అంతర్జాతీయ టీ20ల్లో టీమిండియా చరిత్ర సృష్టించింది. ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన తమ పాత రికార్డ్‌ను సమం చేసింది. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో తిరువనంతపురం వేదికగా జరిగిన ఆఖరి మ్యాచ్‌లో భారత బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. 23 సిక్సర్లతో పాటు 17 ఫోర్లు బాది న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు చూపించారు. ఇషాన్ కిషన్ కేవలం 43 బంతుల్లో 6 ఫోర్లు, 10 సిక్స్‌లతో 103 పరుగులు చేయడంతో భారత్ భారీస్కోర్ నమోదు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 271 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీతో రాణించగా.. హార్దిక్ పాండ్యా, అభిషేక్ శర్మ కూడా మెరుపులు మెరిపించారు. భారత బ్యాటర్ల ధాటికి న్యూజిలాండ్ బౌలర్లు ధారళంగా పరుగులిచ్చుకున్నారు.
ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ లో ఇషాన్ కిషన్ 10, సూర్యకుమార్ యాదవ్ 6, హార్దిక్ పాండ్యా 4, అభిషేక్ శర్మ రెండు సిక్స్‌లతో పాటు ఆఖరి బంతికి శివమ్ దూబే సిక్స్ కొట్టడంతో మొత్తం 23 సిక్స్‌లు నమోదయ్యాయి. అంతర్జాతీయ టీ20ల్లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డ్ ఇప్పటికే భారత జట్టుపై ఉంది. 2024 నవంబర్‌లో జోహన్నెబర్గ్లో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో భారత్ 23 సిక్సర్లు బాదింది. అప్పడు తిలక్ వర్మ 10, సంజూ శాంసన్ 9, అభిషేక్ శర్మ 4 సిక్స్‌లు బాదారు.
తాజాగా ఈ రికార్డ్‌ను భారత్ మరోసారి అందుకుంది. అలాగే ఒక ద్వైపాక్షిక సిరీస్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన జట్టుగా కూడా భారత్ నిలిచింది. తాజా సిరీస్‌లో భారత్ ఐదు మ్యాచ్‌ల్లో కలిపి 69 సిక్స్‌లు బాదింది. ఈ క్రమంలో ఇంగ్లండ్ పేరిట ఉన్న 64 సిక్స్‌ల రికార్డ్‌ను అధిగమించింది. 2023లో వెస్టిండీస్‌తో జరిగిన 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇంగ్లండ్ 64 సిక్స్‌లు బాదింది. గతేడాది వెస్టిండీస్‌తో ఆస్ట్రేలియా కూడా 64 సిక్స్‌లు బాదగా.. ఇండోనేషియాపై కంబోడియా 62 సిక్స్‌లతో నాలుగో స్థానంలో కొనసాగుతుంది. టెస్ట్ హోదా కలిగిన జట్లలో ఇది ఐదో అత్యధిక స్కోర్‌గా నిలిచింది. ఈ జాబితాలో 304 పరుగులతో ఇంగ్లండ్ అగ్రస్థానంలో ఉండగా 297 రన్స్ తో భారత్ రెండో స్థానంలో నిలిచింది.