Top story: ట్రంప్‌కు చుక్కలు చూపిస్తున్న కిమ్.. అమెరికా లక్ష్యంగా బ్రహ్మాస్త్రం ప్రయోగం..!

శత్రువుల అంతుచూడటమే లక్ష్యంగా కిమ్ యాక్షన్‌లోకి దించిన మాన్‌స్టర్ షిప్ ఇదే.అదికూడా అమెరికా, జపాన్, సౌత్ కొరియా సంయుక్త సైనిక విన్యాసాల సమయంలో కావడంతో కొరియా ద్వీప కల్పంలో ప్రకంపనలు పుట్టిస్తోంది.

Post Published By: dialnews
Updated : 9 September 2026, 5:06 PM IST

శత్రువుల అంతుచూడటమే లక్ష్యంగా కిమ్ యాక్షన్‌లోకి దించిన మాన్‌స్టర్ షిప్ ఇదే.అదికూడా అమెరికా, జపాన్, సౌత్ కొరియా సంయుక్త సైనిక విన్యాసాల సమయంలో కావడంతో కొరియా ద్వీప కల్పంలో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఈ సందర్భంగా సముద్ర ఉపరితలంపైనే కాదు, సముద్ర గర్భంలోనూ తమ సార్వభౌమాధికారాన్ని తిరుగులేకుండా చాటుకునే సమయం ఆసన్నమైందంటూ కిమ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. తమ ప్రాదేశిక జలాల్లోకి చొరబడేందుకు ప్రయత్నించే ప్రత్యర్థులు కనీవినీ ఎరుగని భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించాడు. తమ వద్ద ఉన్న అధునాతన ఆయుధ వ్యవస్థలు కేవలం రక్షణ కోసమే కాదని, శత్రువుపై ఊహించని రీతిలో విధ్వంసక ప్రతిదాడులు చేయగల పూర్తి సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని ప్రకటించాడు.

ఉత్తర కొరియా అధికారిక మీడియా KCNA వెల్లడించిన వివరాల ప్రకారం.. నేవీకి అప్పగించిన 'కాంగ్ కొన్' న్యూక్లియర్ డిస్ట్రాయెర్‌ నౌకకు ఐదు వేల టన్నుల సామర్థ్యం ఉంది. ఈ నౌకను అత్యంత సంక్లిష్టమైన రాడార్ వ్యవస్థలు, శత్రు సబ్‌మెరైన్లను పసిగట్టే సోనార్ నెట్‌వర్క్, గగనతలం నుంచి దూసుకొచ్చే క్షిపణులను అడ్డుకునే ఎయిర్-డిఫెన్స్ వ్యవస్థలతో కూడిన ఫ్లోటింగ్ కోటగా తీర్చిదిద్దారు. శత్రు యుద్ధనౌకలను క్షణాల్లో నేలమట్టం చేయగల గైడెడ్ యాంటీ-షిప్ క్షిపణులను ప్రయోగించగల సాంకేతికత ఈ నౌక సొంతం.సరిగ్గా మూడు నెలల క్రితం పశ్చిమ తీరంలో 'చోయ్ హ్యోన్' అనే తొలి డిస్ట్రాయర్‌ను నేవీలో ప్రవేశపెట్టిన కిమ్ సైన్యం, ఇప్పుడు తూర్పు తీరంలో 'కాంగ్ కొన్‌ను యాక్షన్‌లోకి దించింది. కొరియా ద్వీపకల్పానికి ఇరువైపులా ఉన్న పశ్చిమ, తూర్పు సముద్రాల్ని ఏకకాలంలో నియంత్రించేలా ఈ మోహరింపు చేసినట్టు కనిపిస్తోంది.

పసుపు సముద్రం గుండా వచ్చే ముప్పును అడ్డుకుంటూనే, జపాన్ సముద్రం వైపు నుంచి అమెరికా, దక్షిణ కొరియా నౌకాదళాలను అడ్డుకోవడమే ఈ వ్యూహం వెనుక ఉన్న అసలు లక్ష్యం. ఈ మొత్తం వ్యవహారంలో అంతర్జాతీయ రక్షణ విశ్లేషకులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్న ప్రధానాంశం కిమ్ చేసిన ఒకే ఒక్క ప్రకటన. ఈ సరికొత్త డిస్ట్రాయర్‌ను తమ స్టేట్ న్యూక్లియర్ రెస్పాన్స్‌లో అంతర్భాగం చేస్తున్నట్లు కిమ్ ప్రకటించాడు. యుద్ధ నౌకలో నేరుగా అణ్వస్త్రాలు అమర్చారా లేదా అనే విషయాన్ని ప్యోంగ్యాంగ్ గోప్యంగా ఉంచినప్పటికీ, ఇది న్యూక్లియర్ సామర్థ్యం కలిగిన క్షిపణులను మోసుకెళ్లగలదని రక్షణ నిపుణులు భావిస్తున్నారు. చోయ్ హ్యోన్ తరహాలోనే, ఈ నౌక కూడా వ్యూహాత్మక అణు వార్‌హెడ్లను మోసుకెళ్లే సరికొత్త లాంగ్-రేంజ్ క్రూయిజ్ మిస్సైళ్లను ప్రయోగించే లాంచ్ ప్యాడ్‌గా వ్యవహరించగలదని చెబుతున్నారు.

