ఒకప్పుడు సినిమాల్లో బూతులు వినిపిస్తే సెన్సార్ బోర్డు కత్తెరకు పనిచెప్పేది. కానీ ఇప్పుడు ఏకంగా పాటల రూపంలోనే బూతులు వినిపిస్తుంటే అడ్డుకట్ట వేసేదెవరు..? దివంగత హాస్యనటుడు ఎం.ఎస్. నారాయణ ఒక సినిమాలో భాష చచ్చిపోతోంది.. సాహిత్యం సచ్చిపోతోంది అని ఆవేదన వ్యక్తం చేస్తారు. ఆ సీన్ చూసి మనం నవ్వుకున్నాం కానీ.. రాబోయే రోజుల్లో తెలుగు సినిమా పాటల పరిస్థితి ఇంత దారుణంగా తయారవుతుందని ఆయన ముందే ఊహించి ఉంటారు. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక పాట వింటే, ఆయన ఆత్మ ఎంత ఘోషించుకుందో అనిపించక మానదు. ప్రముఖ బుల్లితెర నటుడు ప్రభాకర్ తనయుడు, తనదైన ఆటిట్యూడ్ తో సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అయ్యే చంద్రహాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం బరాబర్ ప్రేమిస్తా. టైటిల్ వినగానే ఇదేదో పక్కా మాస్ లవ్ స్టోరీ అని అంతా అనుకున్నారు. కానీ ఈ సినిమా నుంచి బయటకొచ్చిన ఒక పాట మాత్రం తెలుగు ప్రేక్షకులకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది.
పాటలో సాహిత్యం ఉండాలి, మాస్ బీట్ ఉండాలి.. కానీ ఇందులో మాత్రం కేవలం సభ్య సమాజం తలదించుకునే పదాలు మాత్రమే ఉన్నాయి. ముఖ్యంగా ఈ పాటలో గుంజి గుంజి గుంజి.. అంటూ మొదలై.. చివరగా వచ్చే పదం వినడానికి, పలకడానికి కూడా అసహ్యంగా ఉంది. డబుల్ మీనింగ్ డైలాగులు సినిమాల్లో ఉండటం చూశాం కానీ.. మరీ ఇంత పచ్చిగా, స్ట్రెయిట్ గా బూతు పదాన్ని పాటలో ఇరికించడం బహుశా ఇదే మొదటిసారి కావచ్చు. అసలు పాట రాసేటప్పుడు రచయితకు చెయ్యి ఎలా వచ్చింది? రికార్డ్ చేసేటప్పుడు సింగర్ ఎలా పాడారు? సెట్స్ లో దీన్ని ఎలా పిక్చరైజ్ చేశారు? అన్న ప్రశ్నలు సగటు ప్రేక్షకుడి మదిలో మెదులుతున్నాయి.ఈ పాట రిలీజ్ అయినప్పటి నుంచి సోషల్ మీడియాలో నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. మాస్ అంటే బూతులు కాదు బ్రో.. తెలుగు పాట స్థాయిని ఇంతలా దిగజార్చాలా? అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మీమర్స్ అయితే ఈ పాటను ఏ రేంజ్ లో ఆడుకుంటున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
పబ్లిసిటీ కోసం ఎంతకైనా తెగిస్తారా? నెగటివ్ పబ్లిసిటీ కూడా పబ్లిసిటీనే అనుకుంటున్నారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇంట్లో అందరూ కూర్చుని టీవీ చూస్తున్నప్పుడు పొరపాటున ఈ పాట వస్తే.. ఛానల్ మార్చడానికి రిమోట్ వెతుక్కోవాల్సిన పరిస్థితి కల్పించారు. ఇంత జరుగుతున్నా సోషల్ మీడియాలో ఇంత రచ్చ అవుతున్నా చిత్ర యూనిట్ గానీ, నిర్మాతలు గానీ ఇప్పటివరకు స్పందించలేదు. బహుశా ఈ వివాదమే సినిమాకు హైప్ తెస్తుందని వాళ్ళు భావిస్తున్నారేమో..! కానీ కళను, భాషను బలిపెట్టి తెచ్చుకునే క్రేజ్ ఎన్నాళ్లు ఉంటుంది? ఇప్పటికైనా మేకర్స్ స్పందించి.. ఆ పనికిమాలిన, అభ్యంతరకరమైన లిరిక్స్ తొలగిస్తారో లేక మా ఇష్టం అని మొండిగా వెళ్తారో చూడాలి.