మళ్లీ నిలబెట్టుకుంటుందా ? డిఫెండింగ్ ఛాంపియన్ గా ఆర్‌సీబీ…!

ఐపీఎల్ 2026 సీజన్‌కు కౌంట్ డౌన్ మొదలయింది. డిసెంబర్ లో వేలం తర్వాత పలు జట్ల కూర్పు మారిపోయాయి. పలువురు ఆటగాళ్లు పాత జట్లను వదిలి కొత్త టీమ్స్ లో చేరారు. ఈసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కేవలం ఒక జట్టుగా మాత్రమే

Post Published By: dialnews
Updated : 18 March 2026, 12:15 PM IST

ఐపీఎల్ 2026 సీజన్‌కు కౌంట్ డౌన్ మొదలయింది. డిసెంబర్ లో వేలం తర్వాత పలు జట్ల కూర్పు మారిపోయాయి. పలువురు ఆటగాళ్లు పాత జట్లను వదిలి కొత్త టీమ్స్ లో చేరారు. ఈసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కేవలం ఒక జట్టుగా మాత్రమే కాకుండా, డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగుతోంది. సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ గత ఏడాది తొలిసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడిన ఆర్సీబీ, ఇప్పుడు అదే జోష్‌తో రెండో టైటిల్ పై కన్నేసింది. గత ఏడాది చివర్లో జరిగిన వేలంలో కోర్ గ్రూప్‌ను అలాగే ఉంచుకుంటూనే, వేలంలో తెలివైన ఎంపికలతో జట్టును మరింత బలోపేతం చేసుకుంది. ఈసారి ఆర్సీబీ గనుక టైటిల్ గెలిస్తే, ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తర్వాత వరుసగా రెండుసార్లు ట్రోఫీ సొంతం చేసుకున్న మూడో జట్టుగా రికార్డు సృష్టిస్తుంది.

జట్టు కూర్పు విషయానికి వస్తే కెరీర్ ఆరంభం నుంచీ ఇదే జట్టుకు ఆడుతున్న కోహ్లీ ఇప్పుడు 19వ సీజన్‌ను అదే ఉత్సాహంతో ఆడేందుకు రెడీ అయిపోయాడు. కోహ్లీనే ఆ జట్టుకు అతిపెద్ద బలం.కాగా రజత్ పాటిదార్ సారథ్యంలో బెంగుళూరు ఎంతో పటిష్టంగా కనిపిస్తోంది. ఫిలిప్ సాల్ట్, ట్రిస్టన్ స్టబ్స్, దేవ్ దత్ పడిక్కల్ వంటి స్టార్ బ్యాటర్లతో పాటు ఆల్ రౌండర్ల విభాగంలో కృనాల్ పాండ్యా, వెంకటేష్ అయ్యర్ ఉండటం కలిసొచ్చే అంశం. ఫినిషర్‌గా టిమ్ డేవిడ్ ఉండటం జట్టుకు కొండంత అండ. వీరంతా గత సీజన్ లో అదరగొట్టారు.ముఖ్యంగా ఆర్సీబీకి ఎప్పుడూ మైనస్ గా ఉండే బౌలింగ్ విభాగంపై ఈసారి మేనేజ్ మెంట్ బాగా  దృష్టి పెట్టింది. సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్ వంటి యార్కర్ స్పెషలిస్టులతో డెత్ ఓవర్ల కష్టాలకు చెక్ పెట్టాలని చూస్తోంది.అయితే, ప్రతికూల అంశాలు కూడా కొన్ని ఉన్నాయి. స్పిన్ విభాగం కొంచెం బలహీనంగా కనిపిస్తోంది. టర్నింగ్ పిచ్‌లపై ప్రత్యర్థి బ్యాటర్లను అడ్డుకోవడం సుయాష్ శర్మ, కృనాల్ పాండ్యా పైనే భారం వేయనుంది.

ఒకవేళ హేజిల్‌వుడ్ గాయం నుంచి కోలుకోకుంటే బ్యాకప్ బౌలర్ల విషయంలో ఆర్సీబీ కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఈ సీజన్లో ఆర్సీబీ భవితవ్యం ముగ్గురు ఆటగాళ్లపైనే ఆధారపడి ఉంది. ఇప్పటికే ఐపీఎల్‌లో 8000కు పైగా పరుగులు చేసిన విరాట్ కోహ్లీ తన ఫామ్ కొనసాగిస్తే ఆర్సీబీని ఆపడం ఎవరికీ వల్లా కాదు. పవర్‌ప్లేలో ఫిలిప్ సాల్ట్ ఇచ్చే మెరుపు ఆరంభం జట్టుకు కీలకం. వీరితో పాటు ఫినిషర్‌గా టిమ్ డేవిడ్ తన పవర్ హిట్టింగ్‌తో మ్యాచ్‌లను మలుపు తిప్పగలడు. ఆ ముగ్గురూ క్లిక్ అయితే ఆర్సీబీకి ఎదురుండదు.ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం ఆర్సీబీ సులభంగా ప్లేఆఫ్స్ చేరుకునే అవకాశం ఉంది. రజత్ పాటిదార్ కెప్టెన్సీలో టీమ్ కెమిస్ట్రీ అద్భుతంగా ఉండటం, గత సీజన్ గెలిచిన ఆత్మవిశ్వాసం వారిని ఫేవరెట్లుగా నిలబెడుతోంది.

Published : 
  • 18 March 2026, 12:15 PM IST