మూడు మ్యాచ్ ల్లోనూ ఫ్లాప్ సంజు శాంసన్ పై వేటు ?

న్యూజిలాండ్ తో టీ20 సిరీస్‌ను భారత్ కైవసంచేసుకుంది. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా మూడో మ్యాచ్‌లోనూ అదరగొట్టి టీ ట్వంటీ ఫార్మాట్ లో తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 26, 2026 | 05:04 PMLast Updated on: Jan 26, 2026 | 8:08 PM

Will Sanju Samson Be Dropped After Failing In All Three Matches

న్యూజిలాండ్ తో టీ20 సిరీస్‌ను భారత్ కైవసంచేసుకుంది. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా మూడో మ్యాచ్‌లోనూ అదరగొట్టి టీ ట్వంటీ ఫార్మాట్ లో తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది.అయితే భారత జట్టు విజయాల బాటలో పయనిస్తున్నప్పటికీ, వ్యక్తిగతంగా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌పై మాత్రం తీవ్రమైన ఒత్తిడి నెలకొంది. ఈ సిరీస్‌లో ఇప్పటికే జరిగిన రెండు మ్యాచ్‌లలోనూ సంజూ శాంసన్ ఘోరంగా విఫలమయ్యాడు. మరోవైపు, రెండో వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ గత మ్యాచ్‌లో తన బ్యాటింగ్‌తో విధ్వంసం సృష్టించడంతో సంజూ ప్లేస్ డేంజర్ లో పడింది.టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, 2026 టీ20 వరల్డ్ కప్ ప్రణాళికల్లో భాగంగా సంజూ శాంసన్‌పై భారీ నమ్మకం ఉంచారు. ఇందుకోసం శుభ్‌మన్ గిల్ వంటి డాషింగ్ ఓపెనర్‌ను పక్కనపెట్టి మరీ సంజూ శాంసన్‌ను ఎంపిక చేశారు. అతనికి వరుసగా ఓపెనర్‌గా అవకాశాలు ఇస్తున్నప్పటికీ, న్యూజిలాండ్‌తో జరుగుతున్న సిరీస్‌లో సంజూ ఇప్పటివరకు నిరాశపరిచాడు.

నాగ్‌పూర్‌లో జరిగిన మొదటి టీ20లో కేవలం 10 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత రాయ్‌పూర్‌లో జరిగిన రెండో మ్యాచ్‌లో కూడా 6 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఇప్పుడు మూడో టీ20లో డకౌట్ అయ్యాడు.సంజూ శాంసన్ విఫలమవుతుంటే, మరోవైపు యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా ఒడిసిపట్టుకున్నాడు. గత మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ తన బ్యాట్‌తో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 32 బంతుల్లోనే 76 పరుగులు చేసి జట్టు విజయంతో కీలక పాత్ర పోషించాడు. ఇషాన్ కిషన్ ఈ మ్యాచ్‌లో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడటం, సంజూ శాంసన్ వైఫల్యం చెందడం ఇప్పుడు జట్టు కూర్పుపై చర్చకు దారితీసింది. ఇషాన్ ఫామ్ చూస్తుంటే అతన్ని తుది జట్టు నుంచి తప్పించడం కష్టంగా మారింది.

ఈ సిరీస్‌లోని చివరి రెండు మ్యాచ్‌లకు యువ సంచలనం తిలక్ వర్మ జట్టులోకి తిరిగి రానున్నారు. తిలక్ వర్మ జట్టులో చేరగానే అతనికి తుది జట్టులో కచ్చితంగా చోటు దక్కే అవకాశం ఉంది. దీంతో టీమ్ మేనేజ్‌మెంట్ ఒక ఆటగాడిని పక్కన పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుతం ఇషాన్ కిషన్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు కాబట్టి తప్పించే సాహసం గంభీర్ చేయకపోవచ్చు. దీంతో సహజంగానే ఒత్తిడి అంతా సంజూ శాంసన్‌పై పడుతోంది.ఈ నేపథ్యంలో తిలక్ వర్మ ఫిట్ నెస్ సాధించి జట్టులోకి వస్తే విశాఖ టీ ట్వంటీలో సంజూకు చోటు దక్కడం కష్టంగానే కనిపిస్తోంది.