పశ్చిమ ఆసియాలో యుద్ధ జ్వాలలు మరింత తీవ్రరూపం దాల్చుతున్నాయి. ముస్లిం ప్రపంచం అత్యంత పవిత్రంగా భావించే మక్కా నగరాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ మద్దతు గల హూతీ తిరుగుబాటుదారులు డ్రోన్ దాడికి తెగబడటం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ ఉద్రిక్తతల నడుమ.. సౌదీ అరేబియా, టర్కీ దేశాలతో పాకిస్తాన్ కుదుర్చుకున్న రక్షణ ఒప్పందంపై పాక్ సైన్యం కీలక ప్రకటన చేసింది. అసలు మక్కా నగరం సమీపంలో ఏం జరిగింది? ఈ మూడు దేశాల రక్షణ కూటమి వెనుక ఉన్న వ్యూహాలేంటి? దీనివల్ల ఇరాన్ తో సంబంధాలు దెబ్బతింటాయా?
పశ్చిమ ఆసియా యుద్ధంలో హూతీ తిరుగుబాటుదారులు సరికొత్త ఫ్రంట్‌ను తెరిచారు. సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాల అధికారిక ప్రకటన ప్రకారం.. మక్కా నగరానికి దక్షిణంగా ప్రయాణిస్తున్న ఒక శత్రు డ్రోన్‌ను సౌదీ సైన్యం గాల్లోనే విజయవంతంగా కూల్చివేసింది. పవిత్ర నగరాలైన మక్కా, మదీనాలతో పాటు అక్కడికి వచ్చే యాత్రికుల భద్రత తమకు "రెడ్ లైన్" అని, దీనిని ఎవరు దాటినా సహించేది లేదని సౌదీ స్పష్టం చేసింది. గత వారంలో జరిగిన హూతీల క్షిపణి, డ్రోన్ దాడుల కారణంగా దాదాపు 73 మంది పౌరులు గాయపడటంతో సౌదీ అరేబియా తన భద్రతను మరింత కఠినతరం చేసింది.
ఈ పరిణామాల నేపథ్యంలో, అంతర్జాతీయ మీడియా సంస్థ 'అల్ అరేబియా ఇంగ్లీష్' తో మాట్లాడిన పాకిస్తాన్ ఆర్మీ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి తమ రక్షణ వ్యూహాన్ని వెల్లడించారు. సౌదీ అరేబియా, టర్కీ దేశాలతో పాకిస్తాన్ కుదుర్చుకున్న రక్షణ ఒప్పందంలో ఎలాంటి "దురాక్రమణ లేదా దూకుడు అంశాలు" లేవని ఆయన స్పష్టం చేశారు. ఇది కేవలం పరస్పర రక్షణ మరియు సంయుక్త నిరోధక శక్తి పై ఆధారపడి ఏర్పాటైన అత్యంత శాంతియుతమైన కూటమి అని ప్రకటించారు. శత్రువుల నుంచి తమ మిత్రదేశాలను రక్షించుకోవడమే దీని ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.
ఈ త్రిపక్ష మిలిటరీ కూటమి వల్ల పొరుగు దేశమైన ఇరాన్‌తో పాకిస్తాన్ సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉందా? అనే ప్రశ్నకు పాక్ సైన్యం గట్టి సమాధానమే ఇచ్చింది. ఈ రక్షణ ఒప్పందం రాత్రికి రాత్రో లేదా హఠాత్తుగా ఊడిపడింది కాదని, ఈ దేశాల మధ్య దశాబ్దాలుగా ఉన్న వ్యూహాత్మక సంబంధాల ఆధారంగానే ఇది ఏర్పడిందని తెలిపారు. సౌదీ, టర్కీ దేశాలతో పాకిస్తాన్‌కు కేవలం సైనిక బంధమే కాకుండా.. బలమైన సాంస్కృతిక, భావోద్వేగ మరియు ప్రజల మధ్య సత్సంబంధాలు ఉన్నాయని గుర్తు చేశారు. అయితే, హూతీలకు ఇరాన్ నుంచి ఆయుధాలు, నిధులు అందుతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో.. ఈ కూటమి భవిష్యత్తులో ఎలాంటి మలుపులు తిరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది.
ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగితే కేవలం ఆసియా దేశాలే కాదు, ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉంది. ఇప్పటికే వ్యూహాత్మక ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్ నిలిచిపోవడంతో సౌదీ అరేబియా ఐరోపా దేశాలకు పంపే చమురు సరఫరాను తగ్గించేసింది. స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ గుండా జరిగే నౌకల రాకపోకలకు కూడా అంతరాయం కలుగుతోంది. ఒకవేళ హూతీల దాడులు పవిత్ర నగరాలపై మరింత తీవ్రమైతే.. పాకిస్తాన్, టర్కీ దేశాలు నేరుగా రంగంలోకి దిగే అవకాశాలు కూడా లేకపోలేదు. గల్ఫ్ దేశాలలో మారుతున్న రక్షణ సమీకరణాలు ప్రపంచ రాజకీయాలను ఏ విధంగా శాసిస్తున్నాయో.