తెలంగాణ శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విసిరిన పవర్ ఫుల్ పొలిటికల్ బాంబు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. సెక్షన్ 22A నిషేధిత భూముల జాబితా మరియు ‘ధరణి’ పోర్టల్ అక్రమాల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని భావించిన ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్కు సీఎం రేవంత్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ కీలక నేతల భూ ఆక్రమణలు, ఆస్తుల చిట్టాను సభ ముందట పెట్టి “కేసీఆర్ ఫ్యామిలీ భూముల పుట్టను” బద్దలు కొట్టారు. శాసనసభలో సెక్షన్ 22A నిషేధిత భూములపై జరిగిన సుదీర్ఘ చర్చలో ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను సీఎం రేవంత్ రెడ్డి ఖండించారు.
రాష్ట్రంలో దాదాపు 98 లక్షల ఎకరాల భూమి 22A జాబితాలో ఉండాల్సిందేనని, వీటిని కాపాడటం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని స్పష్టం చేశారు. వివాదమంతా కేవలం 3.77 లక్షల ఎకరాల ప్రైవేట్ పట్టా భూములకు సంబంధించి మాత్రమే ఉందని, కానీ బీఆర్ఎస్ నేతలు కోటి ఎకరాలు నిషేధిత జాబితాలో పడ్డాయంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. జీఓ 58, 59, 166 ద్వారా క్రమబద్ధీకరించిన భూములు, బ్యాంక్ వేలంలో కొనుగోలు చేసిన భూములను 22A నిషేధిత జాబితా నుంచి త్వరలోనే తొలగిస్తామని సీఎం హామీ ఇచ్చారు. పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి ఉన్నత స్థాయి అధికారుల కమిటీని ఒక వారంలో సమగ్ర మార్గదర్శకాలను తీసుకొస్తామని ప్రకటించారు.
కేసీఆర్ హయాంలో తీసుకొచ్చిన ‘ధరణి’ పోర్టల్ తెలంగాణ సమాజాన్ని పట్టి పీడిస్తున్న భూతమని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. భూ రికార్డులను డిజిటలైజ్ చేసే నెపంతో కేసీఆర్ తన మెదడు రంగరించి ఈ వ్యవస్థను డిజైన్ చేశారని, కానీ దీని వెనుక వేల కోట్ల రూపాయల భూ దోపిడీ దాగి ఉందని ఆరోపించారు. ధరణి నిర్వహణ కాంట్రాక్టులను విదేశీ, ప్రైవేట్ కంపెనీలకు కట్టబెట్టి అక్రమాలకు పాల్పడ్డారని, దీనిపై ప్రత్యేక విచారణ బృందం చేత సమగ్ర విచారణ జరిపిస్తామని ప్రకటించారు. ఇక శాసనసభలో కేసీఆర్ కుటుంబంతో పాటు ఆ పార్టీ మాజీ మంత్రులు, నాయకులు పొందిన భూముల వివరాలను సీఎం రేవంత్ రెడ్డి బయటపెట్టారు. కేసీఆర్ ఆయన భార్య పేర్ల మీద సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లి, మిట్టపల్లి, శివార్ వెంకటాపూర్ ప్రాంతాల్లో 67.13 ఎకరాల భూమి ఉన్నట్టు చెప్పారు సీఎం రేవంత్.
కేటీఆర్ ఫ్యామిలీకి సిద్దిపేట, రంగారెడ్డి జిల్లాల్లోని ఎర్రవెల్లి, జన్వాడ, మర్కూక్, శివారు వెంకటాపూర్ ప్రాంతాల్లో 123.19 ఎకరాల భూమి ఉన్నట్టు చెప్పారు. హరీష్ రావు ఫ్యామిలీకి రంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లోని మిట్టపల్లి, సందిపల్లి, రామంచ, అజీజ్‌నగర్ ప్రాంతాల్లో 30.16 ఎకరాల భూమి ఉన్నట్టు చెప్పారు. అలాగే కవిత ఫ్యామిలీకి 37.26 ఎకరాలు, సంతోష్ రావు ఫ్యామిలీకి 79.20 ఎకరాల భూమి ఉన్నట్టు వివరించారు. ఇవే కాకుండా కల్వకుంట్ల కుటుంబ సభ్యుల పేరు మీద మొత్తంగా 493.30 ఎకరాల భూమి ఉందని వివరించారు. ల్యాండ్ సీలింగ్ చట్టం ప్రకారం ఒక కుటుంబానికి గరిష్టంగా 27 ఎకరాల సాగు భూమి లేదా 54 ఎకరాల మెట్ట భూమి మాత్రమే ఉండటానికి వీలుందని, కానీ కేసీఆర్ కుటుంబం నిబంధనలను ఉల్లంఘించి వందల ఎకరాలు ఆక్రమించుకుందని ఆరోపించారు.
వీళ్లతో పాటు మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, పైలట్ రోహిత్ రెడ్డి అసైన్డ్, ఇనాం భూములను తమ పేర్లపైకి మార్చుకుని ఫామ్‌హౌస్‌లు నిర్మించుకున్నారని రేవంత్ రెడ్డి సభ దృష్టికి తీసుకొచ్చారు. ఈ చర్చలో అత్యంత సంచలనాత్మకమైన అంశం కేసీఆర్‌కు చెందిన ఎర్రవల్లి ఫామ్‌హౌస్ భూముల విచారణ. ఎర్రవల్లి ఫామ్‌హౌస్ పరిధిలోని మొత్తం 700 ఎకరాల భూమిలో దాదాపు 388 ఎకరాల ప్రభుత్వ, నిషేధిత భూమి కేసీఆర్ ఆధీనంలో ఉందని సీఎం రేవంత్ సంచలన ఆరోపణలు చేశారు. ఎర్రవల్లి ఫామ్‌హౌస్ సరిహద్దులు, ఆక్రమణల లెక్క తేల్చడానికి రెవెన్యూ అధికారులకు 30 రోజుల గడువు విధించారు. చట్ట ప్రకారం మాజీ సీఎం కేసీఆర్‌కు తక్షణమే నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. విచారణలో ఎర్రవల్లి ఫామ్‌హౌస్ పరిధిలో ఉన్న భూమి ప్రభుత్వ భూమిగా తేలితే, ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని, గతంలో అక్కడ నిరసన తెలిపిన దళితులు, స్థానిక పేదలకు ఆ స్థలాన్ని పంచుతామని స్పష్టం చేశారు.
సీఎం చెప్పినట్టుగానే అధికారులు ఎర్రవెల్లి భూముల చిట్టా విప్పడం మొదలు పెట్టారు. ఎర్రవెల్లిలో ప్రభుత్వ భూములు ఎంత, కబ్జాకు గురైన భూములు ఎంత అని తేల్చేందుకు గ్రౌండ్లోకి దిగారు. మొత్తానికి, సెక్షన్ 22A భూముల అంశంపై అసెంబ్లీలో జరిగిన చర్చ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య రాజకీయ యుద్ధానికి వేదికైంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అస్త్రాన్ని ప్రయోగించాలని చూసిన బీఆర్ఎస్పై సీఎం రేవంత్ రెడ్డి ఎదురుదాడి చేసి, కేసీఆర్ కుటుంబ భూముల విచారణ, ఎస్ఈటీ కమిటీ ఏర్పాటు ప్రకటనలతో బీఆర్ఎస్ కేడర్‌ను ప్రతిరోధకంలోకి నెట్టారు. 30 రోజుల్లో రానున్న విచారణ నివేదిక తెలంగాణ రాజకీయాల్లో మరిన్ని ఊహించని పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది.