వైసీపీలో ఒక వెలుగు వెలిగిన చిన్న శ్రీను పరిస్థితి టిడిపిలో చేరిన తర్వాత కుడితిలో పడ్డ ఎలకలా అయిపోయింది. టిడిపి అధినాయకత్వం అత్యంత రహస్యంగా చిన్న శ్రీనుని పార్టీలోకి ఆహ్వానించి.... కండువా కప్పేసిన, విజయనగరం జిల్లా టిడిపి క్యాడర్ మాత్రం ఈ పరిణామాన్ని దిగమింగుకోలేకపోతోంది. జిల్లా టిడిపి గ్రూపుల్లో ఈ విషయం స్పష్టంగా బయటపడింది. చిన్న శీను చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరినప్పుడు కలవడమే తప్ప ఆ తర్వాత ఒక్క టీడీపీ నాయకుడు కూడా సీనుతో కలిసి కూర్చోలేదు. శీనుకి టిడిపి అధిష్టానం ఏం హామీ ఇచ్చింది అన్నది ఇప్పటికీ రహస్యంగానే ఉంది . వైసీపీలో జడ్పీ చైర్మన్, పార్టీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు, పార్టీ భీమిలి సమన్వయకర్తగా ఒకేసారి ఏకంగా మూడు పదవులు అనుభవిస్తూ, బొత్స సత్యనారాయణ మేనల్లుడుగా చక్రం తిప్పిన చిన్న శ్రీను ఆకస్మికంగా టిడిపి కండువా కప్పుకోవడం వెనక పెద్ద పదవే ఆశించి ఉంటారని లోకల్ క్యాడర్ భావిస్తున్నారు. ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి కూడా కట్టబెడతామని టిడిపి అధిష్టానం హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే చిన్న శ్రీను కుమార్తె సహస్రకి విజయనగరం జడ్పీ చైర్మన్ పోస్ట్ ఇస్తామని కూడా హామీ ఇచ్చినట్లు సమాచారం.
టిడిపి అధిష్టానం ఏం చెప్పి తీసుకొచ్చిన..... చిన్న శ్రీను రాకని విజయనగరం టిడిపి నేతలు, క్యాడర్ మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. దూకుడుగా వెళ్లే చిన్న శ్రీను కొద్దిరోజుల తర్వాత తామందర్నీ దాటి అధిష్టానానికి దగ్గర అయిపోతే పరిస్థితి వస్తే, జిల్లాలో తమ పరిస్థితి ఏంటి అనే చర్చ కూడా జరుగుతుంది. చిన్న శ్రీను ని టిడిపిలోకి తీసుకురావడం, ఆయనకు ఎమ్మెల్సీ తో పాటు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇవ్వడాన్ని అశోక్ గజపతి రాజు కూడా అంగీకరించలేకపోతున్నారు. స్థానిక నేతలు కొందరు ఆయనకు ఫోన్లో మాట్లాడారు. ఇలా విజయనగరం టిడిపి నేతలు అందరినీ కాదని చిన్న శ్రీను మీ అధిష్టానం నెత్తిన పెట్టుకోడాన్ని అశోక్ తీవ్రంగా పరిగణిస్తున్నారూ. అవసరం అయితే గోవా గవర్నర్ పదవికి రాజీనామా చేసి, జిల్లాకు వచ్చి కూర్చుంటానని కూడా అశోక్ హెచ్చరించినట్లు ప్రచారం జరుగుతుంది. ఇది తెలిసి శీను వెంటనే భార్యని ,కుమార్తెను వెంటబెట్టుకుని అశోక్ గజపతి రాజును శాంతింప చేయడానికి హుటాహుటిన పరిగెత్తుకుంటూ గోవా వెళ్లారు.
గతంలో వైసీపీలో ఉన్నప్పుడు పార్టీ అధినేత ఆదేశాల వలన తెలిసో తెలియకో అశోక గజపతిరాజు పట్ల తప్పుగా వ్యవహరించి ఉండొచ్చని.... దానిని మనసులో పెట్టుకోవద్దని, టిడిపిలో అశోక్ గజపతిరాజు ఆశీస్సులు లేకుండా తనకు మునుగడ లేదని రకరకాలుగా విన్నపాలు చేసుకున్నాడట చిన్న శీను. గతంలో వైసిపి ఉత్తరాంధ్ర ఇన్చార్జి విజయ్ సాయి రెడ్డి తో కలిసి అశోక్ గజపతి రాజును చాలా ఇబ్బంది పెట్టాడు చిన్న శ్రీను. ఏకంగా సింహాచలం ట్రస్ట్ నుంచి అశోక్ గజపతిరాజును తప్పించడానికి కుట్ర చేశాడు. చిన్న శీను ,సాయి రెడ్డి కలిసి రాజుగారిని చాలా ఇబ్బందులు పెట్టారు. అవన్నీ రాజుగారు మర్చిపోలేదు. అయితే గోవా వచ్చిన చిన్న శీను కుటుంబంతో మంచిగానే మాట్లాడి పంపించాడు రాజుగారు. జిల్లాలో కూడా మంత్రి కొండపల్లి శ్రీనివాస్, సుజయ రంగారావు, కళా వెంకట్రావు... వీళ్ళు ఎవరితోని శ్రీనుకి మంచి సంబంధాలు లేవు.
అవి ఇప్పటికిప్పుడు సెట్ అయ్యే సూచనలు ఏవి కనిపించడం లేదు. వీళ్ళందర్నీ ఎలా సెట్ చేసుకోవాలి అనే విషయంలో సతమతమవుతున్నాడు చిన్న శీను. మరోవైపు వైసీపీ నాయకత్వం కూడా చిన్న శీను పార్టీ మార్పును సీరియస్ గానే తీసుకుంది. శ్రీను వియ్యంకుడు, నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే అప్పలనాయుడునీ పార్టీ నుంచి బయటికి పంపాలని డిసైడ్ అయిపోయింది వైసిపి. పార్టీ నుంచి తొలగించడానికి కసరత్తు కూడా మొదలు పెట్టింది. విజయనగరం వైసిపి జిల్లా ఇన్చార్జిని కూడా నియమించింది. మొన్నటి వరకు చంద్రబాబుని ,లోకేష్ ని నానా మాటలు అన్న చిన్న శ్రీను, ఆయన కుమార్తె సహస్ర ఇప్పుడు టిడిపి లీడర్స్ తో ఎలా కలిసి పని చేస్తారో అన్నది పెద్ద ప్రశ్నార్థకం. అన్నిటికీ మించి అశోక్ గజపతిరాజు కనక దారికి రాకపోతే విజయనగరం జిల్లాలో చిన్న శీనుకి మనుగడ కష్టమే.