ఉత్తరప్రదేశ్ కేడర్‌కు చెందిన 2013 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ దివ్య మిట్టల్ తన పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. 13 ఏళ్ల సర్వీస్ తర్వాత ఆమె తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. హర్యానాలోని రేవారీకి చెందిన దివ్య మిట్టల్ అత్యంత ప్రతిభావంతురాలు. IIT ఢిల్లీ నుంచి బీటెక్ పూర్తి చేశారు. ఆ తర్వాత ప్రతిష్టాత్మక IIM బెంగళూరు నుంచి MBA పూర్తి చేశారు. MBA పూర్తయిన తర్వాత దివ్య మిట్టల్‌కు లండన్‌లోని ప్రముఖ ఫైనాన్స్ సంస్థ 'జెపి మోర్గాన్' లో భారీ ప్యాకేజీతో అసోసియేట్‌గా ఉద్యోగం లభించింది. లండన్‌లో అన్ని సౌకర్యాలు, విలాసవంతమైన జీవితం ఉన్నప్పటికీ, ఏదో అసంపూర్ణత ఆమెను వెంటాడింది. దేశానికి ఏదో చేయాలన్న ఆమె తపన ఆమెను మళ్లీ ఇండియాకు తీసుకువచ్చింది.
వెంటనే భారత్‌కు వచ్చిన దివ్య మిట్టల్ సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యారు. మొదటి ప్రయత్నంలోనే IPS కు ఎంపికయ్యారు. మరుసటి ఏడాది 2012 సివిల్స్ ఫలితాల్లో ఆల్ ఇండియా 68వ ర్యాంక్ సాధించి.. 2013లో యూపీ కేడర్ ఐఏఎస్ అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. దివ్య మిట్టల్ మిర్జాపూర్, దేవిరియా, సంత్ కబీర్ నగర్ వంటి జిల్లాలకు కలెక్టర్‌గా పనిచేసి అద్భుతమైన గుర్తింపు తెచ్చుకున్నారు. మిర్జాపూర్ జిల్లాలోని 'లహురియాదహ్' గ్రామానికి స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్లలో ఎన్నడూ మంచినీటి సదుపాయం లేదు. స్థానిక సమస్యలు, సవాళ్లను అధిగమించి ఆ గ్రామానికి పైప్‌లైన్ ద్వారా మొదటిసారి కుళాయి నీటిని అందించారు. ఈ ఘటనతో ఆమె పేరు యూపీ మొత్తం మార్మోగిపోయింది. దేవిరియా జిల్లాలో అక్రమ భూక్రమణదారులపై కఠినంగా వ్యవహరించి, ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకున్నారు. రాజకీయ నాయకులకు, స్థానిక ఒత్తిళ్లకు తలవంచకుండా బాధితుల వైపే నిలబడ్డారు.
నిజాయితీగా పని చేస్తూ ప్రజల అభిమానాన్ని పొందిన ఆమెకు అవార్డులు రావాల్సింది పోయి, పలుమారు అకస్మాత్తుగా బదిలీలు ఎదురయ్యాయి. దేవిరియా కలెక్టర్‌గా ఉన్న ఆమెను లక్నోలోని రెవెన్యూ శాఖ స్పెషల్ సెక్రటరీగా బదిలీ చేశారు. ఇప్పుడు కూడా ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా ట్రాన్స్ఫర్ చేశారు. దీంతో ఆమె తన 13 ఏళ్ల కార్యనిర్వాహక ప్రయాణానికి ముగింపు పలికేశారు. తన 13 ఏళ్ల ఐఏఎస్ ప్రయాణానికి స్వచ్ఛంద విరమణ ప్రకటిస్తూ సోషల్ మీడియాలో భావోద్వేగ లేఖ రాశారు. "పదవి పోయినా, నా దేశం కోసం నేను కన్న కలలు సజీవంగానే ఉంటాయి. ప్రతి ప్రభుత్వ ఫైల్ వెనుక ఒక మనిషి ఉంటాడు, ఆ మనిషికి న్యాయం చేయడమే అసలైన అధికారం" అని ఆమె పేర్కొన్నారు. దివ్య మిట్టల్ రాజీనామాకు రాజకీయ ఒత్తిళ్లే కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. రాజకీయ ఒత్తిళ్లతోనే దివ్య రాజీనామా చేశారనే వార్త వైరల్ అవ్వడంతో స్వయంగా ఆమే ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు.
ఈ నిర్ణయం ఎలాంటి రాజకీయ, ఇతర ఒత్తిళ్ల వల్ల తీసుకున్నది కాదని, కుటుంబ ప్రాధాన్యతలు మరియు వ్యక్తిగత ఆసక్తుల కోసమేనని చెప్పారు. "ఐఏఎస్ అనేది నా జీవితంలో ఒక అధ్యాయం మాత్రమే, మొత్తం జీవితం కాదు" అంటూ కామెంట్ చేశారు. ఇక నుంచి తాను రైటింగ్, టీచింగ్, సోషల్ సర్వీస్‌లో చురుగ్గా ఉంటానని చెప్పారు. దివ్య మిట్టల్ పోస్ట్‌తో ఇప్పుడు యూపీ రాజకీయాల్లో ఒక కొత్త చర్చ మొదలయ్యింది. IASగా రాజీనామా చేసిన దివ్య.. త్వరలోనే రాజకీయాల్లోకి రాబోతున్నారు అనే వాదన మొదలయ్యింది. IASగా ఉన్న సమయంలో ఆమె స్పీడ్ చూసిన ప్రతీ ఒక్కరూ ఇదే అంటున్నారు. రాజకీయాల్లోకి రాకుండా తన భర్త వ్యాపారాలు చూసుకుంటుంది అనే వాదన కూడా ఉంది. అడ్మినిస్ట్రేషన్‌లో అదరగొట్టిన దివ్య మిట్టల్ పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇస్తారా లేదా చూడాలి.