కి త్వరగా జాతీయజట్టులో అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.

Published : 
  • 13 April 2026, 1:40 PM IST