నమస్తే వనక్కం.. తమిళనాడులోని ప్రముఖ దేవాలయాలకు వెళ్లే భక్తులకు అటు అక్కడి ప్రభుత్వం, ఇటు హైకోర్టు షాకింగ్ రూల్‌ను అమలులోకి తెచ్చాయి. సెప్టెంబర్ 1 నుంచి తమిళనాడు వ్యాప్తంగా ఉన్న 52 అత్యంత ప్రధానమైన దేవాలయాలలో మొబైల్ ఫోన్లపై సంపూర్ణ నిషేధాన్ని విధిస్తూ ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. రీసెంట్గా తమిళనాడు సీఎం పీఠాన్ని అధిరోహించిన ‘దళపతి’ విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ నిబంధనను పక్కాగా గ్రౌండ్ లెవెల్‌కు తీసుకెళ్లింది.ఇకపై గుడిలోకి వెళ్లేటప్పుడు ఫోన్‌ను బయట కౌంటర్లలో పెట్టాల్సిందే, లేదంటే స్విచ్ఛాఫ్ లేదా ఫ్లైట్ మోడ్ చేసైనా లోపలికి వెళ్లాల్సిందే. అసలు ఈ మొబైల్ బ్యాన్ వెనుక ఉన్న బలమైన కారణాలు ఏంటి? దీనివల్ల భక్తులకు వచ్చే ఇబ్బందులు ఏంటి? విజయ్ ప్రభుత్వం ఈ భద్రతను ఎలా పర్యవేక్షించబోతోంది?
ఈ రోజుల్లో దేవుడి దర్శనం అంటే.. భగవంతుడిని ప్రశాంతంగా చూడటం కంటే, తాము దేవుడిని చూస్తున్నట్టు ప్రపంచానికి సోషల్ మీడియా ద్వారా చూపించడమే ఎక్కువైపోయింది. గర్భగుడిలో ఉండే దేవతామూర్తులను దొంగచాటుగా ఫోటోలు తీయడం, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయడం, గర్భగుడి ముందే నిలబడి అమెరికాలో ఉన్న బంధువులకు వాట్సాప్ వీడియో కాల్స్ చేసి రన్నింగ్ కామెంట్రీ ఇవ్వడం వంటివి ఇప్పుడు నిత్యకృత్యంగా మారాయి. దీనివల్ల క్యూ లైన్లు స్తంభించిపోవడమే కాకుండా, పవిత్రమైన ఆలయాల ఆధ్యాత్మిక వాతావరణం దెబ్బతింటోందని ప్రభుత్వం భావించింది.
అందుకే పవిత్రతను కాపాడటానికి, భక్తుల ప్రైవసీని రక్షించడానికి 52 బడా టెంపుల్స్ పరిధిలో హిందూ ధార్మిక శాఖ ఈ నిషేధాన్ని అమలు చేసింది. నిజానికి ఈ మొబైల్ ఫోన్ల నిషేధం అనేది కేవలం విజయ్ ప్రభుత్వం స్వంతంగా తెచ్చిన రూల్ కాదు. గతంలో డిసెంబర్ 2022లో మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్.. ఆలయాల పవిత్రతను కాపాడటానికి తమిళనాడు అంతటా మొబైల్స్ వాడకాన్ని నిషేధించాలని, దీనికోసం ప్రత్యేక లాకర్లను ఏర్పాటు చేయాలని చారిత్రాత్మక తీర్పునిచ్చింది. ఆ జ్యుడీషియల్ ఆదేశాలను ఇప్పుడు సీఎం విజయ్ ప్రభుత్వం అధికారికంగా, అత్యంత కఠినంగా అమలు చేయడం ప్రారంభించింది.
ఈ 52 ఆలయాల జాబితాలో మధురై మీనాక్షి అమ్మవారి ఆలయం, పళని మురుగన్ టెంపుల్, శ్రీరంగం రంగనాథస్వామి ఆలయం, రామేశ్వరం మరియు తిరువణ్ణామలై వంటి అతిపెద్ద, ప్రపంచ ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఈ పెద్ద పెద్ద దేవాలయాల కాంపౌండ్ వాల్ దాటినప్పటి నుంచే ఈ నిషేధ రూల్స్ వర్తిస్తాయి. కోర్టు ఆదేశాలు, పర్యావరణ-ఆధ్యాత్మిక ఆలోచన బాగున్నా, క్షేత్రస్థాయిలో దీన్ని మేనేజ్ చేయడం మాత్రం అధికారులకు ఒక పెద్ద అగ్నిపరీక్ష లాగా మారింది.
ఈ రూల్ ప్రకారం భక్తులు తమ విలువైన స్మార్ట్ఫోన్లను గుడి వెలుపల ఉన్న ప్రత్యేక కౌంటర్లలో రూ.5 ఫీజు చెల్లించి డిపాజిట్ చేయాలి. అయితే లక్షలాది రూపాయల విలువైన ఫోన్లు, బ్యాంకింగ్ యాప్స్, పర్సనల్ డేటా ఉన్న డివైజ్‌లను అక్కడ భద్రంగా ఉంచుతారా? ఒకవేళ ఫోన్ పోతే లేదా డ్యామేజ్ అయితే బాధ్యత ఎవరిది? పండుగ రోజుల్లో వేలాది మంది భక్తులు ఒకేసారి క్యూ కడితే ఫోన్లు తిరిగి ఇవ్వడానికి ఎంత సమయం పడుతుంది? వంటి భూగోళమంత ప్రశ్నలు భక్తుల నుంచి వస్తున్నాయి.
పైగా ఆ సరెండర్ చేసే డిజిటల్ ఫోన్ కోసమే మళ్లీ కౌంటర్ల దగ్గర క్యూఆర్ కోడ్ల ద్వారా డిజిటల్ పేమెంట్ చేయాలనడం ఒక విచిత్రమైన పరిస్థితిగా మారింది. మన తిరుమల తిరుపతి దేవస్థానం లోనూ, కాశీ విశ్వనాథ్ టెంపుల్లోనూ ఇప్పటికే ఈ తరహా మొబైల్ ఆంక్షలు విజయవంతంగా నడుస్తున్నాయి. ఆలయాల లోపల లైవ్ టెలివిజన్ బ్రాడ్‌కాస్టింగ్ ద్వారా దేవుడిని చూపిస్తూ, వ్యక్తిగత ఫోన్లను నిషేధించడం ద్వారా అక్కడ క్యూ లైన్లు సజావుగా సాగుతున్నాయి. తమిళనాడులో కూడా సీఎం విజయ్ తీసుకొచ్చిన ఈ 'ఫ్లైట్ మోడ్' రూల్ సామాన్య భక్తుడితో పాటు విఐపిలకు, సెలబ్రిటీలకు కూడా సమానంగా వర్తింపజేస్తేనే ఈ వ్యవస్థకు ఒక గౌరవం వస్తుంది.కేవలం సామాన్యుడి ఫోన్ లాక్కుని, పెద్ద మనుషులను లోపలికి కెమెరాలతో వదిలేస్తే మాత్రం ఈ రూల్ అభాసుపాలు కావడం ఖాయం.