నన్ను అవమానించారు…కోహ్లీ కెప్టెన్సీపై యువీ వ్యాఖ్యలు…!
టీమిండియా మాజీ క్రికెటర్, వరల్డ్ కప్ విన్నర్ యువరాజ్ సింగ్ తన రిటైర్మెంట్‌కు సంబంధించి సంచలన విషయాలు వెల్లడించాడు
టీమిండియా మాజీ క్రికెటర్, వరల్డ్ కప్ విన్నర్ యువరాజ్ సింగ్ తన రిటైర్మెంట్‌కు సంబంధించి సంచలన విషయాలు వెల్లడించాడు. కెరీర్ చివరి దశలో తనకు కనీస గౌరవం దక్కలేదని తెలిపాడు. జట్టులో ఒక్కరు కూడా తనకు అండగా నిలవలేదని, దాంతోనే రిటైర్మెంట్ ప్రకటించానని వెల్లడించాడు. తాను కూడా ఆటను ఆస్వాదించలేకపోయానని, గౌరవంగా వీడ్కోలు పలకడమే ఉత్తమమని భావించానని చెప్పాడు. ఒక దశలో తనకు ఎంతో ఇష్టమైన క్రికెట్‌పై విరక్తి కలిగిందని చెప్పుకొచ్చాడు. సుదీర్ఘ కాలం భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించిన యువరాజ్ సింగ్.. ధోనీ సారథ్యంలో టీమిండియా గెలిచిన టీ20 ప్రపంచకప్ 2007, వన్డే ప్రపంచకప్ 2011 విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. వన్డే ప్రపంచకప్‌లో ఓవైపు క్యాన్సర్‌తో పోరాడుతూనే అద్భుత ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు.
ఆస్ట్రేలియాతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో యువీ రక్తపు వాంతులు చేసుకున్న ఘటన ఇప్పటికీ అభిమానుల కళ్లలో కదలాడుతూనే ఉంటుంది.క్యాన్సర్ జయించి రీఎంట్రీ ఇచ్చిన యువరాజ్ సింగ్ మునపటిలా సత్తా చాటలేకపోయాడు. పేలవ ఫామ్‌తో జట్టులో చోటు కోల్పోయి 2019 వన్డే ప్రపంచకప్ ముందు అన్ని ఫార్మాట్ల ఆటకు వీడ్కోలు పలికాడు. యువరాజ్ సింగ్ రిటైర్మెంట్ అయిన సమయంలో టీమిండియా కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ ఉన్నాడు. అయితే ఏనాడు కోహ్లీని యువరాజ్ సింగ్ నిందించలేదు. కానీ జట్టులో తనకు ఎవరి నుంచి సరైన మద్దతు లభించలేదని భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తాజాగా నిర్వహించిన పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో తెలిపాడు.
కెరీర్ చివరి దశలో ఆటను ఆస్వాదించలేకపోయానని చెప్పాడు. ఆటను ఎంజాయ్ చేయనప్పుడు నేను క్రికెట్ ఎందుకు ఆడాలి అనే భావన కలిగిందన్నాడు. జట్టులో కూడా ఎవరి మద్దతు లభిస్తున్నట్లు అనిపించలేదనీ, కనీస గౌరవం కూడా దక్కలేదన్నాడు. తాను జట్టుకు భారంగా మారినట్లు చూశారనీ, దాంతో ఆటలో కొనసాగడం భావ్యం కాదని అనిపించిందన్నాడు. మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురయ్యాననీ, ఏరోజైతే ఆడటం ఆపేశానో.. ఆ రోజే తాను మళ్లీ యువరాజ్‌లా మారిపోయానంటూ చెప్పుకొచ్చాడు. ఇదే ఇంటర్వ్యూలో టీనేజ్ వయసులో తన సామర్థ్యాలపై తలెత్తిన ప్రశ్నలను యువరాజ్ సింగ్ గుర్తు చేసుకున్నాడు. వాటిని తాను అవమానంగా భావించకుండా మరింత మెరుగయ్యేందుకు కష్టపడ్డానని తెలిపాడు.