ఇప్పటివరకు కిమ్ అణ్వస్త్రాలు కేవలం భూగర్భ సైలోలు, మొబైల్ లాంచర్లకే పరిమితమై ఉండేవి. కానీ యుద్ధం వచ్చినప్పుడు శత్రువులు భూమిపై ఉన్న స్థావరాలను ధ్వంసం చేసినప్పటికీ, సముద్రంలో మోహరించిన యుద్ధనౌకల ద్వారా శత్రువుల నగరాలు, సైనిక స్థావరాలపై భీకర అణు ప్రతిదాడి చేసే 'సెకండ్-స్ట్రైక్ సామర్థ్యాన్ని ప్యోంగ్యాంగ్ సాధించాలనుకుంటోంది. సముద్రపు లోతుల నుంచి ఏ క్షణమైనా దూసుకొచ్చే న్యూక్లియర్ విపత్తును ఎదుర్కోవడం ప్రత్యర్థి రాడార్లకు అత్యంత కష్టతరమైన సవాలుగా మారుతుంది. అందుకే, కొరియా ద్వీపకల్ప సమీపంలోని జెజు దీవి పరిసరాల్లో అమెరికా, దక్షిణ కొరియా, జపాన్ దేశాలు సంయుక్తంగా చేపట్టిన 'ఫ్రీడమ్ ఎడ్జ్' సైనిక విన్యాసాలు పతాక స్థాయికి చేరిన సమయంలోనే కిమ్ ఈ నౌకను దించారు. మూడు దేశాల ఫైటర్ జెట్లు, ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్లు కొరియా సరిహద్దుల్లో సవాలు చేస్తున్న వేళ.. ప్యోంగ్యాంగ్ తన స్వదేశీ డిస్ట్రాయర్‌ను జలప్రవేశం చేయించి సమాధానమిచ్చింది. అంతటితో ఆగకుండా, తాజా విన్యాసాలకు నిరసనగా ఒకేసారి పదికి పైగా స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించి శత్రు కూటమికి తన దూకుడైన వైఖరిని, ఎటువంటి సైనిక ఒత్తిడికైనా బెదిరేది లేదన్న సంకల్పాన్ని చాటిచెప్పింది.

ఇదిలా ఉంటే.. ఉత్తర కొరియా నౌకాదళ విస్తరణ ఇక్కడితో ఆగిపోలేదని, ఇది ఆరంభం మాత్రమేనని కిమ్ ప్రకటించారు. త్వరలోనే నేవీ ఆధునికీకరణలో తదుపరి కీలక దశను అధికారికంగా ప్రకటిస్తామని స్పష్టం చేశారు. తూర్పు తీరంలో అత్యాధునిక సీక్రెట్ నావికా స్థావరాల నిర్మాణం శరవేగంగా కొనసాగుతోందని వెల్లడించారు. వివిధ తరగతులకు చెందిన మరింత భారీ యుద్ధనౌకలను నిర్మించడంతో పాటు, సరికొత్త అడ్వాన్స్‌డ్ నేవీ యూనిట్లను సైన్యంలోకి చేర్చుతామని ప్రకటించడం ద్వారా ప్యోంగ్యాంగ్ దీర్ఘకాలిక నావికా విస్తరణ లక్ష్యాలను తేటతెల్లం చేశారు. మొత్తంగా.. వాన్సాన్ తీరంలో కాంగ్ కొన్ డిస్ట్రాయర్ ఎంట్రీ కొరియా జలాల్లో సైనిక సమీకరణాలను పూర్తిగా మార్చివేసింది. కఠిన అంతర్జాతీయ ఆంక్షలు, ఆర్థిక ఆంక్షలతో తమను ఏకాకిని చేయవచ్చని భావించిన పాశ్చాత్య దేశాలకు.. అధునాతన యుద్ధనౌకలు, అణు డిస్ట్రాయర్ల నిర్మాణంతోనే కిమ్ సమాధానమిస్తున్నారు. గగనతలం, భూతల రక్షణ వ్యవస్థలకే పరిమితం కాకుండా, సముద్రంలో కూడా అమెరికా కూటమికి దీటైన అణు ప్రతిస్పందనను సిద్ధం చేస్తూ, ఉత్తర కొరియాను పూర్తిస్థాయి నౌకాదళ అగ్రరాజ్యంగా మార్చే దిశగా కిమ్ జోంగ్ ఉన్ వేగంగా అడుగులు వేస్తున్నారు.

 

Published : 
  • 9 September 2026, 5:06 PM IST